పెద్ద చిత్రాల ఓటు..

May 14 2021 @ 05:00AM

థియేటర్లకే!

కాలం గిర్రున తిరిగొచ్చింది! 

గత ఏడాది వేసవిలో...

ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో?

ఇప్పుడు అటువంటి పరిస్థితులే ఉన్నాయి!

ప్రస్తుతానికి, థియేటర్లలో ప్రదర్శనలకు ఫుల్‌స్టాప్‌ పడింది.

మరి, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల సంగతి ఏంటి?

థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితులు వచ్చేవరకూ వేచి చూస్తారా?

ఓటీటీకి ఇస్తారా? అంటే... థియేటర్లకే పెద్ద చిత్రాలు ఓటు వేశాయి.


తెలుగు చిత్ర పరిశ్రమ జపించే మంత్రం.... థియేటర్లు! ఎప్పుడూ... ప్రేక్షకులకు వెండితెరపై చిత్రాన్ని చూపించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. ‘వి’, ‘నిశ్శబ్దం’ - తప్పితే గత ఏడాది ఓటీటీలోకి వచ్చిన భారీ బడ్జెట్‌ చిత్రాల సంఖ్య తక్కువే. ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’, ‘జోహార్‌’, ‘ఒరేయ్‌ బుజ్జిగా’, ‘కలర్‌ ఫొటో’, ‘మా వింతగాథ వినుమ’ చిత్రాలు డిజిటల్‌ తెరపైకి వచ్చాయి. థియేటర్లు మళ్లీ ఎప్పుడు తెరచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో, ఓటీటీకి ఓటు వేశామని అప్పట్లో ఆయా దర్శక-నిర్మాతలు, హీరోలు చెప్పారు. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘వైల్డ్‌ డాగ్‌’ అయితే ఓటీటీ డీల్స్‌ క్యాన్సిల్‌ చేసుకుని మరీ థియేటర్లలోకి వచ్చాయి. ‘క్రాక్‌’, ‘రెడ్‌’, ‘ఉప్పెన’, ‘నాంది’, ‘చెక్‌’, ‘జాతి రత్నాలు’, ‘వకీల్‌ సాబ్‌’ తదితర చిత్రాలు థియేటర్లు ఓపెన్‌ చేసేవరకూ వెయిట్‌ చేశాయి. 


మరి, ఇప్పుడు? థియేటర్లు తెరచుకోవడానికి మరో చాలా సమయం పడుతుందని ఫిల్మ్‌నగర్‌ ఖబర్‌. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు ఓటీటీ వేదికల నుంచి ఆఫర్లు వస్తున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే... ప్రస్తుతానికి భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ థియేటర్లకు ఓటు వేశాయి. ఎప్పుడు తెరచుకుంటాయా? అని ఎదురు చూస్తున్నాయి. ‘బాహుబలి’, ‘అవేంజర్స్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలను వెండితెరపై చూసి ఆస్వాదించాలని, థియేటర్లు పునః ప్రారంభమయ్యేవరకూ వేచి చూస్తామని ఎన్టీఆర్‌ చెప్పిన సంగతి తెలిసిందే.


కరోనా రెండో దశ వ్యాప్తికి ముందే ‘లవ్‌ స్టోరి’ బృందం పరిస్థితిని అంచనా వేసింది. ఏప్రిల్‌ 16న విడుదల చేయాలనుకున్నా... పరిస్థితుల ప్రభావం వల్ల వాయిదా వేసింది. థియేటర్లు ఓపెన్‌ అయినప్పుడు విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాతల్లో ఒకరైన పి. రామ్మోహన్‌ రావు ‘చిత్రజ్యోతి’కి చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘‘మా సినిమా బిజినెస్‌ పూర్తయింది. అన్ని  ఏరియాలు అమ్మేశాం. ఓటీటీ, శాటిలైట్‌, అనువాద హక్కులూ అమ్మేశాం. మా ఆలోచన అయితే థియేటర్లలో విడుదల చేయాలనే. జూలైలో ఆ అవకాశం వస్తుందనుకుంటున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. మనకు థియేట్రికల్‌ వ్యాపారమే ఎక్కువ’’ అని చెప్పారు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రమిది.


‘టక్‌ జగదీష్‌’ నిర్మాతల్లో ఒకరైన హరీశ్‌ పెద్ది సైతం రెండు నెలల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘లవ్‌ స్టొరి’ తర్వాత ఏప్రిల్‌ 23న విడుదల కావాల్సిన చిత్రమిది. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం మొదలైంది. దానికి బలం చేకూర్చేలా గత ఏడాది నాని ‘వి’ ఓటీటీలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హరీశ్‌ పెద్దితో ‘చిత్రజ్యోతి’ మాట్లాడగా... థియేటర్లు ఓపెన్‌ అయ్యేవరకూ వేచి చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో ఎవరమూ చెప్పలేం. ప్రభుత్వాలు తమవంతు కృషి చేస్తున్నాయి. రాబోయే రెండు నెలల్లో 30 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయితే... యథాస్థితికి వస్తాం. మళ్లీ సాధారణ జీవితం మొదలవుతుందని ఆశిస్తున్నాం. అప్పుడు సినిమాలు విడుదల చేయవచ్చు’’ అని హరీశ్‌ పెద్ది వివరించారు.


‘విరాటపర్వం’ చిత్రదర్శకుడు వేణు ఊడుగుల కూడా తమ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని ఘంటాపథంగా చెప్పారు. ‘చిత్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ ‘‘మొదట్నుంచీ మాకు ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని మా నిర్మాతలు చెబుతున్నారు. ఎందుకంటే... ఎక్కువశాతం మంది ప్రజలకు చేరాల్సిన చిత్రమిది. కథ పరిధి విస్తృతమైనది. అందుకని, ఓటీటీకి ఇవ్వడం లేదు. ఆల్రెడీ డిజిటల్‌  హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చారు. థియేటర్లలో విడుదలైన తర్వాత అందులోకి వస్తుంది’’ అని తెలిపారు. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా... ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది.


అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా కనిపించనున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, సత్యదేవ్‌ ‘తిమ్మరుసు’, విశ్వక్‌ సేన్‌ ‘పాగల్‌’ చిత్రాలను సైతం ఓటీటీ వేదికల్లో కాకుండా థియేటర్లలో విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు, హీరోలు భావిస్తున్నారట. రెండు రోజుల ప్యాచ్‌వర్క్‌ మినహా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రీకరణ పూర్తయింది. ఓ పాట తీస్తే... ‘పాగల్‌’ రెడీ అవుతుంది. ‘‘ప్రస్తుతానికి అయితే థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నాం. మున్ముందు  పరిస్థితులు ఇలాగే కొనసాగితే... షూటింగ్‌ వర్క్‌ పూర్తయిన టీమ్‌ అంతా కలిసి విడుదలపై నిర్ణయం తీసుకుంటాం’’ అని ‘పాగల్‌’ నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ చెప్పారు. ‘ఆచార్య’, ‘అఖండ’, ‘ఖిలాడి’, ‘నారప్ప’ తదితర సినిమాల చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. అందుకని, విడుదల గురించి ఆలోచించడానికి ఇంకా టైమ్‌ ఉంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.