మెరైన్‌ పీఎస్‌ హోమ్‌గార్డు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-22T05:51:56+05:30 IST

కుటుంబ కలహాల కారణంగా మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా చేస్తున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తన తల్లిని ఉద్దేశిస్తూ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మెరైన్‌ పీఎస్‌ హోమ్‌గార్డు ఆత్మహత్య
మడ్డు అప్పన్న (ఫైల్‌ ఫొటో)

భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు

ఇంటిలో ఉరివేసుకుని అఘాయిత్యం

భార్యవల్ల ప్రశాంతంగా బతకలేకపోతున్నానంటూ లేఖ


అచ్యుతాపురం, జనవరి 21: కుటుంబ కలహాల కారణంగా మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా చేస్తున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తన తల్లిని ఉద్దేశిస్తూ రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘నా భార్య వల్ల ప్రశాంతంగా బతకలేకపోతున్నాను. నిన్ను చూడలేని జీవితం అనవసరం. నాకోసం నీవు ఏడవొద్దు’’ అని లేఖలో వున్నట్టు పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ జి.లక్ష్మణరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి. మండలంలోని పూడిమడక శివారు జాలారిపాలెంలో వున్న మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లో మడ్డు అప్పన్న (30) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య దివ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిది ప్రేమ వివాహం. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల అప్పన్న తల్లిని, దివ్య కొట్టడంతో ఆమె మిగిలిన కుమారుల వద్దకు వెళ్లిపోయింది. భర్త తనను వేధిస్తున్నాడంతూ దివ్య గతంలో అప్పన్నపై అచ్యుతాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గత మంగళవారం ఉదయం విశాఖపట్నం వెళ్లిన దివ్య... బుధవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. భార్యాభర్తల మధ్య మళ్లీ తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. గురువారం ఉదయం అప్పన్న విధులకు వెళ్లలేదు. కొద్దిసేపటి తరువాత దివ్య పిల్లలను తీసుకుని అప్పన్న అన్న సింహాద్రి వద్దకు వెళ్లి... ‘మీ తమ్ముడు ఇబ్బందులు పెడుతున్నాడు’ అని చెప్పింది. తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసివున్నాయి. భర్త మొబైల్‌కు ఫోన్‌ చేసింది. కానీ స్పందన లేకపోవడంతో మళ్లీ సింహాద్రి వద్దకు వెళ్లింది. ‘‘మీ తమ్ముడు ఇంట్లోనే వుండి లోపల గడియ పెట్టుకున్నాడు. ఫోన్‌చేస్తే తీయడంలేదు’’ అని చెప్పింది. దీంతో సింహాద్రి వెంటనే అప్పన్న ఇంటికి వెళ్లి తలుపులు పగలుగొట్టాడు. అప్పన్న ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అప్పటికే మృతిచెందడంతో పోలీసులకు సమాచారాన్ని అందించాడు. ఎస్‌ఐ లక్ష్మణరావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అప్పన్న తన తల్లిని ఉద్దేశిస్తూ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 


లేఖలో ఏముందంటే....

‘‘అమ్మా నిన్ను చూడలేని జీవితం అనవసరం. కానీ నీవు ఎప్పుడు నా దగ్గర ఉంటావు? నాకోసం నీవు ఏడవొద్దమ్మ. నా భార్యవల్ల ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాను. నేననెప్పుడూ నీవాడినే అమ్మా’’ అన లేఖలో వుంది. 




గిరిజన బాలిక ఆత్మహత్య

ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యుల నిరాకరణతో అఘాయిత్యం

చింతపల్లి, జనవరి 21: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయలేదని మనస్తాపం చెందిన 16 ఏళ్ల బాలికల ఆత్యహత్యకు పాల్పడింది. మండలంలోని బిల్లబడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇన్‌ఛార్జి ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా వున్నాయి. చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ మేడూరు గ్రామానికి చెందిన మర్రి జగదీశ్‌ అనే యువకుడు, తాజంగి కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇదే పంచాయతీ బిల్లబడ్డు గ్రామానికి చెందిన కొర్రా మార్త అలియాస్‌ చిన్ని(16) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ మంగళవారం రాత్రి గ్రామానికి సమీపంలోని కాఫీ తోటల్లో ఉన్నట్టు తెలుసుకున్న బాలిక తల్లి, బంధువులు అక్కడికి వెళ్లి మార్తను ఇంటికి రమ్మని పిలిచారు. జగదీశ్‌తో తనకు పెళ్లి చేస్తానంటేనే ఇంటికి వస్తానని స్పష్టం చేసింది. కానీ వారు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి పారిపోయారు. జగదీశ్‌ బుధవారం ఉదయం తిరిగి గ్రామంలోకిరాగా, మార్త రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కాఫీ తోటల్లో గాలించగా.... చున్నీతో చెట్టుకు   ఉరేసుకుని కనిపించింది. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.



కుటుంబ కలహాలతోనే ఉపాధ్యాయుడు ఆత్మహత్య

ఫోన్‌ మెసేజ్‌లు, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిర్ధారణ

గొలుగొండ, జనవరి 21: మండలంలోని జోగుంపేటకు చెందిన ఉపాధ్యాయుడు కడిమి వరహాలబాబు (45) కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ ధనుంజయనాయుడు వెల్లడించారు. స్థానిక పెట్రోల్‌ బంక్‌ సమీపంలో సగానికిపైగా కాలిపోయిన మృతదేహాన్ని బుధవారం సాయంత్రం పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు... పెట్రోల్‌ బంక్‌ సీసీ కెమెరాల ఫుటేజీలతోపాటు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి మంగళవారం పంపిన మెసేజ్‌ల ఆధారంగా కుటుంబ కలహాల వల్లనే వరహాలబాబు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. మండలంలోని కొత్తమల్లంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఇతనికి భార్యతో విభేదాలు ఏర్పడ్డాయని, దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 



గాయపడిన మహిళ మృతి

ఎస్‌.రాయవరం, జనవరి 21: మండలంలోని అడ్డరోడ్డు వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మరణించినట్టు ఎస్‌ఐ చక్రధర్‌ చెప్పారు. గెడ్డపాలెం గ్రామానికి చెందిన కర్రి లక్ష్మిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిందని, చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌లో  తరలించామని ఆయన తెలిపారు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

 


చోరీ కేసులో నిందితుడి అరెస్టు... సొత్తు స్వాధీనం

డుంబ్రిగుడ: మండల కేంద్రంలో ఇటీవల జరిగిన చోరీకి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ గోపాల్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి.. డుంబ్రిగుడలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్‌గా పనిచేస్తున్న వంతల శాంతికుమారి ఇంటిలో ఈ నెల 17వ తేదీన ఐదు తులాల బంగారం వస్తువులు చోరీకి గురయ్యాయి. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఒడిశాకు చెందిన ఇంతాజ్‌ అనే వ్యక్తి వీటిని చోరీ చేసినట్టు గుర్తించారు. ఫ్లోరింగ్‌ టైల్స్‌ పనులు చేసే ఇతను... పాఠశాలలో పనులు చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న శాంతికుమారి ఇంటిలోకి చొరబడి బంగారాన్ని దొంగిలించినట్టు గుర్తించారు. నిందితుడిని గురువారం పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టుకి తరలించారు. 

    

పేకాట రాయుళ్లు అరెస్టు

రాంబిల్లి: మండలంలోని పెదకవలాపల్లి సమీపంలో పేకాట శిబిరంపై గురువారం దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశామని, వారి నుంచి రూ.7,100 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్‌ తెలిపారు.  

నర్సీపట్నం: పట్టణంలోని ఒక లాడ్జిపై గురువారం దాడి చేసి, పేకాట ఆడుతున్న  షేక్‌ నాగూర్‌, షేక్‌ మీరావలి, రాజేశ్‌, సన్నిబాబులను అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి రూ.67,763 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.


Updated Date - 2021-01-22T05:51:56+05:30 IST