కదలని ‘సుజల స్రవంతి’

ABN , First Publish Date - 2020-10-27T10:26:59+05:30 IST

బాబూ జగ్జీవన్‌రామ్‌ ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టుకు భూసేకరణ అడ్డంకిగా మారింది. పనులు చేయడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా వున్నా అందుకు అవసరమైన భూమి ఇంకా సమకూరలేదు.

కదలని ‘సుజల స్రవంతి’

భూసేకరణకు సమస్యలు

తొలిదశ పనులకు తొమ్మిది మండలాల్లో

4,400 ఎకరాలు అవసరమని గుర్తింపు

నోటిఫికేషన్‌ కూడా జారీ

ముందుకురాని రైతులు

రాజమండ్రిలో గల పోలవరం

ప్రత్యేక కలెక్టర్‌ కార్యాలయం నుంచే పర్యవేక్షణ

విశాఖలో సుజల స్రవంతి కార్యాలయం ఏర్పాటుకు యోచన


(విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి): బాబూ జగ్జీవన్‌రామ్‌ ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టుకు భూసేకరణ అడ్డంకిగా మారింది. పనులు చేయడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా వున్నా అందుకు అవసరమైన భూమి ఇంకా సమకూరలేదు. ప్రాజెక్టుకు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల పరిధిలో 30 వేల ఎకరాలు అవసరం. తొలిదశ పనులకు విశాఖ జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలో 4,400 ఎకరాలు అవసరమని అధికారులు గతంలోనే తేల్చారు. పెదపూడి రిజర్వాయర్‌ నిర్మాణానికి 1300 ఎకరాలు, కాలువలకు 300 ఎకరాలు, పిల్ల కాలువకు 1,653 ఎకరాలు, మధ్యలో వున్న అటవీ భూమి 147.63 ఎకరాలు వెరసి 4,400 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఇందులో 2,300 ఎకరాల సేకరణకు ఏడాదిన్నర క్రితమే షెడ్యూల్స్‌ రూపొందించారు. 1300 ఎకరాలకు ప్రాథమిక ప్రకటన జారీచేశారు. అయితే ప్రాథమిక ప్రకటన జారీచేసిన 1,300 ఎకరాలకు అవార్డు ప్రకటించాల్సి ఉంది.


ఇందులో ప్రభుత్వ భూములతోపాటు కశింకోట, బుచ్చెయ్యపేట, మాకవరపాలెం, నర్సీపట్నం, రావికమతం మండలాలకు చెందిన రైతుల భూములు కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల రైతుల నుంచి సానుకూలత రాకపోవడంతో భూసేకరణకు అవరోధం ఏర్పడింది. పెదపూడి రిజర్వాయర్‌, కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రూ.600 కోట్లు అవసరమని అధికారులు గుర్తించారు. భూసేకరణకు నిధులతోపాటు పలు అడ్డంకులు వున్నాయనే ప్రచారం సాగుతుంది.

 

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రాజమండ్రిలో గల పోలవరం ప్రత్యేక కలెక్టర్‌ భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేశారు. గ్రామ సభలు నిర్వహించి రైతులను ఒప్పించడంతోపాటు పరిహారం పంపిణీ బాధ్యత రాజమండ్రిలోని పోలవరం ప్రత్యేక కలెక్టర్‌ కార్యాలయం పర్యవేక్షించాలి. అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు భూసేకరణ, పరిహారం పంపిణీలో ఈ కార్యాలయం అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి భూసేకరణ పనులు పర్యవేక్షించడం సాధ్యం కావడం లేదని అధికార వర్గాలు భావిస్తున్నాయి.


పనులు రూ.2,022 కోట్లతో చేపట్టేందుకు 2017లో  అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. దీని ప్రకారం టెండర్లు ఆహ్వానించారు. ప్యాకేజీ-1, 2 పనులకు కాంట్రాక్టరు ఖరారు కావడంతో సుమారు రూ.900 కోట్లకు సంబంధించి పనులు ప్రారంభించి గత ఏడాది ప్రభుత్వం మారే సమయానికి రెండు శాతం పూర్తిచేశారు. అయితే 25 శాతం కంటే తక్కువ పూర్తయిన పనులకు సంబంధింఇచన టెండర్లు రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సుజల స్రవంతి విషయంలో మాత్రం పాత కాంట్రాక్టర్లకే తిరిగి పనులు అప్పగించింది. ప్రస్తుతం పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా వున్నా అవసరమైన భూసేకరణ పూర్తికానందున ముందుకువెళ్లలేని పరిస్థితి ఎదురైంది. 


విశాఖలో ప్రత్యేక భూసేకరణ కార్యాలయం?

...ఇక్కడ భూసేకరణను రాజమండ్రి నుంచి పోలవరం భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌ పర్యవేక్షించడం సమస్యగా మారిందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో సుజల స్రవంతి ప్రాజెక్టు ప్రత్యేక భూసేకరణ కార్యాలయం ఏర్పాటు చేయాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను, ఇతర సిబ్బందిని కేటాయించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి వున్నదని జల వనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

Updated Date - 2020-10-27T10:26:59+05:30 IST