త్రిశంకుస్వర్గంలో వీఆర్‌ఏలు

ABN , First Publish Date - 2021-05-05T04:57:07+05:30 IST

త్రిశంకుస్వర్గంలో వీఆర్‌ఏలు

త్రిశంకుస్వర్గంలో వీఆర్‌ఏలు
మోమిన్‌పేట తహసీల్దార్‌ కార్యాలయం

  • చాలీచాలని వేతనాలతో భారంగా కుటుంబ పోషణ
  • ఎనిమిదేళ్లుగా పేస్కేల్‌, పదోన్నతులు లేక ఇబ్బందులు


మోమిన్‌పేట: మండల, గ్రామ స్థాయిలో పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా ప్రతీ గ్రామానికి వీఆర్‌ఏలను నియమించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 2012, 2014 సంవత్సరాల్లో రెండు దఫాలుగా సుమారుగా 3,900 మంది వీఆర్‌ఏలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిన నియమించింది. అయితే వీరిసేవలకు గానూ 2017(ఫిబ్రవరి 24)లో ప్రగతి భవన్‌ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించి, పేస్కేల్‌ వర్తింపజేస్తామని ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా ప్రత్యక్ష పద్ధతిలో నియామకమైన గ్రామరెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)లను వీఆర్వోలుగా పదోన్నతి కల్పిస్తామని వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు గడిచినా హామీ నెరవేరకపోవడంతో వీఆర్‌ఏలు మానసికంగా కృంగిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇందులో కొంతమంది వీఆర్‌ఏలు ఉన్నత విద్యావంతులు కావడంతో కావలికార్‌ పనులు కాకుండా తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలు చేసే పనులు కూడా వీఆర్‌ఏలు చేసేస్తున్నారు. మరికొన్ని చోట్ల కంప్యూటర్‌ ఆపరేటర్‌, రికార్డుల నిర్వహణ, అటెండర్‌, కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాల నిర్వహణ, భూములకు సంబంధించిన పత్రాల నిర్వహణ తదితర పనులు కూడా వీఆర్‌ఏలు చేస్తున్నారు.  ప్రభుత్వం వీరికి పార్ట్‌టైమ్‌ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు కేవలం రూ.10,500 గౌరవ వేతనం ఇస్తోంది. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వఉద్యోగులతో సమానంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వర్తిస్తున్నా పదోన్నతులు లేక, వేతనం పెరగక అయోమయ స్థితిలో ఉన్నట్లు పలువురు వీఆర్‌ఏలు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలీచాలని జీతాలతో కుటుంబపోషణ భారంగా మారిందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : మహేష్‌గౌడ్‌, వీఆర్‌ఏల మండల అధ్యక్షుడు, మోమిన్‌పేట

గ్రామాల్లో వీఆర్‌ఏలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం. ఇంత చేస్తున్నా తమకు ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేదు. విధి నిర్వహణలో అనుకోని సంఘటనలు జరిగి ఏదైనా ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రతి ఉద్యోగికి హెల్త్‌ కార్డులుంటే ఎలాంటి ఇబ్బందులు రావు. అర్హత ప్రకారం పేస్కేల్‌, పదోన్నతులు కల్పించి తమకు న్యాయం చేయాలి. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. 


Updated Date - 2021-05-05T04:57:07+05:30 IST