వేతన..వేదన!

ABN , First Publish Date - 2021-08-02T05:07:21+05:30 IST

‘స్వచ్ఛభారత్‌ మిషన్‌’లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్యానికి పెద్దపీట వేశాయి. పట్టణాల్లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, గ్రామాల్లో చెత్త సంపద కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. తడి, పొడి చెత్తను వేరుచేసి డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు గ్రీన్‌ అంబాసిడర్లను నియమించారు. జనాభా ప్రాతిపదికన వీరి నియామకం చేపట్టారు. రోజుకు రూ.200 చొప్పున నేలకు రూ.6,000 వేతనంగా నిర్ణయించారు.

వేతన..వేదన!
పారిశుధ్య పనులు చేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లు(ఫైల్‌)

తొమ్మిది నెలలుగా అందని వేతనాలు

కోట్లాది రూపాయలు పెండింగ్‌

ఆశగా ఎదురుచూస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లు

(భోగాపురం)

‘స్వచ్ఛభారత్‌ మిషన్‌’లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్యానికి పెద్దపీట వేశాయి. పట్టణాల్లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, గ్రామాల్లో చెత్త సంపద కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. తడి, పొడి చెత్తను వేరుచేసి డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు గ్రీన్‌ అంబాసిడర్లను నియమించారు. జనాభా ప్రాతిపదికన వీరి నియామకం చేపట్టారు. రోజుకు రూ.200 చొప్పున నేలకు రూ.6,000 వేతనంగా నిర్ణయించారు. కానీ గత తొమ్మిది నెలలుగా వీరి వేతనాలు నిలిచిపోయాయి. గత ఏడాది అక్టోబరు నుంచి వీరికి జీతాలు చెల్లించడం లేదు. దీంతో వీరు కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా విపత్తు వేళ అతి కష్టమ్మీద పారిశుధ్య పనులు చేపడుతున్న తమపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు చెల్లించకపోడవతో ఆ ప్రభావం పనులపై పడుతోంది. పారిశుధ్య పనులు చేయించలేకపోతున్నామని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. 

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో 959 పంచాయతీల్లో 2,289 మంది గ్రీన్‌ అంబాసిడర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.6,000 చొప్పున వేతనం అందిస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ.1.37 కోట్లు వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం తొమ్మిది నెలలకుగాను రూ.12.36 కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. అధికారులను అడుగుతుంటే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వం ‘మనం మన పరిశుభ్రత’ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజా భాగస్వామ్యంతో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరోవైపు ‘స్వచ్ఛభారత్‌’ పథకానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులు చేపడుతున్న గ్రీన్‌ అంబాసీడర్లకు వేతనాలు చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. 

సాంకేతిక సమస్యలతో...

గ్రీన్‌ అంబాసిడర్ల వేతనాలు పెండింగ్‌లో ఉండడం వాస్తవమే. సాంకేతిక సమస్యల వల్లే జాప్యం జరిగింది. వివరాలు అప్‌లోడ్‌ చేయడంలో ఆలస్యమైంది. బ్యాంకు ఖాతాల వివరాలు సక్రమంగా ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. కొద్దిరోజుల్లో వేతనాలు మంజూరవుతాయి. నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తాం.

-డి.సత్యనారాయణ, డీపీఆర్‌సీ జిల్లా కోఆర్డినేటర్‌



Updated Date - 2021-08-02T05:07:21+05:30 IST