ltrScrptTheme3

పంచాయతీ రోడ్డుకు.. అడ్డుగా గోడ!

Oct 26 2021 @ 23:03PM
రోడ్డుకు అడ్డుగా గోడ కడుతున్న కూలీలు

నివాసం లేకున్నా పంతం పట్టి రాజకీయ కారణాలతో రోడ్డు మూసివేత

రెవెన్యూ సర్వేయర్‌కు దరఖాస్తు చేయకుండానే సొంత కొలతలు

14 ఏళ్లనాడు వేసిన రోడ్డుపై ఇప్పుడు అభ్యంతరం

ఇద్దరు కానిస్టేబుళ్లు దగ్గరుండి మరీ నిర్మాణం చేయించి..

సివిల్‌ వ్యవహారంలో అత్యుత్సాహం!


తెనాలి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిధులతో 2007లో వేసిన పంచాయతీ సిమెంటు రోడ్డది. రోడ్డు వేసేటప్పుడు కానీ, వేసిన 14 ఏళ్లలో ఏరోజూ అభ్యంతరం చెప్పని వ్యక్తి అకస్మాత్తుగా తెరపైకొచ్చి ఈ రోడ్డు తనదేనంటూ అడ్డుగా గోడ కట్టేశాడు. దీనివెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయనేది కొద్దిసేపు పక్కనపెడితే, తన స్థలంలో పంచాయతీనే రోడ్డు వేసిందని కోర్టుకు వెళ్లి ఇన్నేళ్లుగా న్యాయపోరాటం చేయటం కానీ, తన ఇంటి హద్దులు నిర్ణయించండంటూ రెవెన్యూ సర్వేయర్‌కు ప్రభుత్వం నిర్ణయించిన సర్వే రుసుము చెల్లించి దరఖాస్తు చేయటం కానీ చేయకుండానే కేవలం ప్రైవేటు కొలతలతో తమదేనని హద్దులు నిర్ణయించి గోడ కట్టేశారనేది స్థానికుల ఆరోపణ. పంచాయతీ రోడ్డుపై అడ్డుగా గోడకడుతుంటే  అదేమని నిలదీసిన స్థానికులను అడ్డుకునేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు రంగంలోకి దిగి దగ్గరుండి మరీ రోడ్డుపై గోడకట్టించి వెళ్లటం కొసమెరుపు. ప్రభుత్వ అధికారులయిఉండి, ప్రజాధనంతో వేసిన రోడ్డు విషయంలో పంచాయతీకి సహకరించాల్సిన సిబ్బంది ప్రైవేటు వ్యక్తికి అండగా నిలవటం ఇక్కడ విమర్శలకు తావిచ్చింది. కేవలం సివిల్‌ వ్యవహారం అని తెలిసికూడా ఏ కోర్టు ఉత్తర్వులు కానీ, మరే ఇతర ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండానే మౌఖిక ఆదేశాలతో స్థానికులను కూడా అటువైపునకు రానివ్వకుండా రక్షణగా నిలవటం విమర్శలకు కారణమయింది.

వివరాల్లోకి వెళితే... తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో తేలప్రోలు రోడ్డు నుంచి గ్రామంలోకి వచ్చే పంచాయతీ రోడ్డు వెంటున్న నివాసాలకు సంబంధించి హద్దుల విషయంలో వివాదం నెలకొంది. గతంలో ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారంతా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటుంటే, తెనాలిలో నివాసం ఉండే వ్యక్తి తన స్థలంలో ఏ నిర్మాణం లేకుండా ఇన్నేళ్లుగా ఖాళీగానే వదిలేశారు. అయితే 2007లో ఈ రోడ్డు వెంట నివాసం ఉంటున్న వారంతా అభ్యర్థించటంతో అధికారులు సిమెంటు రోడ్డుకు నిధులు మంజూరుచేసి, నిర్మాణం పూర్తిచేశారని, అంతా మా అంగీకారంతోనే జరిగిందని స్థానికులు చెబుతున్నారు.  నిర్మాణం జరుగుతున్న సమయంలో కానీ, తర్వాత ఈ 14 ఏళ్లలో ఏ అభ్యంతరం చెప్పని వ్యక్తి, తాజాగా తెరపైకొచ్చి తన స్థలంలోనే రోడ్డు నిర్మాణం చేపట్టారని, రోడ్డు తనదేనంటూ హడావిడి చేయటం, గోడ నిర్మించేందుకు ఉపక్రమించటంతో మిగిలిన కుటుంబాల వారంతా పంచాయతీ కార్యదర్శి, డీఎల్‌పీవో, జేసీ కి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చేలోపే ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవటంతో మరింత ముదిరి పాకాన పడింది. 

అయితే సోమవారం ఆ స్థల యజమాని ప్రైవేటు సర్వేయర్‌తో కొలతలు కొలిపించి తనకు రోడ్డు పైవరకు హక్కు ఉందంటూ గోడ కట్టేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు అడ్డుచెప్పటంతో తాను స్పందనలో దరఖాస్తు చేసుకున్నానని, సచివాలయ సర్వేయర్‌ వచ్చి కొలత కొలిసి తన స్థలం హద్దులు రోడ్డుపైవరకు ఉన్నాయని నిర్ణయించి వెళ్లారని, అందుకే గోడ కడుతున్నానంటూ వారికి చెప్పటం, స్థానికులు పంచాయతీ కార్యదర్శికి విన్నవించటంతో ఆ వ్యక్తి నిర్మాణం ఆపేసి వెళ్లిపోయారు. మంగళవారం తిరిగి ప్రారంభించటం, స్థానికులు అదేమని అడిగేందుకు అక్కడికి చేరుకునేలోపే ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రత్యక్షం అయ్యారు. పోలీసులు, స్థానికులకు మధ్య కొద్దిసేపు వాదనలు జరిగాయి. ఏ ఆధారాలతో పంచాయతీ రడ్డుపై గోడ కట్టనిస్తున్నారని స్థానికులు వారిని నిలదీయటంతో తమను ఉన్నతాధికారులు పంపారని, ఏమున్నాయనేది మాకనవసరమని, మీరు కొలతలు కొలిపించుకుంటే అతని హద్దులు రోడ్డుపై వరకు లేవని నిరూపిస్తే గోడను మేమే పగలగొట్టిస్తామంటూ భరోసా ఇవ్వటం కొసమెరుపు. ఎక్కడైనా పోలీసు సిబ్బంది ప్రభుత్వ ఆస్థుల విషయంలో ప్రైవేటు వ్యక్తులు ప్రవేసిస్తే వారి ఆధారాలు చూపించేవరకు నిర్మాణాలు చేయటానికి వీలులేదంటూ అడ్డు చెప్పాల్సిందిపోయి, సివిల్‌ వ్యవహారంలో అతనికి మీరు అండగా ఎట్లా నిలుస్తారని స్థానికులు నిలదీసినా.. వారిద్దరు దగ్గరుండి రోడ్డుపైవరకు గోడ నిర్మాణం పూర్తయ్యేవరకు ఉండి, అంతా అయ్యాక వెళ్లటం విమర్శలకు కారణమయింది. సాధారణంగా సివిల్‌ వ్యవహారాల్లో తహసీల్దారుకు అర్జీ పెట్టుకోవటం, వారిదగ్గర కూడా న్యాయం జరగకుంటే ప్రైవేటు వ్యక్తులు కోర్టును ఆశ్రయించటం పరిపాటి. కానీ ఇక్కడ కేవలం స్పందన కార్యక్రమంలో అర్జీ పెట్టానని, వెంటనే సచివాలయ సర్వేయర్‌ వచ్చి కొలతలు కొలిసి హద్దులు నిర్ణయించారని చెప్పటం మినహా, ఎక్కడా కాగితం రూపంలో లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు కోర్టు ఉత్తర్వులుండి ఎవరైనా బాధితులు తన హక్కుకు రక్షణ కల్పించాలని ప్రాధేయపడినా పట్టించుకోని పరిస్థితుల్లో, ఏ ఆధారం లేకుండానే సివిల్‌ వ్యవహారంలో పోలీసులు రంగంలోకి దిగటం, అందులోనూ పంచాయతీ రోడ్డు విషయంలో ప్రైవేటు వ్యక్తికి వంత పలకటం మరింత అనుమానాలకు కారణమవుతోంది. 

అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులను వెళ్లిపోవాలని చెబుతున్న కానిస్టేబుల్‌

సాధారణంగా గ్రామాల్లోని స్థలాల హద్దుల విషయంలో అప్పటి లేఔట్‌లు ఆధారంగా కొలతలు నిర్ణయిస్తారు. అయితే ఈ స్థలంలోని ఇళ్లకు ఏ లేఔట్‌ లేకపోవటం, పంచాయతీ రికార్డుల్లో ఆధారాలేమి లేకుండా సచివాలయ సర్వేయర్‌ ఎట్లా కొలతలు నిర్ణయించారనేది అంతుపట్టని ప్రశ్న. స్థల వివాదం ఉన్నప్పుడు డాక్యుమెంట్‌ల ఆధారంగా కాకుండా, అన్ని స్థలాల హద్దులు కొలిస్తేకానీ తేలని వ్యవహారాన్ని, అతని స్థలం వరకే కొలతలు వేయటం కూడా సందేహాలకు తావిస్తోంది.

దీనిపై రూరల్‌ సీఐ సుబ్రహ్మణ్యంను వివరణ కోరితే సర్వేయర్‌ కొలత కొలిచి రోడ్డుపై వరకు అతనికే హక్కు ఉందని తేల్చారని, నిర్మాణం చేస్తుంటే స్థానికులు దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్తుడు ఆశ్రయించటంతో సిబ్బందిని పంపామన్నారు. హద్దుల వ్యవహారాన్ని వారినే తేల్చుకోమని స్పష్టం చేశామని, సివిల్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని సూచించామని వివరించారు. పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో లేరు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.