వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలా నడిస్తే మంచిది?

ABN , First Publish Date - 2022-04-07T18:02:42+05:30 IST

క్రమం తప్పని నడక మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతుందనేది పలు పరిశోధనల సారాంశం. రోజూ నడిస్తే... ఊబకాయం నుంచి ఒత్తిడి వరకు ఎన్నో రకాల రుగ్మతల నుంచి

వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎలా నడిస్తే మంచిది?

ఆంధ్రజ్యోతి(07-04-2022)

క్రమం తప్పని నడక మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతుందనేది పలు పరిశోధనల సారాంశం. రోజూ నడిస్తే... ఊబకాయం నుంచి ఒత్తిడి వరకు ఎన్నో రకాల రుగ్మతల నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా గంటల తరబడి కుర్చీల్లో కూర్చొని పనిచేసేవారు... కనీసం ఓ అరగంటైనా వాకింగ్‌కి కేటాయిస్తే ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఆ ప్రయోజనాలేంటి? అసలు ఎలా నడిస్తే మంచిది? మీ కోసం...


ప్రయోజనాలు

గుండెకు మేలు: హృదయ సంబంధిత సమస్యలు ఇటీవల అధికమయ్యాయి. మన గుండెను పదిలంగా కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇస్తేనే ఈ సమస్యలకు దూరంగా ఉండగలం. దానికి చక్కని మార్గం నడక. రోజూ నడవడం వల్ల హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గుతుందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు... మెరుగైన ఆరోగ్యంతో ఆయుష్షు కూడా పెరుగుతుంది. 

మానసిక ఆరోగ్యం: సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు! అయితే దాని కోసం మన మీద మనం... శారీరకంగా, మానసికంగా శ్రద్ధ పెట్టాలి. నడకను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి, యాంగ్జైటీలకు దూరంగా ఉంచుతుంది. 

ఊబకాయం: మధుమేహం, హృదయ సంబంధ సమస్యలు, కేన్సర్‌ వంటి అనేక దీర్ఘకాల వ్యాధులకు మూలం ఊబకాయం. వాకింగ్‌తో ఊబకాయానికి చెక్‌ పెట్టవచ్చని పలు పరిశోధనల్లో తేలింది. అధిక బరువు సమస్యకు కూడా నడక చక్కని పరిష్కారం. 

‘నీట్‌’ పెంచండి: ‘నాన్‌ ఎక్సర్‌సైజ్‌ యాక్టివిటీ ధర్మోజెనెసిస్‌’ (నీట్‌)... అంటే వ్యాయామం ఒక్కటే కాకుండా ఇల్లు శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పెట్టడం లాంటి ఇంటి పనులు చేస్తుండాలి. టీవీల ముందు, ఆఫీసుల్లో ఎప్పుడూ కుర్చీలకే అతుక్కుపోకుండా... కాసేపు లేచి అటూ ఇటూ నడవడం వంటివన్నీ ‘నీట్‌’ కిందకే వస్తాయి. అంటే ప్రతిరోజూ కనీస శారీరక శ్రమ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలుసుకోవాలి. 

ఇలా నడవాలి: వాకింగ్‌ అనగానే పార్క్‌కు వెళ్లి అలా కాలక్షేపంగా నడిచి వచ్చేస్తే సరిపోదు. దానికీ ఒక పద్ధతి ఉంది. నడక ప్రధానంగా మూడు రకాలు. మొదటిది ‘స్ర్టాల్‌’. అంటే దాదాపు విండో షాపింగ్‌ చేసినట్టు ఉంటుందనమాట! రెండోది ‘బ్రిస్క్‌ వాక్‌’. ఇది కూడా సాధారణ నడకలానే. ఆఖరిది ‘పవర్‌ వాక్‌’. ముందుగా ‘స్ర్టాల్‌’తో వార్మప్‌ చేసి... తరువాత ‘బ్రిస్క్‌ వాక్‌’లోకి వెళ్లాలి. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ‘పవర్‌ వాక్‌’ పేస్‌ను అందుకోవాలి. దానివల్ల మీ హార్ట్‌ రేట్‌ పెరుగుతుంది. ‘పవర్‌ వాక్‌’ ఎంతసేపు చేయగలరో గమనించండి. క్రమంగా ఆ సమయాన్ని పెంచుకొంటూ వెళ్లండి. ఏకధాటిగా నడవకుండా మధ్య మధ్యలో కొంత విరామం ఇవ్వండి. నిదానంగా అరగంటకు సుమారు రెండున్నర కిలోమీటర్లు, గంటకు ఐదు కిలోమీటర్లు నడిచేలా లక్ష్యాన్ని నిర్దేశించుకొని నడక ప్రారంభించండి.

Updated Date - 2022-04-07T18:02:42+05:30 IST