నిర్భయంగా ఓటేయండి

ABN , First Publish Date - 2021-04-17T07:12:17+05:30 IST

‘ఉప ఎన్నికకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ఓటర్లంతా నిర్భంగా ఓటేయాలి’ అని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పిలుపునిచ్చారు.

నిర్భయంగా ఓటేయండి
పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలిస్తున్న వెంకట అప్పలనాయుడు

స్థానిక పోలీసులతోపాటు కేంద్ర బలగాల మోహరింపు

సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్‌ కేంద్రాలు 

తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు


తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 16: ‘ఉప ఎన్నికకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ఓటర్లంతా నిర్భంగా ఓటేయాలి’ అని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ఎంఆర్‌పల్లె పోలీసు పరేడ్‌ మైదానంలో శుక్రవారం పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ సమస్య తలెత్తినా తమకు తెలిసిపోతుందని, అన్ని పోలింగ్‌ కేంద్రాలూ సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయన్నారు. ఈ కెమెరాలను ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసినట్టు వెల్లడించారు. ప్రత్యేక పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాల ద్వారా అన్నిపోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షిస్తుంటారన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా రెండు, మూడు నిమిషాల్లో సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దుతారన్నారు. ఇప్పటికే సీఐఎ్‌సఎఫ్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు జిల్లాకు వచ్చాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్దఎత్తున మోహరించిట్టు చెప్పారు. 


అప్రమత్తంగా విధులు నిర్వర్తించండి

అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు. సిబ్బంది దృష్టి ఈవీఎంపైనే ఉండాలన్నారు. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా అధికారులకు తక్షణం సమాచారం అందించాలని సూచించారు. బాడీవోర్న్‌, డ్రోన్‌ కెమెరాలనూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటర్లను క్షుణ్ణంగా పరిశీలించాకే తర్వాతే పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించాలన్నారు. నీళ్లు, తదితర ద్రవ పదార్థాలను కేంద్రంలోకి అనుమతించొద్దన్నారు. కేంద్రాలవద్ద బారికేడ్లను తప్పనిసరిగా పెట్టాలన్నారు. అర్బన్‌జిల్లా పరిపాలనా విభాగం అదనపు ఎస్పీ సుప్రజ, డీఎస్పీలు పాల్గొన్నారు. పోలింగ్‌ను ప్రశాంతంగా, విజయవంతంగా ముగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 


బందోబస్తులో 3,245 మంది

బందోబస్తులో 3,245 మంది సిబ్బంది ఉంటాయని ఎస్పీ తెలిపారు. వీరిలో.. అదనపు ఎస్పీలు 10, డీఎస్పీలు 27, సీఐలు 66, ఎస్‌ఐలు 169, ఏఎ్‌సఐ, హెడ్‌కానిస్టేబుళ్లు 697, కానిస్టేబుళ్లు 1,519, ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది 234, హోంగార్డులు 191 మందితోపాటు 716 మంది సీఆర్పీఎఫ్‌, సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది, అధికారులతోపాటు రూట్‌ మొబైల్స్‌ 105, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ 27, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ 13, ఎస్‌ఎ్‌సటీ టీమ్స్‌ 8, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ 8, ఇంటర్వెన్షన్‌, మహిళా ఇంటర్వెన్షన్‌ టీమ్స్‌ 19తో కలిపి మొత్తం 3,245 మంది ఉంటారన్నారు. ఓటర్లు ఎవరూ భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. గొడవలు, అల్లర్లకు పాల్పడి కేసుల్లో ఇరుక్కోవద్దని హెచ్చరించారు. ఏ సమస్యవచ్చినా పోలీసులకు తెలియజేయాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. ఇబ్బందులున్నవారు 100, 63099 13960, 80999 99977 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-04-17T07:12:17+05:30 IST