యుద్ధపరిహార న్యాయం కావాలి!

ABN , First Publish Date - 2021-07-15T06:17:17+05:30 IST

గతఏడాది అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌పై జాత్యంకార హత్యకు పాల్పడినందుకు తెల్లజాతి పోలీసు అధికారి డెరెక్ షావిన్‌పై మిన్నెసోటా కోర్టు ఏడాదిలోపే సత్వర విచారణ జరిపి...

యుద్ధపరిహార న్యాయం కావాలి!

గతఏడాది అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌పై జాత్యంకార హత్యకు పాల్పడినందుకు తెల్లజాతి పోలీసు అధికారి డెరెక్ షావిన్‌పై మిన్నెసోటా కోర్టు ఏడాదిలోపే సత్వర విచారణ జరిపి, ఇరవై రెండున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. మనదేశంలో ఎస్సీ ఎస్టీలపై జరిగిన అత్యాచారాలు, దాడులకు సంబంధించిన ఏ ఘటనలోనూ ఇంత వేగంతో బాధితులకు న్యాయం జరగలేదన్నది ఒప్పుకోక తప్పని నిజం.


దళిత మహిళ మరియమ్మ పోలీసు దెబ్బలతో చనిపోవటంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. దళిత ప్రజాసంఘాలు, ముఖ్యమైన రాజకీయ పార్టీలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించాయి. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ అంశం పెద్ద సంచలనం సృష్టించింది. జూలై రెండవ తేదీన మరియమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం జరిగింది. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ మరియమ్మ మృతిని సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. మరియమ్మ మృతికి, ఆమె కొడుకు ఉదయ్ కిరణ్‍‌ను చిత్రహింసలకు గురిచేయటానికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరియమ్మ కుటుంబానికి సంపూర్ణన్యాయం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సిందే.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియమ్మ మృతి సంఘటన నేపథ్యంలో, దళితుల సాధికారత అంశంపై రాష్ట్రస్థాయి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు, అనగా గత ఏడేళ్లలో అత్యాచారాలు, దాడులలో బాధితులైన ఎస్సీ ఎస్టీలు మొత్తం 8818 మందికి, నష్టపరిహారం కింద 81కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలను చెల్లించినట్లు రాష్ట్రప్రభుత్వం ఈ సమావేశంలో వెల్లడించింది. ఇందులో ఆరు వేల మందికి పైగా బాధితులు దళితులు. 2200 మందికి పైగా బాధితులు ఎస్టీలు. రాబోయే నాలుగేళ్లలో దళిత సాధికారత పథకం కింద, ఏడాదికి ఐదువేల కోట్ల రూపాయలను దళితుల స్వయం ఉపాధి పథకాల కోసం కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా- ప్రకటించారు.


జాతీయస్థాయిలో 2015 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలంలో అంతకు మునుపటికన్నా 19 శాతం ఎస్సీలపై అత్యాచారాల రేటు పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. 2019లో జాతీయస్థాయిలో దళితులపై జరిగిన అత్యాచారాలు 46000. కాగా, ఇందులో ఆ ఏడాది, తెలంగాణ రాష్ట్రంలో జరిగినవి 1690. ఇవి 2018తో పోలిస్తే ఏడు శాతం పెరిగాయని పై జాతీయ సంస్థ వెల్లడించింది.


2019లో జాతీయస్థాయిలో, రెండు లక్షలకు పైగా అత్యాచారాల కేసులకుగాను, 35000 కేసులు మాత్రమే విచారణ వరకు వెళ్లాయి. విచారణలు పూర్తయిన కేసులు 13000. ఇందులో, 4000 కేసుల్లో మాత్రమే శిక్షలు ఖరారయ్యాయి. 2019లో శిక్షలు పడిన ఎస్సీ ఎస్టీ కేసుల శాతం తెలంగాణలో 9 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 6.8 శాతంగా ఉందని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.


ఎస్సీ ఎస్టీ కేసుల పరిశోధన విషయంలో బాధితుల కులం సర్టిఫికెట్ల సేకరణ, సంబంధిత వైద్య నివేదికలు, నిందితుల నుంచి సమాచారం, సంబంధిత వివరాల సేకరణలో జాప్యం వల్ల నేరాల విచారణలో ఆలస్యం అవుతున్నది. ప్రతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరవై రోజుల్లోగా పోలీసులు పూర్తి విచారణ జరిపి, చార్జిషీటును కోర్టుకు సమర్పించాలి. కాగా సంబంధిత సమాచార పత్రాలు అందటానికి చాలాకాలం పడుతున్నది. ఇందువల్ల దళితులపై, ఆదివాసులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల కేసుల పరిశోధనలో విపరీతమైన జాప్యం జరుగుతున్నది. 


ఏ సమాజపు అభివృద్ధినైనా అందులోని మహిళాభివృద్ధి ఆధారంగానే లెక్కగట్టాలి అంటారు అంబేడ్కర్. భారతదేశంలో మహిళలంతా ఒకే విధంగా లేరు. ఆధిపత్య కులాల మహిళలు వేరు. అణగారిన కులాల మహిళలు వేరు. అందునా దళిత మహిళలు పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అంటరానితనం, వెట్టిచాకిరి, మూఢనమ్మకాలు, అత్యాచారాలు, దాడులు, జోగిని, మాతంగి, మాతమ్మ, బాలకార్మిక వ్యవస్థ మొదలైన తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి అందే కొద్దిపాటి సంక్షేమ పథకాలు ఏవీ దళిత మహిళల్లో సాధికార మార్పును తీసుకురాలేకపోయాయి. ప్రభుత్వాల అభివృద్ధి పాలసీలన్నీ ఆధిపత్య కులాల మగవాళ్ళకు అనుకూలమైన పాలసీలే. దళిత, ఆదివాసీ మహిళలను అభివృద్ధి పేరుతో మరింత అణగార్చే, మార్జినలైజ్ చేసే పాలసీలనే ఆధిపత్య కులాల పురుష ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో, మరియమ్మ తరఫున పోరాడుతున్న సమూహాలన్నీ తమపై జరుగుతున్న దౌర్జన్యాలు, అన్యాయాలకి నష్టపరిహారం వద్దంటున్నాయి. రాజకీయ యుద్ధపరిహారం కావాలంటున్నాయి.


జార్జి ఫ్లాయిడ్ హంతకుడు డెరిక్ షావిన్‌కు కోర్టు శిక్ష విధించిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ ‘అమెరికాలోని జాతి సంబంధాల్లో వ్యవస్థీకృత జాతివివక్ష మన జాతీయ ఆత్మపై రక్తపు మరక’ అని అభివర్ణించారు. మరి మన దేశ, రాష్ట్ర పాలకులు, అధికార వ్యవస్థలు తమ ఆధిపత్య కుల, జెండర్ వివక్షాపూరిత యుద్ధాలపై ఇలాంటి సంస్కార దృష్టిని అలవర్చుకోగలరా? దళిత మరియమ్మలకు సామాజిక-, రాజకీయ యుద్ధపరిహారాన్ని చెల్లించగలరా?

కృపాకర్ పొనుగోటి

Updated Date - 2021-07-15T06:17:17+05:30 IST