వెయిట్‌ లాస్‌!

ABN , First Publish Date - 2022-05-22T04:58:56+05:30 IST

దేశవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకుంది. ఈ సమయంలో ప్రతి వస్తువు ధర భారీగా పెరగాలి.

వెయిట్‌ లాస్‌!

ధర అదే.. లోపల తరుగే..

పెరుగుతున్న ధరల దెబ్బకు సైజుల తగ్గింపు

ఆయా పరిమాణల్లో 10శాతం మేర తగ్గింపు

కొత్త వ్యాపార సూత్రంతో వినియోగదారులకు దెబ్బ

ఇడ్లీ, దోశ, బిర్యానీలది కూడా అదే పరిస్థితి

మరో మూడునెలలు పాటు ఇంతే...

పలు సర్వేలలో ఆసక్తికర విషయాలు వెల్లడి

 

ధర తప్ప భారతీయ వినియోగదారుడు మిగిలిన విషయాలను అంతగా పట్టించుకోడు అంటూ ప్రముఖ వ్యాపార దిగ్గజం వారెన్‌ బఫెట్‌ అన్న మాటలు ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతాయి. లాక్‌డౌన్‌ తర్వాత అన్ని ధరలు ఆకాశాన్నంటాయి అనుకుంటున్నాం.. కానీ కొన్ని రకాల వస్తువుల ధరలు మాత్రం అలానే ఉండిపోయాయి. ముఖ్యంగా వీటిలో ఆహార పదార్ధాలు, చిన్నపిల్లలు తినే స్నాక్స్‌ ధరలు మాత్రం పెద్దగా పెరగలేదు. ఇది ఒక విధంగా సంతోషకరమైన విషయమే అనుకుంటున్నారా.. కానీ ఇక్కడే చిన్న కిటుకు ఉంది. ధరలను పెంచకుండా వాటి పరిమాణాలను తగ్గించి విక్రయిస్తున్నారు. కానీ ఇది మనం పెద్దగా పట్టించుకోం.. ధరలు పెంచలేదని మాత్రం ఆనందపడుతుంటాం...! దీనినే కార్పొరేట్‌ భాషలో ష్రింక్‌ ఫ్లేషన్‌ అంటారు మరి!



గుంటూరు(తూర్పు), మే21: దేశవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకుంది. ఈ సమయంలో ప్రతి వస్తువు ధర భారీగా పెరగాలి. కానీ కొన్ని వస్తువుల ధరలు అలానే ఉండిపోయాయి. దీనిపై ప్రపంచ బ్యాంకు, ఆర్బీఐలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఎందుకు పెరగలేదని ఆరా తీస్తే ధరలను పెంచకుండా వాటి పరిమాణాలను తగ్గించినట్టు గుర్తించారు. ధరలు పెంచితే తమ వస్తువులు కొనుగోలు చేస్తారో లేదో అనే ఆందోళనతో కొన్ని రకాల కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలే కాదు చిన్న చిన్న చిరువ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు ఇప్పుడు ఇదే వ్యాపార సూత్రాన్ని అవలంబిస్తున్నాయి. తమ దగ్గర దొరికే ఇడ్లీ, దోశవంటి వాటి పరిమాణాలను 10శాతం మేర తగ్గించాయి. బిర్యానీలది కూడా ఇదే పరిస్థితి. ఇదే విషయాన్ని కొన్ని ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ కంపెనీలు తమ నివేదికలో వెల్లడించడం విశేషం.


చిరుతిళ్లపై ప్రభావం..

పెరిగిన ధరల ప్రభావం చిరుతిళ్లపై భారీగా పడింది. ఒకప్పుడు రూ.10కి వచ్చే చిప్స్‌, బిస్కెట్‌ ప్యాకెట్లు ప్రస్తుతం అదే ధరకు లభిస్తున్నాయి. కానీ వాటి సైజు మాత్రం మారిపోతుంది. ఇవే కాదు సబ్బులు, పేస్టులు, షాపింగ్‌ మాల్స్‌లో దొరికే డ్రైప్రూట్స్‌ వంటి వాటి ధరల్లో పెద్దగా మార్పురాలేదు. కంపెనీలు తాము నష్టపోకుండా తమ ఉత్పత్తుల బరువులను తగ్గించి వేస్తున్నాయి. దీనినే కార్పొరేట్‌ భాషలో ష్రింక్‌ ఫ్లేషన్‌ అంటారు.  ఇలాంటి పరిస్థితి మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. కొన్ని పేరొందిన రెస్టారెంట్లు కూడా తాము తయారుచేసే పిజ్జా, బిర్యానీ వంటి వాటి పరిమాణాలను పూర్తిగా తగ్గించివేశాయి.


ఆన్‌లైన్‌ ఆర్డర్లు..

గతంలో కంటే ఆహార పదార్ధాల పరిమాణాల్లో దాదాపు 10శాతం, బిర్యానీ, భోజనం వంటి వాటి విషయంలో 12 శాతం మేర వాటి పరిమాణం తగ్గిస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సాయంత్రం వేళల్లో అధికంగా ఆర్డర్లు వచ్చే సమోస, గులాబ్‌జామ్‌ వంటివి వాటి సైజులు కూడా తగ్గిపోయాయి. ఆర్డర్లు మాత్రం గతంలో మాదిరిగానే ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు ఉన్న చికెన్‌, బాస్మతి బియ్యం, నాణ్యమైన నూనె ఇతర ఖర్చులు కలుపుకొని పెద్దనగరంలో అయితే రూ.420 వరకు ఉండాలి. కానీ ప్రస్తుతం పేరున్న రెస్టారెంట్లలో కూడా దాని ధర రూ.330 మించడం లేదు. బరువులో మార్పులకు సంబంధించి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

 

సబ్బుల సైజుల్లో భారీ మార్పులు..

మిగిలిన వస్తువులను పక్కనబెడితే సబ్బులు, ఫ్లోర్‌ శుభ్రం చేసే వస్తువులు పరిమాణాల్లో భారీ మార్పులు వచ్చాయి. మనం దినసరిగా వాడే పది వస్తువుల్లో దాదాపు 9 వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థ తన క్యూ4 నివేదికలో వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆర్బీఐ కూడా ధ్రువీకరించింది. ఉదాహరణకు ప్రస్తుతం రూ.10కి లభించే గిన్నెల శుభ్రం చేసే సబ్బు 135 గ్రాములు మాత్రమే ఉంది. కానీ రెండు నెలల క్రితం దీని బరువు 155 గ్రాముల వరకు(కవర్‌తో కలిపి) ఉండేది. వీటితో పాటు మనకు   రూ.10కి లభించే దాదాపు 15 రకాల స్నాక్స్‌లు మూడునెలల క్రితం 55 గ్రాములు ఉండేవి. కానీ ప్రస్తుతం అవి 42 గ్రాములకు తగ్గిపోయాయి. ఇవి మచ్చుకు ఉదాహరణకు మాత్రమే. 


మరో మూడు నెలలు ఇంతే...

వస్తువుల పరిమాణం తగ్గడం పట్ల ఆర్బీఐ తన నివేదికను వెల్లడించింది. గతంలో ధర, తక్కువ బరువు ఉన్న వస్తువులు మనకు మరో మూడు నెలలపాటు అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో ద్రవోల్బణం మరింత పెరిగే ప్రమాదముందని అప్పుడు మాత్రం ధరల పెంచక తప్పదన్నారు. పెరుగుతున్న ఎడిబుల్‌ ఆయిల్‌ ధరల కారణంగా ఆహార కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని రానున్న కాలంలో ధరల పెరగకతప్పదని అవి రెట్టింపు తేడా ఉండవచ్చని నివేదిక వెల్లడించింది. 


ఇంట్లో తయారు చేసుకోవడమే మేలు..

నాణ్యతను తగ్గించకుండా బరువును మాత్రం తగ్గించడం ఊరటనిచ్చే విషయమే. కానీ దీనిని అడ్డుపెట్టుకుని కొన్ని రకాల గుర్తింపు లేని సంస్థలు నాసిరకం ఆహారం తయారుచేసే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుత కాలంలో తక్కువ ధరలకే దొరికే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. రుచి కోసం ఆరోగ్యంపై ప్రభావం చూపే కెమికల్స్‌ను వాడే ప్రమాదం లేకపోలేదు. రోడ్ల మీద అందుబాటులో ఉండే చిరుతిళ్లు, కర్రీస్‌ వంటివి ఇలానే ఉంటుంది. బయట ఆహారం కొనుగోలు చేసే సమయంలో ఇటువంటి విషయాలపై దృష్టి పెట్టాలి. కాబట్టి ప్రస్తుత రోజుల్లో కుటుంబానికి అందించే ప్రతి ఆహార పదార్ధం ఇంట్లోనే తయారుచేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

  

 మేల్కోనకపోతే ముప్పే

నిత్యావసరాలు పెరిగినపడు దానికి తగ్గట్టు ఆహారపదార్ధాల ధరలు పెరగకపోతే కూడా ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ ఎవరూ లాభాపేక్ష లేకుండా వ్యాపారాలు చేయరు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి సమయంలో మార్కెట్‌లో దొరికే స్నాక్స్‌లను కొనుగోలు చేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వస్తువు తయారీ, తుది గడువు వంటివి తప్పనిసరిగా చూసుకోవాలి. గుర్తింపబడిన సంస్థలకు సంబంధించి ఫుడ్‌ ప్యాకెట్లును వాడితేనే మంచిది. కొనుగోలు సమయంలో మోసపోయామని తెలియగానే వెంటనే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలి. కానీ బిల్లును మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. అన్ని ఆదారాలు ఉంటే కేవలం 15 రోజుల్లో సదరు కంపెనీ నుంచి పరిహారం పొందే అవకాశం ఉంటుంది. 

    - చదలవాడ హరిబాబు, వినియోగదారుల ఫోరం అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు 


ప్యాకింగ్‌పై వివరాలను చదవాలి..

ధరల పెరిగే సమయంలో కాలం చెల్లిన ప్యాకెట్లు విక్రయించే అవకాశం ఉంటుంది. వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ప్యాకింగ్‌పై వివరాలను తప్పనిసరిగా చదవాలి. వాస్తవానికి వినియోగదారునికి ప్రస్తుతం ఉన్నది గడ్డుకాలమే అని చెప్పాలి. మిగిలిన వస్తువుల గురించి అటుంచితే ఆహారపదార్ధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్నాక్స్‌ ప్యాకెట్లు వాటిపై ఉండే వివరాలు, కోడ్‌లు గురించి రానున్న రోజుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.

-  సయ్యద్‌ ఆదాం సాహెబ్‌, వినియోగదారుల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు.

 

Updated Date - 2022-05-22T04:58:56+05:30 IST