ఓటు హక్కు అత్యంత విలువైనది

ABN , First Publish Date - 2022-01-26T04:25:11+05:30 IST

సరైన నేతలను ఎన్నుకుని.. నవ సమాజ స్థాపనకు అవకాశం కల్పించే ఓటు హక్కు అత్యంత విలువైనదని ముత్తుకూరు తహసీల్దారు సోమ్లానాయక్‌ పేర్కొన్నారు.

ఓటు హక్కు అత్యంత విలువైనది
కోవూరులో వయోవృద్ధులకు సన్మానం

ముత్తుకూరు, జనవరి 25: సరైన నేతలను ఎన్నుకుని.. నవ సమాజ స్థాపనకు అవకాశం కల్పించే ఓటు హక్కు అత్యంత విలువైనదని ముత్తుకూరు తహసీల్దారు సోమ్లానాయక్‌ పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అర్హత కల్గిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ ఓటర్లను సన్మానించారు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.  కార్యక్రమంలో ఎంపీడీవో ప్రత్యూష, సర్పంచు బూదూరు లక్ష్మి, హౌసింగ్‌ ఏఈ సుబ్రహ్మణ్యం, వైసీపీ నాయకులు కాకుటూరు లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


వయోవృద్ధులకు సన్మానం 

కోవూరు : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తహసీల్దారు కార్యాలయ ఆవరణలో మంగళవారం ముగ్గురు  వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు విలువను తహసీల్దారు సీహెచ్‌. సుబ్బయ్య, ఎంపీడీవో శ్రీహరి వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.


ఓటు అతిశక్తివంతమైన ఆయుధం  

పొదలకూరు : సమాజంలో ఓటు ప్రతి ఒక్కరికి అతిశక్తివంతమైన ఆయుధమని తహసీల్దారు సుధీర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మన భవిష్యత్‌ను మనమే నిర్ణయించుకునే శక్తి ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొంది, దానిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. పటిష్టమైన జాతి నిర్మాణం కేవలం ఓటు ద్వారానే సాధ్యపడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 


ఇందుకూరుపేట : మండలంలోని గంగపట్నంలో మంగళవారం ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో రాజకీయ పార్టీలకతీతంగా గ్రామపెద్దలు సీనియర్‌ ఓటర్లను గుర్తించి, వారికి జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఇందులో భాగంగా పట్టణంలోని దండిగుంట సుధాకర్‌నాయుడును సత్కరించారు. 55ఏళ్లుగా వార్డు, సర్పంచు మొదలు పార్లమెంటు ఎన్నికల వరకు ఓటు వేశానని, నాటి అనుభవాలను ఆయన వివరించారు. మైపాడు, జగ్గయ్యపేట గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. 

 

ఓటు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి : వీఎస్‌యూ వీసీ 

వెంకటాచలం : ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వీఎస్‌యూ వైస్‌ చాన్సలర్‌ జీఎం సుందరవల్లి పేర్కొన్నారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18ఏళ్లు దాటిన వారందరూ ఓటు హక్కును తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని, అప్పుడే బాధ్యతయుతమైన నాయకత్వంతో మన ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాఎస్‌ నాయర్‌, అధ్యాపకులు తదితరులున్నారు.  

 

ర్యాలీ, ప్రతిజ్ఞలతో జాతీయ ఓటర్ల దినోత్సవం

మనుబోలు : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద ర్యాలీలు, ప్రతిజ్ఞలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దారు నాగరాజు మాట్లాడుతూ ఓటర్లు ఓటు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో బీఎల్వోలు, వీఆర్వోలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు. 


ఓటు వజ్రాయుధం   

బుచ్చిరెడ్డిపాళెం: ఓటు వజ్రాయుధం లాంటిదని గోపాలకృష్ణయ్య స్కూల్‌ కరస్పాండెంట్‌ నేలనూతల శ్రీధర్‌ అన్నారు. మంగళవారం స్కూల్లో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని,  మాట్లాడుతూ ప్రపంచంలో అధిక ఓటర్లున్న మనదేశంలో ఓటు విలువ తెలుసుకుని మంచి వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, యువత పాల్గొన్నారు.



Updated Date - 2022-01-26T04:25:11+05:30 IST