ఓటు వజ్రాయుధం

ABN , First Publish Date - 2021-01-25T05:29:17+05:30 IST

ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రజలే నిర్ణయిస్తారు.

ఓటు వజ్రాయుధం

  1. పాలకులను నిర్ణయించే హక్కు
  2. పౌరులందరూ ఓటు వేయాలి
  3. నేడు జాతీయ ఓటరు దినోత్సవం


కర్నూలు (కల్చరల్‌), జనవరి 24: ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రజలే నిర్ణయిస్తారు.  భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన తరువాత పౌరులం దరికీ సార్వజనీన వయోజన ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. ఇది పౌరుడి చేతిలో వజ్రాయుధం లాంటి దని అంటారు. ఐదేళ్లకు ఒకసారి తమకు నచ్చిన నాయకుడికి పరిపాలన బాధ్యత లను అప్పగించేందుకు ఓటు హక్కు వినియోగించుకోవాలి. సమర్థులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి ఓటర్లు నాంది పలకాలి. ఇంతటి కీలకమైన ఓటు హక్కును ఎన్నికల్లో 20 నుంచి 30 శాతం ప్రజలు వినియోగించుకోవడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ ఓటరు దినోత్సవాన్ని సోమవారం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా కథనం.

దేశంలోని ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యం కల్పించేం దుకు భారత ఎన్నికల సంఘం ఏటా జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఓటుకు ఉన్న ప్రాధాన్యాన్ని పౌరులకు తెలియజేయడం, వందశాతం పోలింగ్‌ సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పాటైంది. కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 జనవరి 25న నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా అదే రోజున జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

జిల్లాలో ప్రత్యేక ఓటరు సమోదు, సవరణ అనంతరం తుది జాబితా ఇటీవల విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలో 33,23,243 మంది ఓటర్లు ఉన్నారు. ఏడాదిలో ఓటర్ల సంఖ్య 42,518 పెరిగింది. జిల్లాలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. 


ఇలా నమోదు చేసుకోవాలి

18 ఏళ్ల వయసు దాటిన పౌరులకు ఓటు హక్కు ఉంటుంది. వీరిని ఓటరు జాబితాలో చేర్చేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఓటుహక్కు పొందాలంటే పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రం, అఫిడవిట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు ఆన్‌లైన్‌ కాపీని ప్రింట్‌ తీసి రెవెన్యూ అధికారులకు అందజేయాలి. 15 రోజుల అనంతరం ఆధారాలను పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే రెవెన్యూ అధికారులు ఓటరు కార్డును లబ్ధిదారులకు పోస్టు ద్వారా పంపిస్తారు. మీసేవా కేంద్రాల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది. 


జిల్లాలో ఓటర్ల వివరాలు

జిల్లాలో 33,23,243 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 16,46,268 మంది, మహిళలు 16,76,398 మంది ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 14 నుంచి గత వారం వరకు 42,818 మంది ఓటర్లు కొత్తగా జాబితాలో చేరారు. తుది ఓటరు జాబితా ప్రకారం కర్నూలు  అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 3,06,907 మంది ఓటర్లు ఉన్నారు. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో అతి తక్కువగా 1,91,969 మంది ఓటర్లు ఉన్నారు.

Updated Date - 2021-01-25T05:29:17+05:30 IST