గ్రామ వలంటీర్ల వేతన కష్టాలు

ABN , First Publish Date - 2021-06-17T06:07:35+05:30 IST

చోడవరం పంచాయతీలో 105 మంది వరకు వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు.

గ్రామ వలంటీర్ల వేతన కష్టాలు
చోడవరం పంచాయతీలోని ఓ గ్రామంలో సర్వే చేస్తున్న వలంటీరు

రెండు నెలలుగా అందని జీతాలు
చోడవరంలో ఆది నుంచీ ఇదే పరిస్థితి
ప్రశ్నిస్తే ఉద్యోగం ఊడుతుందని అధికారుల హెచ్చరికలు
ఇబ్బందులు పడుతూనే మిన్నకుంటున్న వైనం


చోడవరం, జూన్‌ 16:
ఇచ్చేది అరకొర గౌరవ వేతనం.. అది కూడా ఎప్పుడొస్తుందో తెలియని దౌర్భాగ్యం.. ప్రశ్నిస్తే ఉద్యోగం ఊడుతుందనే భయం.. గత్యంతరం లేక ఇబ్బందులు పడుతూనే జీవనం.. ఇదీ చోడవరం మండల కేంద్రంలోని గ్రామ వలంటీర్ల దుస్థితి.

చోడవరం పంచాయతీలో 105 మంది వరకు వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో చాలా మంది నిరుపేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే. వీరంతా నెల జీతంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వచ్చేది రూ.5 వేలైనా కుటుంబానికి అండగా ఉండడంతో పాటు స్థానికంగా ఉపాధి లభిస్తుందన్న ఆశతోనే కాలం నెట్టుకొస్తున్నారు. అధికారులు అప్పగించే అన్ని పనులు నిర్వహిస్తున్నప్పటికీ, వేతనాలు మాత్రం సక్రమంగా అందడం లేదు. ఈ సమస్య అన్ని చోట్లా ఉందంటే కొంతవరకు భరించేవారే! ఒక్క చోడవరం పంచాయతీలోనే ఇటువంటి పరిస్థితి ఎదురవుతుండడంతో గ్రామ వలంటీర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకు జాప్యం చేస్తున్నారనే దానిపై వారిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రతిసారీ ఆలస్యమే..!
నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలోని ఇతర పంచాయతీల్లో వలంటీర్లకు వేతనాలు నెలనెలా అందుతున్నప్పటికీ, ఒక్క మేజర్‌ పంచాయతీలో పనిచేస్తున్న వలంటీర్లకు మాత్రమే సక్రమంగా అందడం లేదు. ఈ ఏడాది మార్చిలో వలంటీర్లకు వేతనాలు అందాయి. ఈ తరువాత ఏప్రిల్‌, మే నెలలకు ఇంకా చెల్లించలేదు. ఈలోగా జూన్‌ నెల మూడో వారం కూడా వచ్చేసింది. అయినా ఇప్పటికీ వేతనాల ఊసే లేదు. ఈ పరిస్థితి మొదట్నుంచీ ఉందని వలంటీర్లు చెబుతున్నారు. వలంటీర్లుగా విధుల్లో చేరినప్పటి నుంచి ఏనాడూ సకాలంలో వేతనాలు అందుకోలేదని వారు వాపోతున్నారు. నిధులు ఉండి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.


ప్రశ్నిస్తే వేధింపులు
నెలంతా కష్టపడి పనిచేసిన వలంటీర్లు వేతనాల కోసం ప్రశ్నిస్తే టార్గెట్‌ అవుతున్నారు. వేతనాలు పెట్టాల్సిన పంచాయతీ ఈవో కనీసం పట్టించుకోకపోవడంతో పాటు అడిగిన వలంటీర్లపై వేధింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వేతనాల కోసం అడిగితే మీరు సక్రమంగా పనిచేయడం లేదని, వేతనాలు నిలిపివేస్తామని, మీ స్థానంలో కొత్తవారిని నియమిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు వలంటీర్లు వాపోతున్నారు.  అందరి సమస్యలు తీర్చేందుకు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, తమ వేతనాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదని, కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులతో కాలం నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-06-17T06:07:35+05:30 IST