విమోచన చరిత్ర పథాలలో పాదయాత్రలు

ABN , First Publish Date - 2022-09-16T06:19:11+05:30 IST

మతోన్మాద నిజాం నిరంకుశ పాలనపై హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 వరకు జరిపిన వీరోచిత పోరాటమే తెలంగాణ విమోచన ఉద్యమం...

విమోచన చరిత్ర పథాలలో పాదయాత్రలు

మతోన్మాద నిజాం నిరంకుశ పాలనపై హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 వరకు జరిపిన వీరోచిత పోరాటమే తెలంగాణ విమోచన ఉద్యమం. ఓ వైపు యావత్‌ భారతదేశం స్వాతంత్య్ర సంబురాలు చేసుకుంటుండగా నిజాం ఏలుబడిలో ఉన్న పల్లెల్లో రజాకార్ల ఆగడాలు పెచ్చుమీరాయి. ప్రజలంతా ఒక్కటై నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్లను సవాలు చేశారు. ఉవ్వెత్తున ఎగసిన ప్రజాపోరాటాలకు తోడుగా, నాటి భారత ఉపప్రధాని సర్దార్‌ పటేల్‌ చొరవతో సెప్టెంబర్‌ 17, 1948న నిజాం పాలన నుంచి విమోచన పొందిన హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో భాగం అయింది. ఎన్నో వీరోచిత గాథలకు నెలవైన తెలంగాణ ఉద్యమ చరిత్ర, వీరుల పోరాటాలు ఉద్దేశపూర్వకంగా పాఠ్యగ్రంథాల్లో మరుగుపరిచారు. తెలంగాణ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ విమోచన ఉద్యమ చరిత్రను, వీరుల గాథలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఏకకాలంలో నాలుగు పాదయాత్రలను నిర్వహిస్తున్నది. తెలంగాణ విమోచన ఉద్యమంలో లక్షల మందిలో స్ఫూర్తిని నింపి, జలియన్‌వాలాబాగ్‌తో సమానమైన సంఘటనలు జరిగిన నాలుగు ప్రాంతాలలో సెప్టెంబర్‌ 17 నాటికి చేరుకునేలా నాలుగు పాదయాత్రలు జరుగుతాయి. నిర్మల్‌ జిల్లాలోని వెయ్యి ఉరులమర్రి, వరంగల్‌ జిల్లాలోని పరకాల, పాలమూరు జిల్లాలోని అప్పంపల్లి,  సిద్దిపేట జిల్లాలోని వీర భైరాన్‌పల్లిలలో ముగిసే విధంగా ఈ నాలుగు పాదయాత్రలు ఉంటాయి. ఈ నాలుగు పాదయాత్రలు ఈ నాలుగు ప్రాంతాలకు 75 కిలోమీటర్ల దూరం నుంచి సెప్టెంబర్‌ 12న ప్రారంభమై, సెప్టెంబర్‌ 17న జరిగే తెలంగాణ స్వాతంత్య్ర అమృతోత్సవాల ప్రారంభంనాడు ముగుస్తాయి.


నిర్మల్‌ కేంద్రంగా 1836 నుంచి 1860 వరకు రాంజీ గోండ్‌ నేతృత్వంలో బ్రిటిష్‌, నిజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం సాగింది. ఏప్రిల్‌ 8, 1860న రాంజీగోండ్‌ తన అనుచరులతో నిర్మల్‌కు సమీపంలో ఉన్నట్లు రహస్య సమాచారం అందుకున్న నిజాం పోలీసు బలగాలతో పాటు బ్రిటీష్‌ సైన్యం ఆ ప్రాంతాన్ని ముట్టడించింది. సోన్‌ ప్రాంతంలో రాంజీగోండ్‌ వారికి బందీగా చిక్కారు. రాంజీతో పాటు పట్టుబడ్డ అతని అనుచరులు వెయ్యిమందిని ఆ మర్రిచెట్టు ఊడలకు ఉరితీశారు. అలాగే ప్రథమ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకున్నారనే కారణంగా వరంగల్‌ జిల్లాలోని పరకాలలో 1947 సెప్టెంబర్‌ 2న నిజాం సైన్యం, రజాకార్లు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 22 మంది మరణించారు. అయినా నిజాం సేనలు, రజాకార్లపై పోరుసాగించిన పరకాల స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది. తెలంగాణ విమోచన ఉద్యమంలో స్ఫూర్తి నింపిన మరో గ్రామం పాలమూరు జిల్లాలోని అప్పంపల్లి. 1947 అక్టోబర్‌ 7న ఆత్మకూరు, అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో తెలంగాణను భారతదేశంలో విలీనం చేయాలంటూ నిజాం పాలనకు వ్యతిరేకంగా బెల్లం నాగన్న నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైంది. అప్పంపల్లి పరిసర గ్రామాలకు చెందిన రెండువేల ఉద్యమకారులు తెలంగాణ విమోచన కోసం సత్యాగ్రహం చేశారు. ఆ సాయంత్రం ఉద్యమకారులపై కాల్పులు జరపడంతో చాకలి కుర్మన్నతో పాటు 11 మంది ఉద్యమకారులు మరణించారు. ఇదే రీతిలో తెలంగాణ ప్రజల్లో నిజాం వ్యతిరేక పోరాట చైతన్యం రగిలించిన మరో గ్రామం  సిద్దిపేట జిల్లాలోని భైరాన్‌పల్లి. 1948 ఆగస్టు 27న సాయుధ నిజాం సైనికులు, రజాకార్లు భైరాన్‌పల్లి మీద దాడి చేశారు. నిరాయుధులైన 118 మంది గ్రామప్రజలను వరుసలో నిలబెట్టి కాల్చి చంపారు. మహిళలను వివస్త్రలుగా చేసి ఆ శవాల చుట్టూ బతుకమ్మలను ఆడించారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయం.

రూపురెడ్డి విష్ణువర్ధన్‌

(అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌)

Updated Date - 2022-09-16T06:19:11+05:30 IST