ఏసీబీ వలలో కురిచేడు వీఆర్వో

ABN , First Publish Date - 2021-03-09T07:46:32+05:30 IST

కురిచేడు వీఆర్వో కేవీ నాగరాజు ఏసీబీ వలకు చిక్కాడు. పొలం ఆన్‌లైన్‌ చేసేందుకు ఓ రైతు నుంచి రూ.20వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు.

ఏసీబీ వలలో కురిచేడు వీఆర్వో

పొలం ఆన్‌లైన్‌ చేసేందుకు  రైతు నుంచి లంచం డిమాండ్‌

రూ. 20వేలు తీసుకుంటూ పట్టుబడిన నాగరాజు

పడమరవీరాయపాలెం పర్యవేక్షణ బాధ్యతలు చూస్తూ వ్యవహారం

కురిచేడు, మార్చి 8 : కురిచేడు వీఆర్వో కేవీ నాగరాజు ఏసీబీ వలకు చిక్కాడు. పొలం ఆన్‌లైన్‌ చేసేందుకు ఓ రైతు నుంచి రూ.20వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల వివరాల మేరకు నాగరాజు పడమరవీరాయపాలెంలో ఇన్‌చార్జ్‌ వీఆర్‌వోపై సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. అక్కడ ఇన్‌చార్జ్‌ వీఆర్వోగా ఉన్న గ్రామ సర్వేయర్‌ నూతనంగా వచ్చాడు. దీంతో నాగరాజు రెవెన్యూ వ్యవహారాల్లో అన్నీ తానై చక్కబెడుతున్నాడు. కురిచేడు మండలంలోని పడమరవీరాయపాలేనికి చెందిన రైతు డి.శివరామకృష్ణ తండ్రికి అదే గ్రామ రెవెన్యూ పరిధిలో 2.65 ఎకరాల భూమి ఉంది. దానిని ఆన్‌లైన్‌ చేయడానికి వీఆర్వో నాగరాజుకు ఆయన గతంలో రూ.40వేలు డబ్బులు ఇచ్చారు. అతను బదిలీపై త్రిపురాంతకం వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి కురిచేడు వచ్చి పడమరవీరాయపాలెంకు సూపర్‌వైజర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. తన తండ్రి మృతి చెందటంతో శివరామకృష్ణ ఆ భూమికి వారసులైన తల్లి, అన్నయ్య, తన పేరున ఆన్‌లైన్‌ చేయాలని కోరాడు. అందుకోసం నాగరాజు మరికొంత డిమాండ్‌ చేయడంతో మరో రూ.30వేలు ఇచ్చారు. అయినా ఆన్‌లైన్‌ కాలేదు. మరోసారి కూడా డబ్బులు కావాలని అడగడంతో శివరామకృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం నాగరాజు రూ.20వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వీఆర్వోను విచారించారు. అతని గృహంలో సోదాలు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోతోపాటుగా తహసీల్దార్‌ను కేసు విషయమై అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో నిందితుడిని హాజరుపరచనున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు ఎన్‌ఎ్‌సఎస్‌ అపర్ణ, ఎన్‌. రాఘవరావు, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-09T07:46:32+05:30 IST