కొవిడ్‌ నోడల్‌ అధికారులు సేవా భావంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2021-04-24T05:18:06+05:30 IST

కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రుల్లో నియమితులైన నోడల్‌ అధికారులు సేవాభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ కోరారు.

కొవిడ్‌ నోడల్‌ అధికారులు సేవా భావంతో పనిచేయాలి
సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, ఇతర అధికారులు

జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌ చంద్‌

విశాఖపట్నం ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రుల్లో నియమితులైన నోడల్‌ అధికారులు సేవాభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నోడల్‌ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రులపై నోడల్‌ అధికారులకు పూర్తి నియంత్రణ ఉండాలని, పడకలు, వైద్య సౌకర్యాలు, డాక్టర్లు, సిబ్బంది, పరికరాలు, మందులు, సేవల విధానంపై అవగాహన ఉండాలన్నారు. నిరంతర పర్యవేక్షణ, సీసీ ఫుటేజీలను పరిశీలించడం, ఫోన్‌ కాల్స్‌కు తక్షణం స్పందించడం, రోగికి అవసరమైన వైద్య సేవలు అందేలా తోడ్పాటు అందించాలన్నారు. ఆక్సిజన్‌ సరఫరాలో ఎటువంటి జాప్యం జరగరాదని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు మాట్లాడుతూ నోడల్‌ అధికారులు ఆస్పత్రిలో ఎల్లప్పుడూ ఉండాలని, వారు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వేరొక  అధికారికి బాధ్యత అప్పగించాలన్నారు. మొదటగా ఫైర్‌ సేఫ్టీని సరి చూసుకోవాలన్నారు. అంబులెన్స్‌లో వచ్చిన రోగిని వెంటనే చేర్చుకుని, తగిన చికిత్స  అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఛాతీ, విమ్స్‌ తదితర ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగుల చికిత్స నిమిత్తం అవసరమైన పరికరాల విషయమై సూపరింటెండెంట్లతో చర్చించారు. అవసరమైన సామగ్రి వెంటనే కొనుగోలుకు చర్యలు చేపట్టాలని ఏపీఎస్‌ఎండీసీ ఈఈ నాయుడును ఆదేశించారు. సమావేశంలో ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మైథిలి, జిల్లా పరిషత్‌ సీఈవో నాగార్జున సాగర్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పీఎస్‌ సూర్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు, వివిధ ఆస్పత్రుల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-24T05:18:06+05:30 IST