గ్రామ సేవకుల.. నిరసన గళం

ABN , First Publish Date - 2022-09-21T05:50:08+05:30 IST

గ్రామ సేవకులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కారు. మంగళగిరి ఏపీఐఐసీ భవన సముదాయంలోని సీసీఎల్‌ఏ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించారు.

గ్రామ సేవకుల.. నిరసన గళం
సీసీఎల్‌ఏ కార్యాలయం సమీపాన ఆటోనగర్‌ వీధుల్లో ధర్నా చేస్తున్న గ్రామ సేవకులు

మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయం ముట్టడికి యత్నం

పెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపు

వీఆర్‌ఏలు వేలాదిగా తరలిరావడంతో వెనక్కి తగ్గిన పోలీసులు

సీసీఎల్‌ఏకు కొద్ది దూరంలో ధర్నాకు అనుమతి

మంగళగిరి, సెప్టెంబరు 20: గ్రామ సేవకులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కారు. మంగళగిరి ఏపీఐఐసీ భవన సముదాయంలోని సీసీఎల్‌ఏ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించారు. వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏపీ గ్రామ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ మంగళవారం సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. మంగళగిరి ఎన్నారై జంక్షన్‌ నుంచి ఆటోనగర్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేయాలని సమాయత్తమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు ఎన్నారై వైజంక్షన్‌, ఏపీఐఐసీ భవనం వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. వందలాది మంది వీఆర్‌ఏలను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ రాష్ట్రం నలుమూలల నుంచి గ్రామసేవకులు వేలాదిగా తరలిరావడంతో పోలీసులు కొంచెం వెనక్కి తగ్గారు. ఎన్నారై జంక్షన్‌ నుంచి గౌతమబుద్ధ రోడ్డు మీదుగా ప్రదర్శనకు అనుమతిచ్చారు. అయితే, ఏపీఐఐసీ భవనం వైపు కాకుండా మరో మార్గం నుంచి ప్రదర్శనను దారిమళ్లించారు. సీసీఎల్‌ఏ కార్యాలయానికి కొద్ది దూరం వరకు మాత్రమే అనుమతించారు. ధర్నాకు అనుమతి లేదని, లోపలికి వెళ్లడానికి వీల్లేదని నిలువరించారు. దీంతో వీఆర్‌ఏలు ఆటోనగర్‌ వీధుల్లోనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం సీసీఎల్‌ఏ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఇళ్లా వెంకటేశ్వరరావు, యండపల్లి శ్రీనివాసులురెడ్డి వీఆర్‌ఏల ఆందోళనకు మద్దతు తెలిపి ప్రసంగించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి మాట్లాడుతూ రెండురోజుల్లో ప్రభుత్వం దిగొచ్చి సమస్యను పరిష్కరించని పక్షంలో సీఎం నివాసం ముట్టడికి పిలుపునిస్తామని, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.పెద్దన్న మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వున్న 22 వేల మంది వీఆర్‌ఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అర్హులైన వారికి వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో గ్రామ సహాయకుల సంఘం నేతలు వివేకానంద, గోవిందరాజు, సంగయ్య, త్రినాథ్‌, మిన్నారావు, బి.లక్ష్మణరావు, రవి, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అరెస్టయి పోలీసుస్టేషన్‌కు వచ్చిన వారిని సీఐటీయూ నేతలు జేవీ రాఘవులు, ఎస్‌ఎస్‌ చెంగయ్య, బాలాజీ, కమలాకర్‌రావు తదితరులు పరామర్శించారు. కాగా, వీఆర్‌ఏల ఆందోళనకు మంగళగిరి తెలుగుదేశం పార్టీ నేతలు నందం అబద్దయ్య, గోవాడ దుర్గారావు, గోసాల రాఘవ, సింహాద్రి రామారావు తదితరులు సంఘీభావం తెలిపారు. ధర్నాలో పాల్గొన్న వారికి అల్పాహారం, మంచినీళ్లు అందించారు.


Updated Date - 2022-09-21T05:50:08+05:30 IST