ఇంకెన్నాళ్లీ నిరీక్షణ..?

ABN , First Publish Date - 2021-06-23T06:23:21+05:30 IST

జిల్లాలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఆర్‌సీల జారీ ప్రక్రియ ఆగిపోయింది. ఆరు నెలలుగా ఆర్టీఓ కార్యాలయాల్లో ప్రింటింగ్‌ చేసేందుకు కార్డులు లేవు. దీంతో కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీలతోపాటు రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వందలాది మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇంకెన్నాళ్లీ నిరీక్షణ..?


 డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీలు ఎప్పుడిస్తారో...?

 కార్డు ప్రింటింగ్‌ మెటీరియల్‌   కొరతతో ఆరునెలలుగా  బంద్‌

వందలాది మంది వాహనదారులకు ఇబ్బందులు

పట్టించుకోని ఆర్టీఏ ఉన్నతాధికారులు


అనంతపురం వ్యవసాయం, జూన్‌ 22:  జిల్లాలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఆర్‌సీల జారీ ప్రక్రియ ఆగిపోయింది. ఆరు నెలలుగా ఆర్టీఓ కార్యాలయాల్లో ప్రింటింగ్‌ చేసేందుకు కార్డులు  లేవు. దీంతో కొత్త డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీలతోపాటు రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వందలాది మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదివరకు డీఎల్‌, ఆర్‌సీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లోగా వాహనదారుల అడ్ర్‌సకు పంపేవారు. కార్డుల ప్రింటింగ్‌కు అవసరమైన మెటీరియల్‌ కొరతతో ఆర్టీఏ అధికారులు చేతులెత్తేశారు.  ఎప్పటిలోగా కార్డులిస్తారో అధికారులే చెప్పలేకపోతుండడం గమనార్హం. తరచూ అనంతపురం, ఇతర ప్రాంతాల్లోని  ఆర్టీఏ కార్యాలయాలకు వాహనదారులు వెళ్లి.. అడిగినా సరైన సమాధానం లభించడం  లేదు. వాహనాలు నడిపే సమయంలో పోలీసులు, ఆర్టీఏ అధికారులు తనిఖీల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీలు తప్పనిసరిగా చూపించాలి. లేదంటే జరిమానా తప్పదు. అలాంటి ముఖ్యమైన కార్డుల జారీపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడం విమర్శలకు తావిస్తోంది. ప్రింటింగ్‌ చేసే మెటీరియల్‌ లేదన్న సాకుతో తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రింటింగ్‌ మెటీరియల్‌ తెప్పించడంపై శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఆరు నెలలకు ముందు ప్రింట్‌ తీసిన కార్డులను వాహనదారుల అడ్ర్‌సకు పంపడంపైనా ఆ విభాగ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పోలీసులు తనిఖీలు చేసే సమయంలో ద్విచక్ర, నాలుగుచక్రాల వాహనదారులు డీఎల్‌, ఆర్‌సీ కార్డులు చూపించలేకపోతున్నారు. కొందరు పోలీసులు వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా జరిమానాలు విధిస్తుండటంతో బాధిత వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీఏ ఉన్నతాధికారులు స్పందిం చి డీఎల్‌, ఆర్‌సీ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. మరి ఏ మేరకు స్పందిస్తారో వేచిచూడాల్సిందే.


Updated Date - 2021-06-23T06:23:21+05:30 IST