ప్రలోభాలకు తెరలేచింది!

ABN , First Publish Date - 2021-02-19T05:10:36+05:30 IST

జిల్లాలో చివరి విడతగా జరగనున్న నెల్లూరు డివిజన్‌ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థులు, రాజకీయ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రలోభాలకు తెరలేచింది!

నెల్లూరు డివిజన్‌లో వ్యూహ ప్రతివ్యూహలు

ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం

డబ్బు, మద్యంతోపాటు ఇంటి సామగ్రి పంపిణీ


నెల్లూరు (జడ్పీ), ఫిబ్రవరి 18 : జిల్లాలో చివరి విడతగా జరగనున్న నెల్లూరు డివిజన్‌ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థులు, రాజకీయ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. డివిజన్‌లోని 12 మండలాల్లో  ఎన్నికలు జరుగుతుండడంతో  ఆయా మండలాల్లోని పంచాయతీలను కైవసం చే సుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహలు చేస్తున్నారు. ముఖ్యంగా మేజర్‌ పంచాయతీలు, పోటాపోటీగా ఉండే పంచాయతీల్లో గెలుపుకోసం అభ్యర్థులు పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే భారీగా మద్యాన్ని నిల్వ చేసి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. అలాగే నగదుతోపాటు, వస్తువులను పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మహిళల ఆదరణ పొందేందుకు ఇప్పటికే  పలు గ్రామ పంచాయతీల్లో చీరలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో కుక్కర్లు తదితర వంట సామగ్రి ఇచ్చేందుకూ సిద్ధపడుతున్నారు. ఇందులో ఎక్కువగా అధికార పార్టీకి చెందిన మద్దతుదారులే ముందుంటున్నారు.  మద్యం, నగదు పంపిణీలతో పట్టుబడితే గెలిచినా సర్పంచు సభ్యత్వాన్ని రద్దు చేసేలా ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఆయుధంగా అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై అధికారులు పోలీసులతో నిఘా పెట్టి వారు పట్టుబడేలా వ్యూహాలు రచించుకుంటున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు మద్యం, నగదు ఇతర వస్తువులు పంపిణీకి కొంత వెనకడుగు వేస్తున్నాయి.. అయితే పోలీసు వ్యవస్థ అధికార పార్టీకు అనుకూలంగా ఉండడంతో దానిని ఆసరా చేసుకుని ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మద్యాన్ని గ్రామాల్లో  ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు. అలాగే ఓటుకు రూ.1000 నుంచి 2వేల మేర పంపిణీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల ప్రచారం శుక్రవారం ముగియనుండటంతో మేజర్‌ పంచాయతీలతో సహా పోటాపోటీ ఉండే పంచాయతీల్లో డబ్బు, వస్తువుల పంపిణీకి అన్ని ప్రయత్నాలను చేసుకుంటున్నారు.  

Updated Date - 2021-02-19T05:10:36+05:30 IST