కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే పంతం వల్ల పోలీసులకు పట్టుబడ్డ గ్యాంగ్‌స్టర్.. అదెలాగంటే..

ABN , First Publish Date - 2022-05-23T08:40:26+05:30 IST

అతనో పేరుమోసిన క్రిమినల్. అతడి కోసం చాలాకాలంగా పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ గ్యాంగ్ స్టర్ చేసిన చిన్న తప్పు వల్ల పోలీసులకు అతడి గురించి సమాచారం అందింది. వెంటనే పోలీసుల ప్రత్యేక బృందం మాటు వేసి అతడి గ్యాంగ్ సభ్యులతో సహా ఆ గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకుంది...

కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే పంతం వల్ల పోలీసులకు పట్టుబడ్డ గ్యాంగ్‌స్టర్.. అదెలాగంటే..

అతనో పేరుమోసిన క్రిమినల్. అతడి కోసం చాలాకాలంగా పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ గ్యాంగ్ స్టర్ చేసిన చిన్న తప్పు వల్ల పోలీసులకు అతడి గురించి సమాచారం అందింది. వెంటనే పోలీసుల ప్రత్యేక బృందం మాటు వేసి అతడి గ్యాంగ్ సభ్యులతో సహా ఆ గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకుంది. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ చేసిన తప్పేటంటే.. తను కోరుకున్న అమ్మాయిని ఎలాగైనా పెళ్లిచేసుకోవాలనుకోవడమే.


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరైనా ప్రాంతానికి చెందిన కల్లీ గుర్జర్ ఒక పేరు మోసిన గ్యాంగ్ స్టర్. దోపిడీలు, హత్య చేయడం అతని వృత్తి. అతని పేరు మీద ఎక్కువ ఫిర్యాదులు అందుతుండడంతో 2021 నుంచి పోలీసులు అతడిని అరెస్టు చేయాలని ప్రయత్నిస్తుండగా.. కల్లీ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కల్లీకి బాగా కావాల్సిన ఒక వ్యక్తి పోలీసులకు కల్లీ ఆచూకీ గురించి సమాచారం అందించాడు. ఆ వ్యక్తి పేరు గోపాల్.


గోపాల్, కల్లీ ఒకప్పుడు మంచి స్నేహితులు. గోపాల్‌‌కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. అతను తన కూతురిని కల్లీతో వివాహం చేస్తానని కల్లీకి మాటిచ్చాడు. కానీ గోపాల్ కూతురు మరొకరితో వివాహం చేసుకుంది. ఈ విషయం తెలిసిన కల్లీ కోపంతో ఊగిపోయాడు. తనకు ఇచ్చిన మాట తప్పినందుకు గోపాల్‌ని శిక్షించాలనుకున్నాడు. అందుకోసం ఒకరోజు  తన గ్యాంగ్‌తో గోపాల్ ఇంటికి వెళ్లి అతడి ఇద్దరు కొడుకులను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత గోపాల్‌కు కల్లీ ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. గోపాల్ మనవరాలిని(పెద్ద కొడుకు కూతురు) తనకిచ్చి పెళ్లి చేయాలని లేకపోతే కిడ్నాప్ చేసిన ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు.


గోపాల్ మనవరాలు ఒక టీనేజర్. ఇంకా స్కూల్‌లో చదువుకుంటోంది. అంత చిన్న పిల్లని కల్లీతో పెళ్లి చేయడానికి గోపాల్‌కు ఇష్టంలేదు. దీంతో గోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కల్లీ పక్క గ్రామంలో ఉన్న చోటు గురించి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లానింగ్‌తో గ్యాంగ్ స్టర్ కల్లీ గుర్జర్‌ని అతని గ్యాంగ్‌తో సహా అరెస్టు చేశారు.

Updated Date - 2022-05-23T08:40:26+05:30 IST