ఓటు హక్కు కల్పనలో మనదే తిరుగులేని రికార్డు

ABN , First Publish Date - 2022-01-26T05:18:02+05:30 IST

ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తొలి రోజు నుంచే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన దేశంగా భారత్‌ రికార్డు తిరుగులేనిదని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ పేర్కొన్నారు. మంగళవారం ఐడీవోసీ మీటింగ్‌హాల్‌లో 12వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య పాలన సాగిస్తున్న అమెరికా, ఇంగ్లాండ్‌ వంటి దేశాలు ఉన్నప్పటికీ భారత్‌కు ఒక ప్రత్యేకత ఉందన్నారు.

ఓటు హక్కు కల్పనలో మనదే తిరుగులేని రికార్డు
ఓటరు ప్రతిజ్ఞ చేస్తున్న ప్రభుత్వ అధికారులు

అమెరికా కంటే 20 ఏళ్ల ముందే మహిళలకు ఓటు హక్కు 

పద్దెనిమిదేళ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌


సిద్దిపేట క్రైం, జనవరి 25 : ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తొలి రోజు నుంచే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన దేశంగా భారత్‌ రికార్డు తిరుగులేనిదని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ పేర్కొన్నారు. మంగళవారం  ఐడీవోసీ మీటింగ్‌హాల్‌లో  12వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో  ప్రజాస్వామ్య పాలన సాగిస్తున్న అమెరికా, ఇంగ్లాండ్‌ వంటి దేశాలు ఉన్నప్పటికీ భారత్‌కు ఒక ప్రత్యేకత ఉందన్నారు. ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన మొదటి రోజు నుంచే డబ్బు, కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన దేశంగా భారత్‌కు ప్రపంచంలో తిరుగులేని రికార్డ్‌ ఉందని వెల్లడించారు. ప్రజాస్వామ్యం దేశంగా అవతరించిన 350 సంవత్సరాల తర్వాత 1967 సంవత్సరంలో అమెరికా ఆ దేశ మహిళలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించిందని, కానీ భారత్‌ అమెరికా కన్నా 20 ఏళ్ల ముందే మహిళలకు ఓటు హక్కు కల్పించిందన్నారు. ఈసారి అన్ని ప్రభుత్వం శాఖల అధికారులు, సిబ్బంది శక్తి వంచన లేకుండా కృషి చేసి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే ప్రయత్నం చేయాలన్నారు. జిల్లాలో 3 వేలకు పైగా కొత్తగా నమోదైన ఓటర్లు ఉన్నారని, వారికి బుక్‌లెట్‌ ఇస్తామని తెలిపారు. అందులోని అంశాలను చదివి ప్రజలకు సైతం ఓటు హక్కు అవశ్యకతను తెలియజేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ సూచించారు. ఓటర్లందరూ ఆలోచించి రాష్టాన్ని, దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపే అభ్యర్థులను ఎన్నికలో గెలిపించుకోవాలని ఆయన సూచించారు. ఓటర్ల నమోదు, ఓటర్లను చైతన్యవంతం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో సమానంగా ఈవీఎంలతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నదన్నారు.  ఓటు వేయడం ఒక హక్కు లాగా, బాధ్యతలాగా వినియోగించాలని తెలిపారు. ఈ సందర్బంగా  జిల్లా అదనపు కలెక్టర్లు అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, జిల్లా రెవెన్యూ అధికారి బి.చెన్నయ్య, హుస్నాబాద్‌ ఆర్డీవో జయ చంద్రారెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T05:18:02+05:30 IST