కొడుకును కడతేర్చిన తల్లి

ABN , First Publish Date - 2020-10-27T10:37:36+05:30 IST

కొడుకు ఆగడాలను భరించలేక కన్నతల్లే హతమార్చిన సంఘటన విశాఖలోని ఐదో వార్డు పరిధి మారికవలస రాజీవ్‌ గృహకల్ప న్యూకాలనీలో చోటుచేసుకుంది.

కొడుకును కడతేర్చిన తల్లి

వేధింపులకు తాళలేకే ఘాతుకం 


కొమ్మాది, అక్టోబరు 26: కొడుకు ఆగడాలను భరించలేక కన్నతల్లే హతమార్చిన సంఘటన విశాఖలోని ఐదో వార్డు పరిధి మారికవలస రాజీవ్‌ గృహకల్ప న్యూకాలనీలో చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పీఎంపాలెం సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రాంతానికి చెందిన కోట్ల శ్రీను భార్యాపిల్లలతో కలిసి మారికవలస జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం న్యూకాలనీ బ్లాక్‌ నంబర్‌-144 ఎస్‌ఎఫ్‌3లో నివాసముంటున్నారు. వీరికి అనిల్‌ (18) కుమారుడితో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. పదో తరగతి వరకు చదివిన అనిల్‌ చెడు వ్యసనాలకు బానిసై నిత్యం చుట్టుపక్కల వారితో గొడవలు పడుతుండేవాడు. మృతుడు అనిల్‌ గత ఏడాది ఓ వ్యక్తిపై దాడి చేసి దొంగతనానికి పాల్పడడంతో అరెస్టు చేసి బాలల కారాగారానికి పంపినట్టు సీఐ పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది మే 14న మారికవలస సమీపంలో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటనలో కూడా అనిల్‌ నిందితుడిగా ఉన్నాడన్నారు.


చెడు వ్యసనాలకు బానిసవ్వడంతో రోజూ ఇంట్లో డబ్బులకు డిమాండ్‌ చేసేవాడని, కరోనా కారణంగా తండ్రి ఆదాయం తగ్గినందున డబ్బులివ్వలేకపోతే ఇంట్లో వారిపై భౌతిక దాడులకు పాల్పడేవాడని తెలిపారు. గతంలో మృతుడికి పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించి, కొన్నాళ్లు సొంతూరైన చీపురుపల్లి తీసుకువెళ్లమని తల్లిదండ్రులకు సూచించామన్నారు. దీంతో తల్లిదండ్రులు చీపురుపల్లి వెళ్లినప్పటికీ అనిల్‌ మాత్రం ఇక్కడే ఉండిపోయాడని, దీంతో వారు మళ్లీ మారికవలస వచ్చారన్నారు. వారం రోజులుగా డబ్బుల కోసం తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నాడని, ఆదివారం రాత్రి భోజన సమయంలో గొడవ పడి తల్లి ముఖంపై నీళ్లు చల్లి అనిల్‌ బయటకు వెళ్లిపోయి అర్ధరాత్రి 2.30 గంటలకు ఇంటికి చేరుకుని హాల్‌లో పడుకున్నాడన్నారు. అయితే కొడుకు వేధింపులకు విసిగివేసారిన తల్లి మాధవి ఇంట్లోని గ్యాస్‌ బండతో అనిల్‌ గుండెలపై బలంగా కొట్టడంతో మృతి చెందాడని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో నార్త్‌ జోన్‌ ఏసీసీ ఆర్‌.రవిశంకర్‌రెడి, పీఎంపాలెం సీఐ రవికుమార్‌ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనిల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. 

Updated Date - 2020-10-27T10:37:36+05:30 IST