ఎదురుచూపులే

ABN , First Publish Date - 2022-10-01T04:51:53+05:30 IST

వీఆర్‌ఏలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీస్‌ రూల్స్‌ అమలు చేస్తూ పేస్కేల్‌ ఇస్తామని ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలవుతాయని వీఆర్‌ఏలు సైతం ఎదురుచూశారు. కానీ తీవ్ర జాప్యం కావడంతో ఆందోళన బాట పట్టక తప్పలేదు. మూడు నెలల నుంచి విధులకు దూరంగా ఉంటూ సమ్మె చేస్తున్నారు. గడిచిన 69 రోజులుగా నిరాహారదీక్షలు నిర్వహిస్తూ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.

ఎదురుచూపులే
సిద్దిపేట అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏల నిరాహారదీక్ష

సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వీఆర్‌ఏల సమ్మె... 69వ రోజుకు చేరిన దీక్షలు

మూడునెలలుగా అందని వేతనాలు

సమ్మెతో రెవెన్యూ కార్యకలాపాలకు ఆటంకం

కార్యాలయాల్లో కుప్పలుగా పేరుకుపోతున్న ఫైళ్లు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, సెప్టెంబరు 30 : సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సమ్మెబాట పట్టిన వీఆర్‌ఏలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట 69 రోజులుగా నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నారు. విధులకు గైర్హాజరవుతూ తమ పోరాటం కొనసాగిస్తున్నందున గడిచిన మూడు నెలల వారికి నుంచి వేతనాలు అందలేదు. రెండ్రోజుల్లో సద్దుల బతుకమ్మ, దసరా పర్వదినాలు ఉండడంతో తమను పస్తులు ఉంచడం సమంజసం కాదని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. 


సర్వీస్‌ రూల్స్‌ అమలు, పేస్కేల్‌ కోసం..

జిల్లాలో 1,084 మంది విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లు  (వీఆర్‌ఏ) ఉన్నారు. వీరిలో వారసత్వంగా ఉద్యోగాలు నిర్వహించేవారితోపాటు రాతపరీక్ష ద్వారా ఉద్యోగం పొందినవారు కూడా ఉన్నారు. గ్రామాల్లో అత్యంత కీలకమైన ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వీఆర్‌ఏలకు ప్రతీనెల రూ.10,500 వేతనం ఇస్తున్నారు. పనికి తగిన వేతనం రావడం లేదని పలుమార్లు విన్నపాలు చేయడంతో గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ స్పందించారు. వీఆర్‌ఏలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీస్‌ రూల్స్‌ అమలు చేస్తూ పేస్కేల్‌ ఇస్తామని ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలవుతాయని వీఆర్‌ఏలు సైతం ఎదురుచూశారు. కానీ తీవ్ర జాప్యం కావడంతో ఆందోళన బాట పట్టక తప్పలేదు. మూడు నెలల నుంచి విధులకు దూరంగా ఉంటూ సమ్మె చేస్తున్నారు. గడిచిన 69 రోజులుగా నిరాహారదీక్షలు నిర్వహిస్తూ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమతోపాటు రిక్రూట్‌ అయిన వీఆర్‌ఏలు ఏపీలో జూనియర్‌ అసిస్టెంట్లుగా, ఆర్‌ఐలుగా పనిచేస్తున్నారని  చెబుతున్నారు. తమకు కూడా పదోన్నతులు కల్పిస్తే అదే స్థాయిలో ఉండేవారమని అంటున్నారు. 


రెవెన్యూ సేవలకు ఇబ్బందులు

సిద్దిపేట అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కులం, ఆదాయం, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, జననమరణ ధ్రువీకరణ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్ల కోసం సుమారు 600కుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ కూడా వీఆర్‌ఏలు లేకపోవడంతో పేరుకుపోయాయి. అత్యవసరమైన వాటిని ఉన్న సిబ్బందితో పూర్తి చేయిస్తున్నారు. వీఆర్‌ఏలు క్షేత్రస్థాయి విచారణ చేస్తేనే ఈ సర్టిఫికెట్లకు అధికారులు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. కాగా సిద్దిపేట అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న పరిస్థితే ఇంచుమించు జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో కనిపిస్తున్నది. గ్రామాల్లో అధికారుల ప్రొటోకాల్‌ వీరే చూసుకుంటారు. జీవో 59 క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. గ్రామాల్లో చనిపోయిన వ్యక్తుల సమాచారం వీఆర్‌ఏల ద్వారానే తెలియాల్సి ఉంటుంది. అన్నింటికి మించి వీఆర్‌ఏల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వభూములు ఎడాపెడా కబ్జాకు గురవుతున్నాయి. కలెక్టరేట్‌, కలెక్టర్‌ క్యాంప్‌ ఆఫీస్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలకు నైట్‌ వాచ్‌మెన్లుగా వీరే విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం సమ్మెలో ఉండడంతో ఉన్నతాధికారుల ఇళ్లకు, రెవెన్యూ కార్యాలయాలకు రక్షణ సమస్య నెలకొన్నది.


మాది ధర్మపోరాటం

అసెంబ్లీ సాక్షిగా వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేస్తామని, పేస్కేల్‌ అందిస్తామని సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇప్పటికే చాలా జాప్యమైంది. అందుకే విధులు బహిష్కరించి మేము న్యాయబద్ధమైన ధర్మపోరాటాన్ని కొనసాగిస్తున్నాం. మానవత్వంతో మా సమస్యను పరిష్కరించాలి.

- ఐరేని రవీందర్‌, వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు

 

పదోన్నతులు కల్పించాలి

విద్యార్హత ఉన్నవారికి పదోన్నతులు కల్పించాలి. అటెండర్‌ నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టుల్లో అవకాశం ఇవ్వాలి. సమ్మెకాలంలో చనిపోయిన వీఆర్‌ఏల కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు ఉద్యోగ భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి. మాకు మూడునెలల వేతనాలు చెల్లించాలి.

- ముద్దం శ్రీనివాసరెడ్డి, వీఆర్‌ఏ


తీపికబురు చెప్పాలి

తెలంగాణకు పెద్ద పండుగలుగా భావించే బతుకమ్మ, దసరా సందర్భంగానైనా మాకు తీపికబురు అందించాలి. లేకుంటే మా కుటుంబాలకు పండుగ సంతోషం ఉండదు. మాలాంటి చిన్న ఉద్యోగులపై ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఆలోచించాలి. చాలీచాలని వేతనాలు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నాం.

- మద్దెల రవి, వీఆర్‌ఏ


Updated Date - 2022-10-01T04:51:53+05:30 IST