దళితుల భూములపై రాబందు!

ABN , First Publish Date - 2022-07-27T09:12:46+05:30 IST

దళితుల భూములపై అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నుపడింది. బంగారం పండే ఆ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇచ్చిన డబ్బు తీసుకొని ఆ..

దళితుల భూములపై రాబందు!

రూ.20 కోట్ల పేదల భూమి కైవసానికి ఎమ్మెల్యే యత్నం

బంధువుల పేరిట రిజిస్ర్టేషన్‌కు అగ్రిమెంట్లు సిద్ధం 

దళితులను బెదిరించి.. సంతకాలు పెట్టాలని హుకుం 

పలువురు రైతులకు రూ.28 లక్షలు అడ్వాన్స్‌ చెల్లింపు

మరో 13 మందికి రూ.70 లక్షలు ఇచ్చేందుకు హామీ 

అందరూ భూములు అమ్మినట్లుగా రాసివ్వాలని ఆదేశం 

మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఓ ఎంపీపీకి భారీ నజరానా

ఐదెకరాల పొలం, రూ.5 లక్షల నగదు ఇచ్చేలా ఒప్పందం


పెదకాకాని, జూలై 26: దళితుల భూములపై అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నుపడింది. బంగారం పండే ఆ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇచ్చిన డబ్బు తీసుకొని ఆ పంటభూమిని తన బంధువుల పేరున రిజిస్ట్రేషన్‌ చేయించాలని, మాట వినకపోతే అంతు తేలుస్తామని అక్కడి రైతులను బెదిరిస్తున్నారు. వివరాలు... గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం అనమర్లపూడి గ్రామానికి చెందిన దళితులు ఏళ్ల తరబడి పండించుకుంటున్న భూమిని అప్పనంగా కాజేసేందుకు విఫలయత్నం జరుగుతోంది. కొలకలూరు గ్రామం నుంచి అనమర్లపూడి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా సర్వే నం.56లో 22 ఎకరాల 40 సెంట్ల భూమి ఉంది. ఇది ఎంతో సారవంతమైన భూమే కాకుండా రెండు పంటలు పండుతుంది.


మంచి గ్రావెల్‌ కూడా పడుతోంది. ఈ భూమిని కాజేసేందుకు ఓ ఎమ్మెల్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ఆస్తిని తనకు బంధువు, మేనల్లుడు అయిన వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. రూ.20కోట్ల విలువైన ఈ భూమిని కారుచౌకగా కొట్టేసేందుకు ఇప్పటికే కొందరు రైతులకు రూ.28 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారు. కీలకమైన మరో 13మందికి రూ.70లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదని... ఎమ్మెల్యే చెప్పినట్టు వింటే అందరికీ న్యాయం జరుగుతుందంటూ ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడుతున్నారు. 


దళితుల భూమి వివరాలు 

అనమర్లపూడిలో సర్వే నం.56లో 22 ఎకరాల 44 సెంట్ల భూమికి బ్రిటిష్‌ కాలంలో గ్రామానికి చెందిన పేద దళితులకు ఒక్కొక్కరికి 2ఎకరాల చొప్పున పట్టాలు ఇచ్చారు. అప్పటినుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 1970లో పాత పట్టాలను రద్దు చేస్తూ అదే గ్రామానికి చెందిన అప్పటి పెద్దమనిషి ఒకరు తన ముఖ్య అనుచరులైన 9 మందికి ఒక్కొక్కరికి 2 ఎకరాల 30 సెంట్ల చొప్పున పట్టాలు ఇప్పించారు. దీంతో అప్పటి నుంచి దళితుల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఈ వ్యవహారం కాస్తా కోర్టుకు చేరుకుంది. ఇంతలో ఆ ఎమ్మెల్యే ఇరుపక్షాల వారిని పిలిపించి రూ.1.80 కోట్లు ఖర్చుపెట్టి రూ.20కోట్ల విలువైన ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


సంతకాలు పెట్టాలని బెదిరింపులు 

పొలాలు వదులుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని, తక్షణమే సంతకాలు పెట్టి అగ్రిమెంట్‌ రాయాలని ఎమ్మెల్యే బంధువులు, ముఖ్య అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. ఈ బెదిరింపులు, ప్రలోభాలకులోనై ఇప్పటికే కొంతమంది సంతకాలు పెట్టగా మరికొంతమంది సంతకాలు పెట్టలేదని తెలిసింది. భూమి వదులుకునేందుకు సిద్ధంగా లేనివారిని దారికి తెచ్చుకొనేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రామానికి చెందిన దళితులతో మాట్లాడి గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం చక్కబెట్టినందుకు గాను మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఓ ఎంపీపీకి భారీ నజరానాను అందిస్తామని సదరు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఐదెకరాల భూమి, రూ.5 లక్షల నగదును ఆయనకు ముట్టచెబుతున్నారు. దీంతో ఆయన రంగంలోకి దిగి, చెప్పినమాట వినకపోతే ఎమ్మెల్యే మీ అంతు తేలుస్తారంటూ బెదిరిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని దళితులను, భూములను కాపాడాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2022-07-27T09:12:46+05:30 IST