కన్నుల పండువగా తొలేళ్లు

ABN , First Publish Date - 2020-10-27T08:56:22+05:30 IST

మేళతాళాలు.. వేదమంత్రోచ్ఛారణ నడుమ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ తొలేళ్ల ఉత్సవం సోమవారం జరిగింది.

కన్నుల పండువగా తొలేళ్లు

రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన పూజారి 


విజయనగరం రూరల్‌, అక్టోబరు 27: మేళతాళాలు.. వేదమంత్రోచ్ఛారణ నడుమ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ తొలేళ్ల ఉత్సవం సోమవారం జరిగింది. ఉత్సవానికి ముందు రోజు ఆదివారం రాత్రి 10.35 గంటల సమయంలో అమ్మవారిని తొలేళ్లకు సిద్ధం చేస్తూ పురోహితులు వివిధ నదీజలాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించాక భక్తులకు దర్శనాన్ని కల్పించారు. మరోవైపు అమ్మవారికి భక్తులు ఘాటాలను సమర్పించారు. విజయనగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఘాటాలను పరిమిత సంఖ్యలో తీసుకువచ్చారు. కాగా తొలేళ్ల తంతులో ప్రధానమైనది కోట శక్తికి ఘాటాభిషేకం.


హుకుంపేట వాసులు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఘాటాలను తీసుకువచ్చారు. హుకుంపేట, పుచ్చలవీధి, ఉల్లివీధి, గంటస్తంభం మీదుగా అమ్మవారి ఆలయానికి ఈ ఘాటాలు చేరుకున్నాయి. ఆలయం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఘాటాలను మేళతాళాల నడుమ కోట శక్తి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఊరేగింపుగా రాత్రి 11 గంటల ప్రాంతంలో అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు.


 రైతులకు విత్తనాల పంపిణీ 

రైతులకు విత్తనాల పంపిణీయే తొలేళ్ల ఉత్సవంలో కీలకఘట్టం. సిరిమానును అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరమణ అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం విజయనగరం పరిసర ప్రాంతాల రైతులకు విత్తనాలను చదురుగుడి వద్ద పంపిణీ చేశారు. వాటిని తీసుకునేందుకు కొద్దిమందినే అమ్మవారి ఆలయం వద్దకు పోలీసులు అనుమతించారు. రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రక్రియ సాగింది. 

Updated Date - 2020-10-27T08:56:22+05:30 IST