పండుగలో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు

ABN , First Publish Date - 2020-10-27T08:59:32+05:30 IST

సిరులతల్లి పైడితల్లమ్మ తల్లి పండుగలో ఈ ఏడాది ప్రత్యక్షంగా పాల్గొనడం లేదని మాన్సాస్‌ పూర్వపు చైర్మన్‌, కేంద్ర మాజీ మంత్రి, పూసపాటి వంశీయుడు అశోక్‌ గజపతిరాజు చెప్పారు.

పండుగలో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు 


విజయనగరం రూరల్‌, అక్టోబరు 27: సిరులతల్లి పైడితల్లమ్మ తల్లి పండుగలో ఈ ఏడాది ప్రత్యక్షంగా పాల్గొనడం లేదని మాన్సాస్‌ పూర్వపు చైర్మన్‌, కేంద్ర మాజీ  మంత్రి, పూసపాటి వంశీయుడు అశోక్‌ గజపతిరాజు చెప్పారు. ఏటా తోలేళ్ల ఉత్సవం రోజున కుటుంబ సమేతంగా మాన్సాస్‌ తరుపున పట్టువస్ర్తాలను  స్వయంగా వెళ్లి సమర్పించేవారు. ఈ ఏడాది  స్వయంగా వెళ్లకుండా  సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తన కుటుంబం తరుపున పట్టువస్త్రాలను దేవస్థానం అధికారులకు పంపించేశారు. ఆనంతరం తన  నివాసంలో విలేకర్లతో అశోక్‌ గజపతిరాజు మాట్లాడారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ఇంటివద్దే పండుగ జరుపుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం  ఆదేశించిందని, వారి ఆదేశాల మేరకు తాను కూడా ఇంటి వద్దే ఉండి పండుగ జరుపుకోనున్నట్టు చెప్పారు. భక్తుడిగా తాను ఏ రోజు గౌరవాన్ని కోరుకోలేదన్నారు. సంప్రదాయబద్ధంగా పైడిమాంబ తొలేళ్లు, సిరిమానోత్సవం, ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగానికి అశోక్‌ సూచించారు. ఆయన వెంట కుమార్తె అదితి గజపతిరాజు ఉన్నారు. 


పట్టువస్ర్తాలు సమర్పించిన సంచయిత 

పైడిమాంబకు అందరూ సమానమేనని మాన్సాస్‌ చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు అన్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు మాన్సాస్‌ తరుపున పైడిమాంబకు పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత ఆమెకు ఆలయ మర్యాదలతో సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆమె  అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాన్సాస్‌ చైర్‌పర్సన్‌ హోదాలో పైడిమాంబకు పట్టువస్ర్తాలు సమర్పించడం గొప్ప అవకాశమని.. పూర్వజన్మసుకృతమని అన్నారు. నమ్ముకున్న భక్తులకు పైడిమాంబ ఆయురారోగ్యాలు, ఐష్టశ్వర్యాలు ఇస్తారన్నారు. స్వాగతం పలికిన వారిలో ఆలయ ఈవో జీవీఎస్‌ సుబ్రహ్మణ్యంతో పాటు అర్చకులు, సిబ్బంది ఉన్నారు.


లడ్డూ ప్రసాదం సిద్ధం

సిరిమానోత్సవానికి ప్రసాదం సిద్ధమైంది. అమ్మవారి దర్శనం ఎంత పవిత్రంగా భావిస్తారో.. ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తారు. భక్తులకు అవసరమయ్యే ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది సిద్ధంచేశారు.  శివాలయం వీధిలో వున్న పైడిమాంబ కల్యాణ మండపంలో ప్రసాదాలు తయారు చేసే ప్రక్రియ చురుగ్గా సాగింది. చదురుగుడి, వనంగుడిలో 20 వేల వరకూ లడ్డూలు అవసరమౌతుందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు తయారు చేశారు. 80 గ్రాముల లడ్డూ ధర రూ.15. 

Updated Date - 2020-10-27T08:59:32+05:30 IST