మత విధ్వేష వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన పాక్ క్రికెటర్

ABN , First Publish Date - 2021-10-28T01:07:13+05:30 IST

ఇండియాపై పాకిస్తాన్ గెలుపు గురించి ఒక స్పోర్ట్స్ చానల్‌తో యూనిస్ మాట్లాడుతూ ‘‘రిజ్వాన్ ఆట ఈరోజు నన్ను చాలా ఆనందాన్ని ఇచ్చింది. అతడు ఆడుతుంటే హిందువుల మధ్యలో నమాజ్ చేసినట్టు నాకు అనిపించింది. ఇది నాకు అత్యంత ప్రత్యేకమైంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది’

మత విధ్వేష వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన పాక్ క్రికెటర్

ఇస్లామాబాద్: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం పాకిస్తాన్‌కు చెందిన వకర్ యూనిస్ అనే మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. పాక్ విక్టరీని హిందువులపై ముస్లింల గెలుపుగా అతడు చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలపై కేవలం ఇండియా నుంచే కాకుండా పాక్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పక తప్పలేదు.


ఇండియాపై పాకిస్తాన్ గెలుపు గురించి ఒక స్పోర్ట్స్ చానల్‌తో యూనిస్ మాట్లాడుతూ ‘‘రిజ్వాన్ ఆట ఈరోజు నన్ను చాలా ఆనందాన్ని ఇచ్చింది. అతడు ఆడుతుంటే హిందువుల మధ్యలో నమాజ్ చేసినట్టు నాకు అనిపించింది. ఇది నాకు అత్యంత ప్రత్యేకమైంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. అయితే ఇరు దేశాల నుంచి యూనిస్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. ఇండియన్ మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ స్పందిస్తూ ‘‘ఆటలో జిహాదీలు ప్రవేశిస్తే వారి మైండ్‌సెట్ ఇలాగే ఉంటుంది. అది వేరే లెవెల్. అతడిని తలుచుకుంటే అసహ్యంగా ఉంది’’ అని రాసుకొచ్చారు.


దీంతో యూనిస్ క్షమాపణలకు దిగక తప్పలేదు. ‘‘నేను చాలా పెద్ద తప్పు చేశాను. చాలా మంది మనోభావాల్ని దెబ్బతీశాను. దానికి నేను ప్రతి ఒక్కరికి క్షమాపణ చెబుతున్నాను అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా అలా అన్నాను. మతం ఆధారంగా ఇంకోసారి ఇలాంటి కామెంట్లు అస్సలు చేయను. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్‌, ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్నాయని అర్థం అయింది. వాళ్లందరికి పేరు పేరున క్షమాపణ చెబుతున్నాను. నిజానికి క్రీడల్లో ఇలాంటి వాటికి తావు లేదు. క్రీడకు మతం, ప్రాంతం, రంగు లాంటివి లేవు’’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2021-10-28T01:07:13+05:30 IST