మార్చి నెల జీతం ఇవ్వండి

ABN , First Publish Date - 2022-05-16T06:35:46+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం వలంటీర్లకు శాపంగా మారింది.. నేటికీ ఒక నెల జీతం విడుదల కాకపోవడంతో ఎదురుచూపులు చూస్తున్నారు.

మార్చి నెల జీతం ఇవ్వండి

315 మంది వలంటీర్లకు విడుదల కాని వేతనం

అధికారుల నిర్లక్ష్యమే కారణం  

 నేటికీ ఎదురుచూపులు


రాజమహేంద్రవరం రూరల్‌, మే 15 : అధికారుల నిర్లక్ష్యం వలంటీర్లకు శాపంగా మారింది.. నేటికీ ఒక నెల జీతం విడుదల కాకపోవడంతో ఎదురుచూపులు చూస్తున్నారు.రాజమహేంద్రవరం రూరల్‌ మండలం హుక్కంపేట, కోలమూరు, కాతేరు గ్రామాల్లో సుమారు 315 మంది గ్రామ వలంటీర్లు సేవలందిస్తున్నారు. మూడు గ్రా మాల వలంటీర్లకు ఈ ఏడాది మార్చి నెలకు సంబంఽధించిన జీతం ఇంకా ఇవ్వ లేదు.ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున రూ. 15.75 లక్షలు విడుదల కావాల్సి ఉంది. దీనిపై ఆయా వలంటీర్లు ఆంధ్రజ్యోతిని ఆశ్రయించారు. ఈ మేరకు ఏమిటా అని ఆరా తీస్తే.. ఆయా వలంటీర్లకు జీతాలు బిల్లు పెట్టడంలో అధికారులు జాప్యం చేయడంతో నేటి వరకూ మార్చి నెల జీతం విడుదల కాలేదు. చాలీచాలని జీతాలతో కాలం గడుపుతున్న వలంటీర్లకు ఒక నెల వేతనం రాకపోవడం అదికూడా ఎప్పుడు వస్తుందో తెలియక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన చోట్ల వలంటీర్ల జీతాలు పెండింగ్‌ లేవు. రూరల్‌ మండలంలో కావాలనే నిర్లక్ష్యం వహించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెల 24వ తేదీ తర్వాత బిల్లులు పెడితే మరుసటినెల 5వ తేదీలోగా వలంటీర్ల బ్యాంక్‌ ఖాతాలో జీతాలు జమచేస్తున్నారు. మార్చి నెల మాత్రమే పెండింగ్‌లో పెట్టి ఏప్రిల్‌ నెల పంపిణీ చేసేశారు. కాని మార్చి గురించి మాట్లాడకపోవడం శోచనీయం. దీంతో మార్చి నెల జీతం వస్తుందో రాదో అర్ధంకాని పరిస్థితిలో వలంటీర్లు ఉన్నారు. దీనిపై సోమవారం స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయా వలంటీర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్చి నెల జీతం విడుదల చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-05-16T06:35:46+05:30 IST