రేషన్‌ కోసం నిరీక్షణ!

ABN , First Publish Date - 2021-07-24T05:29:00+05:30 IST

పౌర సరఫరాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని అధికారులు చెబుతున్నా... ఆశించిన ఫలితం దక్కడం లేదు. రేషన్‌ సరుకుల కోసం లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొవిడ్‌ నేపథ్యంలో కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత బియ్యం పంపిణీ చేసింది.

రేషన్‌ కోసం నిరీక్షణ!
గరుగుబిల్లి మండలం కొత్తపల్లి డిపో వద్ద రేషన్‌ కోసం నిరీక్షిస్తున్న లబ్ధిదారులు


 డిపోల వద్ద లబ్ధిదారుల పడిగాపులు

నిత్యం సర్వర్‌ సమస్య

రోజుకు నాలుగు కార్డులకు మించి దక్కని రేషన్‌

(జియ్యమ్మవలస/గరుగుబిల్లి)

పౌర సరఫరాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని అధికారులు చెబుతున్నా... ఆశించిన ఫలితం దక్కడం లేదు. రేషన్‌ సరుకుల కోసం లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొవిడ్‌ నేపథ్యంలో కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత బియ్యం పంపిణీ చేసింది. జూలై నెలకు సంబంధించి మొదటి పక్షం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం బియ్యం పంపిణీని పూర్తిచేసింది. వాహనాల ద్వారా ఇంటింటా సరఫరా చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందించే బియ్యాన్ని మాత్రం నేరుగా డిపోల వద్దకే వెళ్లి తీసుకోవాలని సూచించారు. దీంతో డిపోల వద్దకు వెళ్తున్న లబ్ధిదారులకు చుక్కెదురవుతోంది. సర్వర్‌ సమస్య తలెత్తుతుండడంతో ఏం చేయాలో డీలర్లకు పాలుపోవడం లేదు. వాహనం వద్ద తీసుకున్నప్పుడు రాని సమస్య..ఇప్పుడెందుకు వస్తుందంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తుండడంతో వారి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా ఏ డిపో వద్ద చూసినా లబ్ధిదారులు పడిగాపులు కాయడం కనిపిస్తోంది. సాయంత్రం వరకూ వేచిచూస్తున్న లబ్ధిదారులు సర్వర్‌ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఉసూరుమంటూ అక్కడి నుంచి వెనుదిరుగుతున్నారు. 


జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో 6.90 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 20 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,400 రేషన్‌ డిపోలు ఉన్నాయి. ఏజెన్సీలో డీఆర్‌ డిపోలు 102 ఉన్నాయి. మొత్తం లబ్ధిదారులకు 10,250 టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ నెల 16 నుంచి రేషన్‌ పంపిణీ చేయనున్నట్టు తొలుత ప్రకటించారు. కానీ 20 నుంచి ప్రారంభించారు. ముందస్తుగా డిపోల్లో బియ్యం నిల్వ చేశారు.  రోజుకు నాలుగు కార్డులకు మాత్రమే రేషన్‌ అందించగలుగుతున్నారు. సిగ్నల్‌ సమస్యతో పాటు సర్వర్‌ డౌన్‌ అని వస్తుండడంతో డీలర్లు యంత్రాలతో కుస్తీలు పడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో డీఆర్‌ డిపోల ద్వారా 2.62 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్‌ అందించాల్సి ఉన్నా..నాలుగు రోజులు గడుస్తున్నా ప్రక్రియ సజావుగా సాగడం లేదు. దీనిపై డీఎస్‌వో పాపారావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. కేంద్ర ప్రభుత్వం అందించిన ఉచిత బియ్యం పంపిణీ 30 శాతం పూర్తయ్యిందన్నారు. సకాలంలో శతశాతం సరఫరాను పూర్తిచేస్తామని చెప్పారు. 

 




Updated Date - 2021-07-24T05:29:00+05:30 IST