టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగిన కసరత్తు

ABN , First Publish Date - 2021-03-01T06:39:50+05:30 IST

జీవీఎంసీ పరిధిలో 98 వార్డులకు అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కసరత్తు చేపట్టింది.

టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగిన కసరత్తు
నాయకులతో చర్చిస్తున్న ఎంవీ భరత్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలో 98 వార్డులకు అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కసరత్తు చేపట్టింది. ఉదయం ఒకసారి ఇన్‌చార్జిలతో భేటీ అయిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రఽధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడులు, సాయంత్రం మరికొందరితో సమావేశమయ్యారు. సాయంత్రం భేటీలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు,  ఎంవీభరత్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా టికెట్‌ రేసులో ఉన్న పలువురు అభ్యర్థులు తమ మద్దతుదారులతో పార్టీ కార్యాలయానికి వచ్చారు. దక్షిణ సెగ్మెంట్‌ పరిధి 36వ వార్డు నుంచి పార్టీ టికెట్‌పై నామినేషన్‌ వేసి తరువాత వైసీపీలో చేరిన కేదారి లక్ష్మి తిరిగి ఆదివారం పార్టీ కార్యాలయానికి వచ్చారు. తనకు టికెట్‌ ఇవ్వాలని ఆమె పార్టీ నాయకులను కలిసి విన్నవించారు. అయితే ఒకసారి బయటకు వెళ్లిన వ్యక్తులకు టికెట్‌ కేటాయింపులో పరిగణనలోకి తీసుకోకూడదని కొందరు నేతలు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 36వ వార్డు నుంచి ఇమంది సత్యవతికి,  37వ వార్డు నుంచి చెన్నా సుధాకర్‌కు బీఫారం ఇవ్వాలని నిర్ణయించారు. దక్షిణంలో ఇంకా తీవ్ర పోటీలో ఉన్న 31, 35 వార్డుల విషయంపై నేతలు తర్జనభర్జనలు చేస్తున్నారు. సోమవారం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కాగా 49వ వార్డు నుంచి టికెట్‌ ఆశిస్తున్న యడ్ల సురేశ్‌నాయుడు రాష్ట్ర వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ అల్లుడు కావడంతో అతని స్థానంలో బి.ఎర్రునాయుడు, కృష్ణంరాజుల పేర్లు పరిశీలిస్తున్నారు. 


Updated Date - 2021-03-01T06:39:50+05:30 IST