వ్యవసాయ సలహా మండలి మొక్కుబడి సమావేశాలు!

Published: Sat, 14 May 2022 00:52:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon

చైర్మన్‌, నలుగురైదుగురు అధికారులే హాజరు! 

మండల కమిటీ సభ్యులు, గ్రామస్థాయి చైర్మన్ల గైర్హాజరు

విజయవాడ రూరల్‌, మే 13 : మరో నెల రోజుల్లో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవుతోంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన కాల్వలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో గ్రామ, మండలస్థాయిలో విత్తనాలు, ఎరువులు, సాగునీటి అవసరంపై ప్రణాళికలు రూపొందించాల్సిన మండలస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తుండటం గమనార్హం. సీఎం జగన్‌ ఆశయాలకు భిన్నంగా రూరల్‌ మండలంలో మండలి సమావేశాల నిర్వహణ ఉంది. నున్నలోని ఆర్బీకేలో మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి అధ్యక్షతన సమావేశం శుక్రవారం నిర్వహించారు. అయితే, ఈ సమావేశాన్ని అధికారులు మొక్కుబడిగానే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కమిటీ చైర్మన్‌తోపాటు మండలస్థాయి అధికారులు నలుగురైదుగురితో సమావేశాన్ని పూర్తి చేసేశారు. మండల కమిటీ సభ్యులుగానీ, గ్రామస్థాయి సలహా మండలి చైర్మన్లుగానీ ఎవరూ హాజరుకాలేదు. ఈ సమావేశాల గురించి మీడియాకు సమాచారం లేదంటేనే నిర్వహణ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అజెండాను కూడా తూతూ మంత్రంగానే రూపొందించడం గమనార్హం. సమావేశం ముగిశాక విజయవాడ రూరల్‌ మండల వ్యవసాయాధికారి సురేష్‌ మీడియాకు ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది పీఎం కిసాన్‌ రైతు భరోసా లబ్ధిదారులంతా ఈ-కేవైసా చేయించుకోవాలని ఏవో హరీష్‌ ప్రకటనలో తెలిపారు. అలాగే గతేడాది పంటల దిగుబడి, రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఈ ఏడాదికి సంబంధించి భూసార పరీక్షలు, పచ్చిరొట్ట ఎరువుల లభ్యతపై చర్చించామన్నారు. అలా చేయకపోతే ప్రభుత్వం నుంచి లబ్ధిపొందలేరన్నారు. ఈ ఏడాది ఎఫ్‌పీవోల ద్వారా కోల్డ్‌ స్టోరేజ్‌, కలెక్షన్‌ కౌంటర్లకు ఉద్యానశాఖ ఐదు లక్షల వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. డ్రోన్‌లకు 50శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉద్యానశాఖాధికారి చందు, జలవనరులశాఖ ఏఈఈ కొండా నాయక్‌, ఏఈ రాజశేఖర్‌ పాల్గొన్నట్లు ఏవో తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.