చెక్‌..పోస్టు కావాలా? నాయనా?

ABN , First Publish Date - 2022-07-03T08:11:08+05:30 IST

చెక్‌..పోస్టు కావాలా? నాయనా?

చెక్‌..పోస్టు కావాలా? నాయనా?

అయితే బదిలీకి ఎంతిస్తావ్‌?

ఎంవీఐలకు ఓ మంత్రి పేరుతో ఫోన్‌ చేసి ఆఫర్లు

రెండు చేతులా దండుకునే పోస్టుకు సూట్‌కేసు

ఒక చేత్తో కలెక్షన్‌ రాబట్టుకోవాలంటే క్యారీబ్యాగ్‌

ఆదాయాన్ని బట్టి బేరమాడుతున్న అనుయాయులు

బదిలీ గడువు ముగిశాక అనుకూల అంశాలతో జీవో

సీఎం విదేశాల్లో ఉండగా చక్రం తిప్పిన అమాత్యుడు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘చెక్‌ పోస్టు కావాలా? సింగిల్‌ పాయింట్‌కు వెళతావా? అయితే ఎంతిస్తావ్‌?’ అంటూ బ్రేక్‌ ఇన్స్‌పెక్టర్లకు ఒక మంత్రి పేరుతో ఆఫర్లు వస్తున్నాయి. రెండు చేతులా ఆదాయం ఉండే చోట పోస్టింగ్‌ కావాలంటే సూట్‌ కేసు, ఒక చేత్తో కలెక్షన్‌ కోసమైతే క్యారీ బ్యాగ్‌, మూడో స్థానానికి చెందిన చోటైతే నోట్ల కట్టలు ఇవ్వాల్సి వస్తోంది. రవాణా శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు వ్యక్తులు ఒక అమాత్యుడి పేరు చెప్పి నేరుగా ఫోన్లు చేస్తుండటంతో ఎంవీఐల్లో చర్చ మొదలైంది. పాతిక, ముప్పై లక్షల రూపాయలు పెట్టి పోస్టింగ్‌ తెచ్చుకున్నా రేపు కలెక్షన్‌ ఆ స్థాయిలో చేయడం సాధ్యమయ్యే పనేనా.. అంటూ కొందరు వెనక్కి తగ్గితే.. మరికొందరు ఎంత పెట్టడానికైనా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రవాణాశాఖ కమిషనర్‌నే బదిలీ చేయించిన ఉద్యోగుల బదిలీ వ్యవహారం ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత ప్రక్రియ ప్రారంభం కావడం ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ చర్చనీయాంశమైంది. కనీసం వెయ్యి మంది కూడా లేని రవాణాశాఖలో 430 మంది బదిలీల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే పది పాయింట్లతో కూడిన నిబంధనలు పెట్టిన గత కమిషనర్‌ అందులో ఫోకల్‌, నాన్‌ ఫోకల్‌ అనే ఆప్షన్లు పెట్టారు. వాటికి తోడు పనితీరు బాగలేకపోతే ఎప్పుడైనా బదిలీ చేసే అధికారం కమిషనర్‌కు ఉంటుందని మరో పాయింట్‌ చేర్చారు. దీనిపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన తగ్గక పోవడంతో మంత్రి పినిపే విశ్వరూప్‌ వద్దకెళ్లారు. ఆయన ఏమి భరోసా ఇచ్చారో తెలీదుగానీ, కౌన్సెలింగ్‌కు వెళ్లకుండా ఆగిపోయారు. దీంతో జూన్‌ 17న, మరోసారి 27న వాయిదా పడ్డ కౌన్సెలింగ్‌ చివరిగా 29కి ఖరారైంది. అదే రోజు కమిషనర్‌ బదిలీ అవుతారని ముందే తెలియడంతో ఆ రోజు కూడా ఆగిపోయింది. అప్పటికే కమిషనర్‌ ఆ పది పాయింట్లకు అనుగుణంగా కొంతమేర కదలిక తీసుకొచ్చి గడువు చివరిరోజు వాటికి అనుగుణంగా ట్రాన్స్‌ఫర్లు చేయాలని నిర్ణయించారు. జూన్‌ 30న మొత్తం వ్యవహారాన్ని అనుకూలంగా మార్చేసుకుని జూలై 1న కొత్త మార్గదర్శకాలతో రవాణా శాఖ జీవో విడుదల చేసింది. నిజానికి, గడువు తీరిన తర్వాత నిషేధ కాలం అమల్లోకి వస్తుందని.. అలాంటప్పుడు బదిలీలు ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తింది. అయితే, ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించి ఒక మంత్రి ఈ జీవో తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి విదేశాల నుంచి తిరిగొచ్చాక, ఆయన అనుమతించకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటూ ఫోన్లు చేసిన వారికి ముందుగా అడ్వాన్సులు ఇచ్చేందుకు ఎంవీఐలు జంకుతున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా, రవాణాశాఖలో బదిలీల వివాదం, అనుకూల మార్గదర్శకాలతో జీవో విడుదల చేసిన తర్వాత ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు విదేశాలకు వెళ్లారు. సుమారు పది రోజులపాటు ఆయన తిరిగి రాబోరని సమాచారం. అయితే బదిలీలకు ఇష్టపడని కొందరు తాజా జీవోపై కోర్టుకు వెళితే ఇబ్బందులు తప్పవనే చర్చ రవాణాశాఖలో జరుగుతోంది. ఇప్పటికే ఆదాయం బాగున్న చోట పనిచేస్తున్న ఎంవీఐ, ఆర్టీఏ, ఏఎంవీఐ తదితరులు నాన్‌ఫోకల్‌కు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అక్కడే కొనసాగించేందుకు కూడా ఓ కీలక ప్రజా ప్రతినిధి పేరు చెప్పి డబ్బులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. రవాణాశాఖలో తీవ్ర వివాదాస్పదం అవుతున్న బదిలీల వ్యవహారంపై ఎవరో ఒకరిని కోర్టుకు పంపి బదిలీల ప్రక్రియ మొత్తం ఆగిపోయేలా చేయాలనే ఆలోచనలో కొందరు ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2022-07-03T08:11:08+05:30 IST