రెవెన్యూ సహాయకులకు శుభవార్త

ABN , First Publish Date - 2020-07-14T10:01:18+05:30 IST

జిల్లాలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)గా పని చేస్తోన్న వారికి గ్రేడ్‌-2 వీఆర్వోలుగా ఉద్యోగోన్నతి ..

రెవెన్యూ సహాయకులకు శుభవార్త

పదేళ్లకు ఫలించనున్న వీఆర్‌ఏల కల

417 మందికి గ్రేడ్‌-2 వీఆర్వోలుగా ఉద్యోగోన్నతి

వారంలో వెలువడనున్న అధికారిక ఉత్తర్వులు


గుంటూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)గా పని చేస్తోన్న వారికి గ్రేడ్‌-2 వీఆర్వోలుగా ఉద్యోగోన్నతి లభించనుంది. ఇంచుమించు 10 ఏళ్లకు పైగా వీఆర్‌ఏలుగా కొనసాగుతున్న వీరికి పదోన్నతి కల్పించేందుకు ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఆ మేరకు కలెక్టరేట్‌ అధికారులకు ఆదేశాలు అందగా సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు కల్పించేందుకు ఫైలు సిద్ధం చేస్తోన్నారు. వారం వ్యవధిలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లుగా రెవెన్యూవర్గాల సమాచారం. తొలుత రెండేళ్ల పాటు నెలకు రూ.15 వేల వేతనాన్ని చెల్లిస్తారు. ఆ తర్వాత టైంస్కేల్‌ వర్తింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. 


2008 నుంచి 2012 వరకు వీఆర్‌ఏల నియామకాలు జరిగాయి. వీరికి నెలకు రూ. 10 వేల జీతాన్ని చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వం పదో తరగతి అర్హత ఉన్నా సీనియారిటీ ప్రకారం గ్రేడ్‌-1 వీఆర్వోగా ఉద్యోన్నతి కల్పించి రూ.16,400 స్కేల్‌ని అమలు చేసింది. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గ్రేడ్‌-2 వీఆర్‌వో ఉద్యోన్నతికే ఇంటర్మీడియట్‌ని అర్హతగా నిర్ణయించింది. పైగా వెంటనే స్కేల్‌ అమలు చేయకుండా రెండేళ్ల పాటు రూ.15,000 వంతున చెల్లించి ఆ తర్వాత ఆలోచిస్తామని చెప్పింది. జిల్లాలో మొత్తం 417 మంది వీఆర్‌ఏలకు గ్రేడ్‌-2 వీఆర్‌వోలుగా ప్రమోషన్‌లు రానున్నాయి. ఈ ప్రక్రియకి సంబంధించి కలెక్టరేట్‌లో భారీ కసరత్తు జరుగుతున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది స్వాగతిస్తోన్నప్పటికీ ఇంటర్మీడియట్‌ విద్యార్హత మెలిక పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోన్నారు. గత ప్రభుత్వంలో వలే పదో తరగతి అర్హత ఉన్నా గ్రేడ్‌-1 వీఆర్వోగా ఉద్యోన్నతులు కల్పించాలని వీఆర్‌ఏలు కోరుతున్నారు.  


వీఆర్వోలకు ఎప్పటికో?

అధికారంలోకి రాగానే వీఆర్వోలకు రెవెన్యూలో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్లు ఇస్తామని చెప్పిన వైసీపీ నేతలు ఏడాది పూర్తి అయినా ఆ హామిని నెరవేర్చడం లేదు. సీఎం సలహాదారుగా పని చేసిన అజయ్‌ కల్లాం పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ వీఆర్వోలకు ఉద్యోన్నతులు అందని ద్రాక్షగానే మారాయి. రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ అసోసియేషన్ల నేతల మధ్యన అభిప్రాయభేదాలు కూడా వీఆర్‌వోల పాలిట శాపంగా పరిణమించాయి. 

Updated Date - 2020-07-14T10:01:18+05:30 IST