వామ్మో.. రోడ్లు!

ABN , First Publish Date - 2022-06-20T08:57:25+05:30 IST

వామ్మో.. రోడ్లు!

వామ్మో.. రోడ్లు!

సత్యసాయి జిల్లా కదిరి నుంచి ఓడీసీకి వెళ్లే ప్రధాన రహదారిలో మిట్టపల్లి వద్ద సోమావతి నదిపై శిథిలావస్థకు 

చేరిన వంతెన. 


రోడ్డంతా.. నీరే!

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచి దారుణంగా తయారయ్యాయి. విజయవాడలో ఏలూరు రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు దయనీయంగా ఉన్నాయి. రెండు జిల్లాల్లోని 13 రోడ్లను ఎన్‌డీబీ స్కీమ్‌ కింద అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచారు. రెండు రోడ్ల పనులు మొదలు పెట్టి వదిలేశారు. మిగిలిన రోడ్లన్నీ విస్తరణ పేరుతో గోతులను కూడా పూడ్చలేదు. వర్షపు నీటితో బురదగా మారిన పెదపులిపాక చినకరకట్ట-తాడిగడప డొంక రోడ్డును చిత్రంలో చూడొచ్చు.


విజయనగరం... రోడ్లపై నరకం

విజయనగరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వర్షాకాలం కావడంతో గోతుల్లో వాహనాలు దిగబడి.. జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన మార్కెట్‌కు వెళ్లే రామానాయుడు రోడ్డులో కల్వర్టు నిర్మాణం కోసం పెద్ద గొయ్యి తవ్వారు. దీంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. కలెక్టరేట్‌ నుంచి గంట్యాడ-ఎస్‌.కోట వెళ్లే రోడ్డుపై ఎక్కడికక్కడే గోతులు ఏర్పడ్డాయి. మయూరి కూడలి వద్ద గోతులను చిత్రంలో చూడొచ్చు. 


ఆ 9 కిలోమీటర్లు..!

పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం- తాడేపల్లిగూడెం రోడ్డులో గొల్లలకోడేరు నుంచి యండగండి వరకు 9 కిలోమీటర్ల రోడ్డు గోతులమయంగా మారింది. చిన్నపాటి వర్షం వస్తే రోడ్డుపై అంతా నీరే కనిపిస్తోంది. ఈ రోడ్డులో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. 


జూన్‌లోగా రాష్ట్రంలోని రోడ్లన్నీ బాగు చేస్తామన్నారు. అక్కడక్కడ పనులు చేపట్టినా అవీ అసంపూర్తిగా ఉండటం.. వర్షాకాలం వచ్చేయడంతో రోడ్ల దుస్థితి మరింత అధ్వానంగా తయారయ్యింది. కొన్నిచోట్ల అసలు పనులే చేపట్టలేదు. ఇంకొన్నిచోట్ల ప్రభుత్వం డబ్బులిస్తుందో లేదోనన్న అనుమానంతో కాంట్రాక్టర్లు టెండర్లే వేయడం లేదు. పెట్రోలుపై రోడ్ల సెస్‌ బాదుతున్నా.. రోడ్లపై గోతులు.. వాటిలో నీరు.. బురద.. ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు.


బాబోయ్‌...ఇది రోడ్డేనా!?

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో మైదాన ప్రాంతం నుంచి మన్యానికి వెళ్లే వడ్డాది-పాడేరు రోడ్డు అధ్వానంగా తయారయ్యింది. ఎం.కోటపాడు, ఎంకే వల్లాపురం, ఎం.కోడూరు గ్రామాల్లో రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడి, నీటి కుంటలను తలపిస్తున్నాయి.


అంతర్రాష్ట్ర రోడ్లూ అధ్వానం

అన్నమయ్య జిల్లాలో బి.కొత్తకోట నుంచి కర్ణాటకకు వెళ్లే ప్రధాన రహదారి కంబాళ్లపల్లె సమీపంలో గుంతలతో ప్రమాదకరంగా ఉంది. మదనపల్లె నుంచి తిరుపతి వెళ్లే మార్గంలో మదనపల్లె దేవతానగర్‌ సమీపంలో పెద్ద గుంతలు ఉన్నాయి.


ఈ రోడ్డుపై వెళ్లేదెలా..?

ఇది తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్లు నుంచి తిరుపతి జిల్లా ఏర్పేడు వరకూ ఉన్న 568 జాతీయ రహదారి. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి ప్రకాశం జిల్లా మల్లాపాలెం వరకూ ఈ రోడ్డు అధ్వానంగా ఉంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై ప్రయాణం నరకం చూపిస్తోంది. మాచర్ల నుంచి మల్లాపాలెం వరకూ సింగిల్‌ రోడ్డు కావడంతో పెద్ద వాహనాలు వచ్చినప్పుడు మార్జిన్లు దిగలేని పరిస్థితి. మల్లాపాలెం నుంచి మురికిమల్లపెంట వరకు రోడ్డు మరీ దారుణంగా తయారైంది.


ఏ రోడ్డు చూసినా.. గోతులే!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. జాతీయ రహదారులు మినహాయిస్తే... రాష్ట్ర రహదారులన్నీ దారుణంగా ఉన్నాయి. రోడ్ల మరమ్మతులకు  రూ.36 కోట్లు మంజూరు చేసి, టెండర్లు పిలిచినా.. పనులు చేసేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. తాడిమర్రి మండలం నుంచి పులివెందులకు వెళ్లే రోడ్డుపై కంకర తేలి పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. 


తిరుపతి జిల్లాలో ప్రధాన రహదారులు దారుణంగా ఉన్నాయి. ఇటీవల అక్కడక్కడ పనులు చేపట్టినా ఇంకా చాలా రోడ్లు గోతులతోనే ఉన్నాయి. చంద్రగిరి-తిరుపతి రోడ్డులో ముక్కోటి సమీపాన స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి భారీ వర్షాలకు దెబ్బతింది. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సేఫ్టీ దిమ్మెలు కూలిపోయాయి. దీంతో ప్రయాణం ప్రమాదకరంగా ఉంది.





Updated Date - 2022-06-20T08:57:25+05:30 IST