వలంటీర్లకు ఉన్న గుర్తింపు కూడా లేదు

ABN , First Publish Date - 2022-06-26T06:46:02+05:30 IST

వలంటీర్లకు ఉన్న గుర్తిం పు కూడా తమకు లేదని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఈనాటికీ ప్రభుత్వ కార్యాలయాల్లోను, పోలీస్‌స్టేషన్‌లోను ఎవరూ పట్టించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తంచేశాయి.

వలంటీర్లకు ఉన్న గుర్తింపు కూడా లేదు
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ భరత్‌రామ్‌

  • పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదు
  • వైసీపీ ప్లీనరీలో పార్టీ శ్రేణుల మనోవేదన

కడియం/రాజమహేంద్రవరం రూరల్‌, జూన్‌ 25: వలంటీర్లకు ఉన్న గుర్తిం పు కూడా తమకు లేదని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఈనాటికీ ప్రభుత్వ కార్యాలయాల్లోను, పోలీస్‌స్టేషన్‌లోను ఎవరూ పట్టించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తంచేశాయి. వైసీపీ రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ ప్లీనరీ రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ అధ్యక్షతన శనివారం గాదాలమ్మనగర్‌ బీవీఆర్‌-శ్రీ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సందర్భంగా కడియం మండలాధ్యక్షుడు యాదల స్టాలిన్‌ మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా నేటికీ తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందన్నారు. పోలీసులు వైసీపీ శ్రేణుల వాహనాలు ఆపడం, వారికి అపరాధ రుసుము రాస్తున్నారన్నారు. పాలన ప్రారంభంలో పింఛన్లు తీసుకున్న అర్హులైన పేదల్లో కొందరికి నేడు ఆగిపోవడం విచారక రమన్నారు. రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు మాట్లాడుతూ ఆర్‌బీకే, సచివాలయ భవనాల నిర్మాణానికి పార్టీ శ్రేణులు ముందుకొచ్చి రుణాలు తెచ్చి పను లు చేస్తే నేటికీ వారికి రూపాయి కూడా రాలేదని, అనేక ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కార్యకర్తలను ఎక్సైజ్‌ శాఖ ఇబ్బందు లకు గురిచేస్తోందని, సారా అమ్ముతున్నారంటూ కేసుల్లో ఇరికిస్తున్నారని రూరల్‌ మండలాధ్యక్షుడు ఉప్పులూరి సత్యనారాయణ అన్నారు. 

అన్నివర్గాల సంక్షేమానికి కృషి: ఎంపీ భరత్‌

పేదలతో పాటు అన్నివర్గాల సంక్షేమానికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని, రాజమహేంద్రవరాన్ని మోడల్‌సిటీగా తీర్చిదిద్దుతామని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. కోఆర్డినేటర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ నాయకుల ఎదుగుదలకు కార్యకర్తలే కారణమని, వారికి సముచిత స్థానం, సరైన గుర్తింపు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కొందరి స్వార్థపూరిత ఆలోచనలతో, పాలకుల నిర్ణయంతో రాష్ట్రం ముక్కలై ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పార్టీలతో పనిలేకుండా అర్హులైన ప్రతీ పేదవానికి అందుతున్నాయన్నారు. రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, ప్లీనరీ జిల్లా పరిశీలకులు వంకా రవీంద్రనాధ్‌ మాట్లాడుతూ పార్టీలో అంతా ఐకమత్యంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్‌, కడియం మండలాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T06:46:02+05:30 IST