
ఐదేళ్ల గరిష్ఠానికి వేతన పెంపు
ఈ ఏడాది 9.9 శాతం హైక్
అయాన్ సర్వే నివేదిక అంచనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఉద్యోగుల సగటు వేతన పెంపు 9.9 శాతంగా ఉండవచ్చని అంతర్జాతీయ వృత్తినిపుణుల సంస్థ అయాన్ 26వ వార్షిక సర్వే నివేదిక అంచనా వేసింది. 2016 తర్వాత గరిష్ఠ స్థాయి ఇది. 2021లో సగటు వేతన పెంపు 9.3 శాతంగా నమోదైందని తెలిపింది. ఆర్థిక పునరుద్ధరణ జోరందుకోవడంతోపాటు వ్యాపార సెంటిమెంట్ మెరుగైన నేపథ్యంలో కంపెనీలు చురుకైన కార్మికశక్తిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాయని అయాన్ పేర్కొంది. ఈ అధ్యయనంలో భాగంగా దేశంలోని 40కి పైగా విభాగాలకు చెందిన 1,500 కంపెనీల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించడం జరిగిందని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్, హైటెక్నాలజీ/ఐటీ, ఐటీ ఆధారిత సేవలు(ఐటీఈఎస్), లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీల్లో పనిచేసేవారికి అధిక వేతన పెంపు లభించనుందని నివేదిక పేర్కొంది.
9%పెంపు: మెర్సర్
ఈ సంవత్సర భారత ఉద్యోగుల సగటు వేతన పెంపు 9 శాతంగా ఉండవచ్చని మెర్సర్ అంచనా. కరోనా సంక్షోభం కారణంగా 2020లో తగ్గించుకున్న ప్రోత్సాహక వ్యయాలను కంపెనీలు మళ్లీ కొవిడ్ పూర్వ దశ స్థాయికి పెంచుకుంటున్నాయని నివేదికలో పేర్కొంది.