కిక్‌ తగ్గింది!

ABN , First Publish Date - 2020-10-27T10:29:37+05:30 IST

కరోనా ప్రభావం ఈ ఏడాది దసరాపైనా పడింది. ఆర్థికంగా పరిస్థితులు దిగజారడంతో పండుగ రోజున మద్యం, మాంసం విక్రయాలు భారీగా తగ్గాయి.

కిక్‌ తగ్గింది!

పండుగ రోజు తగ్గిన మద్యం విక్రయాలు

గత ఏడాదితో పోల్చితే 35 శాతం తక్కువ సరకు విక్రయం

చికెన్‌, మటన్‌ విక్రయాలదీ అదే పరిస్థితి

పోయిన సంవత్సరం కంటే 20-25 శాతం తక్కువ

కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు దిగజారడమే కారణం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం ఈ ఏడాది దసరాపైనా పడింది. ఆర్థికంగా పరిస్థితులు దిగజారడంతో పండుగ రోజున మద్యం, మాంసం విక్రయాలు భారీగా తగ్గాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మద్యం విక్రయాలు 35 శాతం తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. నగర పరిధిలో 60 మద్యం దుకాణాలు, 80 బార్‌లు వుండగా, వీటిలో శని, ఆదివారాల్లో రూ.8 కోట్ల మేరకు విక్రయాలు జరిగాయి. గత ఏడాది పండగ నాడు...ఇంతే మొత్తంలో విక్రయాలు జరిగినప్పటికీ....అప్పటికంటే ఇప్పుడు ధరలు భారీగా పెరిగాయని అధికారులు పేర్కొంటున్నారు.


సరకు విక్రయాలు 35 శాతం వరకు తగ్గాయని చెబుతున్నారు. సాధారణంగా మిగిలిన పండగలతో పోలిస్తే దసరాకు మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతూ ఉంటాయి. అయితే, గత ఏడాది ఇసుక కొరతతో పనులు లేకపోవడం వల్ల అంతకుముందు ఏడాదితో పోలిస్తే 30 శాతం మేరకు మద్యం విక్రయాలు తగ్గగా...గతేడాదితో విక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది 35 శాతం తగ్గిపోయాయి. 


అదేవిధంగా దసరా పండగకు మాంసం విక్రయాలు భారీగా జరుగుతాయి. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో లేవని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 20-25 శాతం మటన్‌, చికెన్‌ విక్రయాలు తగ్గినట్టు పేర్కొంటున్నారు. నగర పరిధిలో ఆదివారం...దసరా రోజున మూడు లక్షల కిలోలు కోడిమాంసం, మరో 50 వేల కిలోల నాటు కోడి మాంసం విక్రయాలు జరిగాయి. అదేవిధంగా నగర పరిధిలోని 500కుపైగా దుకాణాలో వంద టన్నుల మటన్‌ అమ్మకాలు జరిగాయి. గతంలో ఇదే దసరా పండగకు 120-40 టన్నులు విక్రయించేవారని, చికెన్‌ ఐదు లక్షల కిలోలు అయ్యేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. 


ఎందుకు తగ్గింది..?

సాధారణంగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా పండగరోజు ఖర్చుకు ఎవరూ వెనుకాడరు. అయితే కరోనా పేద, మధ్య, ఎగువ మధ్య తరగతులు ఆర్థిక స్థితిగతులపై పెనుప్రభావాన్నే చూపించింది. ఇప్పటికీ ఎంతోమందికి చేసేందుకు పనుల్లేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆయా వర్గాలన్నీ పండగ ఖర్చును భారీగా తగ్గించుకున్నాయి. గతంలో ఒకటి, రెండు కిలోలు మాంసం కొనుగోలుచేసినవారు ఈసారి అర కిలోతో సరిపెట్టుకోగా, చాలామంది అదీ కొనుగోలు చేయలేకపోయారు. మద్యం విక్రయాలపైనా ఇవే అంశాలు ప్రభావం చూపించాయి. ముఖ్యంగా మద్యం తీసుకునే ఎంతోమంది భారీగా పెరిగిన ధరలతో దానికి దూరంగా ఉండిపోయారు.

Updated Date - 2020-10-27T10:29:37+05:30 IST