ఎదురుచూపులు

ABN , First Publish Date - 2020-10-30T11:51:36+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు విశేష సేవలందించిన లింక్‌, క్రషీ వర్కర్లు పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్నారు.

ఎదురుచూపులు

ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న లింక్‌, క్రషీ వర్కర్లు

అంగన్‌వాడీ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌

నేతల దృష్టికీ విన్నపాలు


(పార్వతీపురం):అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు విశేష సేవలందించిన లింక్‌, క్రషీ వర్కర్లు పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. నాలుగేళ్ల కిందటి వరకు వీరు తక్కువ గౌరవ వేతనంతో పనిచేశారు. 2016 తరువాత వీరిని విధుల నుంచి తొలగించేశారు. సుమారు వెయ్యి మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దశల వారీగా తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకువెళ్తూ.. ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. అప్పట్లో క్రషీ వర్కర్‌కు రూ.3 వేలు, లింక్‌ వర్కర్‌కు రూ.750 వేతనం ఇచ్చేవారు. 2014 నుంచి 2016 వరకు కేంద్ర ప్రభుత్వం అందించే వేతనాలతో వీరు కొనసాగేవారు. కేంద్రం లింక్‌, క్రషీ వర్కర్ల వేతనాల కోసం అందించే ఆర్థిక సాయాన్ని 2016 మే నుంచి నిలిపివే సింది. ఆ తరువాత వీరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ పునర్నియామకానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్నాళ్లు అంగన్‌వాడీ నియామకాల్లో వారికి ప్రాధాన్యం ఇచ్చింది. నేడు అదీ లేదు. దీంతో వారంతా న్యాయం కోసం ఆందోళన బాట పట్టారు.


తాజాగా జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్ల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆందోళనల ద్వారా ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ఫలితం లేకపోతోంది. నోటిఫికేషన్‌ ఇవ్వకుండా తమను ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించాలని కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాలో భద్రగిరి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో క్రషీ వర్కర్లు 49, లింక్‌ వర్కర్లు 130 మంది పనిచేసేవారు. కురుపాంలో క్రషీ 26, లింక్‌ 203 మంది, పార్వతీపురం ప్రాజెక్టు పరిధిలో క్రషీ 18, లింక్‌ వర్కర్లు 186, పాచిపెంట ప్రాజెక్టు పరిధిలో క్రషీ 32, లింక్‌ వర్కర్లు 111 ఉన్నారు. సాలూరు రూరల్‌ పరిధిలో క్రషీ 33, లింక్‌ వర్కర్లు 132 మంది గతంలో విధులు నిర్వహించేవారు. ఇలా జిల్లాలో మొత్తం సుమారు వెయ్యిమంది పనిచేశారు. అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది వారి ఆవేదన. క్రషీ, లింక్‌ వర్కర్లను 2016లో తొలగించిన తరువాత క్రమంగా ఖాళీ అయిన పోస్టుల్లో అప్పట్లో పనిచేసిన క్రషీ, లింక్‌ వర్కర్లలో కొంతమందికి  అవకాశం ఇచ్చారు. ఖాళీ అయిన పోస్టుల్లో 133 మంది వరకు ఎటువంటి నోటిఫికేషన్‌ లేకుండా అర్హత కలిగిన వారికి పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వం   మారిన తరువాత వారిని పూర్తిగా తీసుకోవడం లేదు. 


దరఖాస్తు చేసుకోవాల్సిందే..ఎం.రాజేశ్వరి, పీడీ, ఐసీడీఎస్‌

క్రషీ, లింక్‌ వర్కర్లుగా పనిచేసినవారు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి అందరిలాగే దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్‌ ప్రకారమే ఎంపిక జరుగుతుంది.

 

ప్రాధాన్యం ఇవ్వాలి..రంజిత్‌కుమార్‌, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు

గతంలో జారీ చేసిన 1404 మెమో ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీలో క్రషీ, లింక్‌ వర్కర్లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. దీనిపై ఇప్పటికే ఉద్యమాలు చేశాం. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టి క్రషీ, లింక్‌ వర్కర్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. 

Updated Date - 2020-10-30T11:51:36+05:30 IST