ఎంపీడీవోలు కావలెను!

ABN , First Publish Date - 2021-04-18T05:44:58+05:30 IST

పాలనా సౌలభ్యం కోసం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం మండలస్థాయిలో కీలక అధికారి అయినటువంటి ఎంపీడీవో పోస్టుల భర్తీ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. జిల్లావ్యాప్తంగా 17 మండలాలకు రెగ్యులర్‌ ఎంపీడీవోలు లేక దాదాపు ఏడాది కావస్తున్న వాటి భర్తీపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ దృష్టిసారించిన దాఖలాలు కనిపించడం లేదు

ఎంపీడీవోలు కావలెను!
ఇంకొల్లు ఎంపీడీవో కార్యాలయం (ఫైల్‌)

జిల్లాలో ఖాళీగా ఉన్న 17పోస్టులు

ఈవోఆర్డీలు, పరిపాలనాధికారులకు అదనపు బాధ్యతలు

రెగ్యులర్‌ ఎంపీడీవోలు లేకపోవడంతో

పథకాల అమలులో ఇబ్బందులు

ఒంగోలు(జడ్పీ), ఏప్రిల్‌ 17: పాలనా సౌలభ్యం కోసం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం మండలస్థాయిలో కీలక అధికారి అయినటువంటి ఎంపీడీవో పోస్టుల భర్తీ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. జిల్లావ్యాప్తంగా 17 మండలాలకు రెగ్యులర్‌ ఎంపీడీవోలు లేక దాదాపు ఏడాది కావస్తున్న వాటి భర్తీపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ దృష్టిసారించిన దాఖలాలు కనిపించడం లేదు. ఆయా మండలాల్లో ఉన్న ఈవోఆర్‌డీలనో లేక పరిపాలన అధికారులనో ఇన్‌చార్జీ ఎంపీడీవోలుగా నియమించి ప్రభుత్వం కాలం వెల్లదీస్తోంది.


జిల్లాలో 17 మండలాల్లో ఇన్‌చార్జిల పాలన

జిల్లాలో బల్లికురవ, కారంచేడు, టంగుటూరు, దర్శి, దొనకొండ, గుడ్లూరు, వెలిగండ్ల, అర్ధవీడు, గిద్దలూరు, పెద్దారవీడు మండలాలకు ఈవోఆర్‌డీలు ఎంపీడీవోలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండగా మార్టూరు, పామూరు, బేస్తవారిపేట, కొమరోలు, పుల్లలచెరువు, సంతనూతలపాడు, రాచర్ల మండలాలకు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌ ఇన్‌చార్జి ఎంపీడీవోలుగా ఉన్నారు. దోర్నాల ఎంపీడీవో గతంలో  సస్పెండ్‌ కాగా ఆ మండలంలో కూడా ప్రస్తుతం ఇన్‌చార్జి పాలనే నడుస్తోంది. దోర్నాలను కూడా కలుపుకొంటే మొత్తం 18 మండలాల్లో ఎంపీడీవోలుగా ఇన్‌చార్జిలే ఉన్నారు.


పథకాల అమలు, వ్యాక్సినేషన్‌లో ఇబ్బందులు

ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల పథకాల అమలులో గానీ, రోజురోజుకు మహోగ్రరూపం దాలుస్తున్న కొవిడ్‌ కట్టడిలో గానీ  మండలస్థాయిలో కీలకంగా వ్యవహరించే అధికారులలో ఎంపీడీవో ఒకరు. అంతటి ప్రాముఖ్యం గల పోస్టును దాదాపు ఏడాది కాలంగా 17 మండలాల్లో ఖాళీగా ఉంచడంతో పథకాల అమలులో వేగం లోపిస్తోంది. ఈవోఆర్‌డీలుగా, పరిపాలనాధికారులుగా విధులు నిర్వహిస్తూ అదనంగా ఎంపీడీవో బాధ్యతలు కూడా మీదపడటంతో వారు కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్‌చార్జిలకు కొన్ని నిబంధనలు కూడా అడ్డు వస్తున్నాయి. కోర్టు చిక్కుముళ్లు వీడిన అనంతరం మండల స్థాయిలో ఎంపీపీలు కూడా కొలువుదీరే అవకాశం ఉంది. వారితో సమన్వయం చేసుకుంటూ మండలపరిధిలో ఉన్న గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత ఎంపీడీవోలది. ఇప్పటికైనా పంచాయతీరాజ్‌శాఖ జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంపీడీవోల పోస్టులపై దృష్టిసారిస్తే పాలన సులభతరం అవుతుంది.


Updated Date - 2021-04-18T05:44:58+05:30 IST