దక్షిణాఫ్రికాపై అన్ని మ్యాచుల్లోనూ నా దేశం విజయం సాధించేందుకు కృషి చేస్తా: Umran Malik

ABN , First Publish Date - 2022-06-06T01:35:45+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు ప్రాతినిధ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్

దక్షిణాఫ్రికాపై అన్ని మ్యాచుల్లోనూ నా దేశం విజయం సాధించేందుకు కృషి చేస్తా: Umran Malik

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు ప్రాతినిధ్యం వహించిన ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) అద్భుత ప్రదర్శనతో బీసీసీఐ దృష్టిని ఆకర్షించాడు. 22 ఏళ్ల ఈ యువ క్రికెటర్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థులను వణికించడమే కాదు.. 157 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ఫాస్టెస్ట్ డెలివరీ సంధించిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఉమ్రాన్ ఇదే ఊపు కొనసాగిస్తే పాక్ స్పీడ్‌స్టర్ షోయబ్ మాలిక్ రికార్డును కూడా బద్దలు కొట్టడం ఖాయమని క్రీడా పండితులు చెబుతున్నారు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి రికార్డు నెలకొల్పాడు.


ఉమ్రాన్ తాజాగా ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు విజయం కోసం సాయం చేయడంపైనే ప్రస్తుతం తాను దృష్టి సారించినట్టు చెప్పాడు.


ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనకు గాను ఉమ్రాన్‌కు భారత జట్టులో చోటు దక్కింది. అతడికిదే తొలి ఇంటర్నేషనల్ సిరీస్ కానుంది. ఈ సిరీస్‌లో గంటకు 150, ఆపైన వేగంతో బంతులు విసిరేందుకు కృషి చేస్తానన్నాడు. తాను ఆ వేగంతో బౌలింగ్ చేయడంలో తన రాష్ట్ర జట్టు సహచరుడు అబ్దుల్ సమద్ కీలక పాత్ర పోషించినట్టు ఉమ్రాన్ చెప్పుకొచ్చాడు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే ప్రాక్టీస్ చేసేవారు. ఐపీఎల్‌లో వీరిద్దరూ ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Updated Date - 2022-06-06T01:35:45+05:30 IST