ఉక్కు పిడికిలి బిగించండి

ABN , First Publish Date - 2021-03-02T06:40:20+05:30 IST

విశాఖ ఉక్కు ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ అజశర్మ అన్నారు

ఉక్కు పిడికిలి బిగించండి
కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ అజశర్మ

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ అజశర్మ

18వ రోజు కొనసాగిన దీక్షలు

కూర్మన్నపాలెం(విశాఖపట్నం), మార్చి 1: విశాఖ ఉక్కు ద్వారానే  అభివృద్ధి సాధ్యపడుతుందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ అజశర్మ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ గత 18 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అజశర్మ మాట్లాడుతూ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళలు, యువత ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్‌ రంగ సంస్థలకు కట్టబెట్టాలనే కేంద్ర ప్రభుత్వ దురాలోచనను ఆయన ఖండించారు. 

దేశభక్తితో కూడిన సమరం: జ్యోతేశ్వరరావు 

 పబ్లిక్‌ సెక్టర్‌ కోఆర్డినేషన్‌ కమిటీ రాష్ట్ర  కన్వీనర్‌ జ్యోతేశ్వరరావు మాట్లాడుతూ  ప్రభుత్వ రంగాన్ని రక్షించేందుకు జరుగుతున్న పోరాటం దేశభక్తితో కూడిన సమరమని అన్నారు. ఈ పోరాటాన్ని ఉధృతం చేసి దేశ వ్యాప్త ఉద్యమంగా మలుస్తామన్నారు. కాగా, సోమవారం దీక్షలలో బ్లాస్ట్‌ఫర్నేస్‌ విభాగానికి చెందిన కార్మికులు కూర్చున్నారు.   విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జేవీ సత్యనారాయణ మూర్తి, ఎన్‌.రామారావు, గంగారామ్‌, అయోధ్యరామ్‌, మంత్రి రాజ శేఖర్‌, డి.ఆది నారాయణ, గంధం వెంకటరావు, జె.సింహాచలం, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-02T06:40:20+05:30 IST