ఎమ్మెల్సీ ఓటేయండిలా

ABN , First Publish Date - 2021-03-01T04:33:47+05:30 IST

శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రులు అభ్యర్థులకు తమ ప్రాధాన్యత సంఖ్య(ఓటు)ను ఊదారంగు(వయొలెట్‌)పెన్నుతో వేయాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఎన్‌ మధుసూదన్‌ స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఓటేయండిలా

ఊదారంగు పెన్నుతో ప్రాధాన్యత సంఖ్య

ఓటర్లకు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సూచనలు

ఖమ్మం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 28: శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రులు అభ్యర్థులకు తమ ప్రాధాన్యత సంఖ్య(ఓటు)ను ఊదారంగు(వయొలెట్‌)పెన్నుతో వేయాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఎన్‌ మధుసూదన్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు, శిక్షణ కార్యక్రమాలు తదితర అంశాలపై పత్రికలకు ఒక ప్రకటన ద్వారా వివరించారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలల్లో ఈసారి 71మంది పోటీలో ఉన్న నేపథ్యంలో జంబో బ్యాలెట్‌ పేపర్‌ ఉంటుందన్నారు. ఆ బ్యాలెట్‌ పేపర్‌ను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఓటరు తమ ఓటును ప్రాధాన్యత క్రమంలో వేయాల్సి ఉంటుందని వివరించారు. బ్యాలెట్‌ పేపరపై ఎటువంటి రాతలు, టిక్‌మార్కు క్రాస్‌మార్కు వంటివి ఉన్నా ఆ ఓటును పరిగణించబోమన్నారు. ఓటర్లు తమ ప్రాధాన్యత సంఖ్యను మాత్రమే అభ్యర్థి పేరు ఎదుట వేయాలని, ప్రాధాన్యత సంఖ్యను అక్షరాల్లో రాయకూడదన్నారు. 

ఓటేసేందుకు సూచనలివి 

- బాలెట్‌పేపర్‌తో పాటు మీకు ఇచ్చే ఊదారంగు స్కెచ్‌పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. 

- ఓటరు తన మొదటిప్రాధాన్యత ఓటు ఇవ్వదలిచిన అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న ఖాళీగడిలో ‘‘1’’ అంకెను వేయాలి

- ఓటరు ఒక అభ్యర్థి పేరుఎదురుగా ఒకే ఒక ప్రాధాన్యత సంఖ్యను వేయాల్సి ఉంటుంది. (ఉదాహరణకు ప్రాధాన్యత వ్యక్తికి 1, రెండో ప్రాధాన్య వ్యకికి 2, మూడో ప్రాధాన్యత వ్యక్తికి 3 ఇలా మాత్రమే బ్యాలెట్‌పై వేయాల్సి ఉంటుంది)

 ఓటర్లు చేయకూడనివి

- ప్రిసైడింగ్‌ అధికారి ఇచ్చే ఊదారంగు స్కెచ్‌పెన్ను కాకుండా వేరే ఇతర పెన్ను, పెన్సిల్‌, బాల్‌పాయింట్‌ పెన్నులు ఉపయోగించకూడదు. అలాచేస్తే ఆ ఓటు తిరస్కరించబడుతుంది.

- ఒకే అభ్యర్థికి వేసిన ప్రాధాన్యత సంఖ్య మరో అభ్యర్థికి వేయకూడదు. (అంటే ‘1’ అంకెను ఒకే వ్యక్తికి వేయాలి)

- బ్యాలెట్‌ పేపరుపై అంకెలలో కాకుండా ఒకటి, రెండు, మూడు అని అక్షరాల్లో రాయకూడదు. అలారాస్తే ఆ ఓటు చెల్లనిదిగా గుర్తిస్తారు.

- బ్యాలెట్‌పేపర్‌పై ఓటరు సంతకం చేయవద్దు. పొడి అక్షరాలు రాయవద్దు. పేరుకానీ, ఇతర పదాలు రాయకూడదు. వేలి ముద్రలు కూడా వేయవద్దు.

- బ్యాలెట్‌ పేపర్‌పై రైట్‌ మార్కు, ఇన్‌టూ మార్క్‌ కానీ పెట్టకూడదు. అవి తిరస్కరిస్తారు.

Updated Date - 2021-03-01T04:33:47+05:30 IST