మితిమీరిన ఆకతాయిల ఆగడాలు!

ABN , First Publish Date - 2021-12-25T04:19:09+05:30 IST

కావలి పట్టణంలో ఆకతాయిలు ఆగడాలు మితిమీరి పోతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

మితిమీరిన ఆకతాయిల ఆగడాలు!
ఆర్వోబీ వంతెన కింద పార్కింగ్‌ చేసిన దివచక్రవాహనాలు

వైకుంఠపురం ఆర్వోబీ వంతెనే అడ్డా

పట్టించుకోని పోలీసులు

అమ్మాయిలకు రక్షణ కరువు

కావలి, డిసెంబరు 24: కావలి పట్టణంలో ఆకతాయిలు ఆగడాలు మితిమీరి పోతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొన్ని చోట్ల ప్రజలే ఆకతాయిలకు తగిన శాస్తి చెపుతున్నా వారిలో మార్పు కనిపించడంలేదు. వైకుంఠపురం ప్రాంతంలో పాత రైల్వే గేటు వద్ద రైల్వే అధికారులు నిర్మించిన వంతెన ఆకతాయిలకు అడ్డాగా మారింది. ఆ ప్రాంతంలో మందుబాబులు, గంజాయి విక్రయిదారులు, పీల్చే వారు తదితర అల్లరి మూకలు నిత్యం అక్కడే తిష్ఠ వేసి దారినపోయే వారిని వేధిస్తుండటంతో అమ్మాయిలకు రక్షణ కరువైంది. గురువారం సాయంత్రం ఒక అమ్మాయి రైల్వే ట్రాక్‌ దాటి ఆ వంతెన మీదుగా వైకుంఠపురం వెళ్లుతుండగా దానిని పసి గట్టిన ఇద్దరు యువకులు ఆమెను అన్నపుగుంట వైపు లాక్కొని వెళ్లి ఆమె నోటికి గుడ్డ పెట్టి సెల్‌ఫోన్‌ లాక్కొనేందుకు ప్రయత్నించగా ఆమె నోటికి ఉన్న గుడ్డతీసి కేకలు వేసింది. అటువైపు వస్తున్న వారు గమనించి ఎవరని ప్రశ్నించటంతో వారు పరారయ్యారు. అంతకు ముందు రెండు రోజుల కిందట రైల్వే రోడ్డులో ఓ యువకుడు ఓ బాలికను వేధిస్తుండగా స్థానికులు గుర్తించి వాడిని తరిమి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అలాగే దానికి రెండు రోజులు ముందు స్థానిక కసాయి వీధి ప్రాంతంలో ఓ వ్యక్తి దారినపోతున్న అమ్మాయి పట్ట అనుచితంగా వ్యవహరించడంతో స్థానికులు గుర్తించి ఆయనను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పట్టణంలో పోలీసుల నిఘా లేక పోవటంతో నిత్యం ఇలాంటి సంఘటనలు ఏదో ఒక మూలన జరుగుతున్నాయనే ఉన్నాయి. అల్లరి మూకలకు పైకుంఠపురం రైల్వే వంతెన అడ్డాగా మార్చుకుని మందుబాబు, గంజాయి విక్రయదారులు, గంజాయి పీల్చే వారు అక్కడే తిష్ఠ వేయడంతో అటువైపు వెళ్లే రైల్వే ట్రాక్‌కు ఇరువైపుల ఉన్న వైకుంఠపురం, జనతాపేట, కలుగోలమ్మపేట, వడ్డిపాలెంకు చెందిన ప్రజలతో పాటు విద్యార్థులు అటేవైపు రాకపోకలు సాగించేందుకు భయాందోలన చెందుతున్నారు. చీకటి పడిలే అక్కడ లైట్లు కూడా లేక పోవటం పరిస్థితి మరింత ఆందోళనగా ఉంది. అధికారులు స్పందించి అక్కడ లైట్లు వేయించి పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసి అల్లరి మూకలు ఆగడాలు నియింత్రించాల్సి ఉంది.




Updated Date - 2021-12-25T04:19:09+05:30 IST