వైరా గులాబీలో వర్గపోరు!

ABN , First Publish Date - 2022-07-02T05:08:40+05:30 IST

వైరా నియోజకవర్గంలోని అధికార టీఆర్‌ఎ్‌సలో వర్గపోరు తీవ్రతరమవుతుంది. ఒకే పార్టీ ఆరువర్గాలుగా తయారైంది.

వైరా గులాబీలో వర్గపోరు!

ఒక పార్టీ ఆరు వర్గాలు

టికెట్‌పై నాయకుల భారీ ఆశలు

వైరా, జూలై 1: వైరా నియోజకవర్గంలోని అధికార టీఆర్‌ఎ్‌సలో వర్గపోరు తీవ్రతరమవుతుంది. ఒకే పార్టీ ఆరువర్గాలుగా తయారైంది. ఎవరికి వారే యమునా తీరుగా గులాబీ శ్రేణులు వ్యవహరిస్తున్నారు. రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడున్నారేళ్లు పూర్తయి మళ్లీ వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఇక్కడ వర్గపోరు ఆపార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటివరకు నియోజకవర్గంలోని పార్టీ కార్యకలాపాలన్నీ ఎమ్మెల్యే నేతృత్వంలోనే జరగాలని కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో పార్టీలోని వర్గాలు ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అయితే కొద్దిరోజుల కిందట టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో టీఆర్‌ఎ్‌సలో అణిగిమనిగి ఉన్న వర్గపోరు బహిర్గమయ్యేందుకు దోహదపడింది. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ కార్యకలాపాలన్నీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరగాల్సిన అవసరం లేదని పార్టీలో ఎవరైనా కార్యక్రమాలు చేయవచ్చని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను అప్పటివరకు వేచిచూస్తున్న వారు తమకు అనుకూలంగా మార్చుకొని నియోజకవర్గంలో మళ్లీ పాగా కోసం ప్రయత్నాలు చేపట్టారు. మూడున్నారేళ్లుగా ఎమ్మెల్యే రాములునాయక్‌ ఆధ్వర్యంలోనే టీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు కొనసాగాయి. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌, మరో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాణోతు చంద్రావతి మళ్లీ నియోజకవర్గంపై దృష్టిసారించి వచ్చే ఎన్నికల్లో తమకు సానుకూల వాతావరణం ఏర్పడే విధంగా ప్రయత్నాలు చేపట్టారు. వైరాకు ప్రస్తుత ఎమ్మెల్యే రాములునాయక్‌తోపాటు మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారు. ఉమ్మడి ఏపీలో 2009లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ నుంచి ఎమ్మెల్యే అయిన డాక్టర్‌ చంద్రావతి చివర్లో పార్టీలో వచ్చిన విభేదాల కారణంగా టీఆర్‌ఎ్‌సలో చేరి 2014లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయిన బాణోతు మదన్‌లాల్‌ ఆవెంటనే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌పై పోటీచేసిన మదన్‌లాల్‌ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసిన లావుడ్యా రాములునాయక్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆవెంటనే రాములునాయక్‌ టీఆర్‌ఎ్‌సలో చేరారు. మూడున్నారేళ్లుగా మదన్‌లాల్‌ హరితహారం ఇతరత్రా అడపాదడపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల తర్వాత ఎన్నికల వాతావరణం కూడా సమీపిస్తుండటంతో మదన్‌లాల్‌ మళ్లీ నియోజకవర్గంలో తన వర్గీయులను కూడగట్టే ప్రయత్నాలు చేపట్టారు. ఎమ్మెల్యే రాములునాయక్‌తో కొనసాగుతున్న వారిలో కొంతమంది మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరికొందరు ఎంపీ నామా నాగేశ్వరరావు, మరికొందరు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఇంకొందరు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, తదితరులకు దగ్గరగా మసులుకుంటున్నారు. మదన్‌లాల్‌ వెంట ఉన్న కొందరు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ తదితరులతో సంబంధాలు కలిగి ఉన్నారు. 


టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానే బరిలోకి!


ఈ నేపథ్యంలోనే మదన్‌లాల్‌ గురువారం వైరాలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. తాను వేరే పార్టీలో చేరబోనని, టీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతానని, కేసీఆర్‌, కేటీఆర్‌ సారథ్యంలోనే పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానే బరిలో ఉంటానని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కేసీఆర్‌ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మదన్‌లాల్‌ ఏకరువు పెట్టారు. ఓవైపు మదన్‌లాల్‌ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కొనియాడగా సమావేశంలో మాట్లాడిన పలువురు నాయకులు, కార్యకర్తలు మాత్రం ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించటం విశేషం. పక్కాఇళ్లు, పింఛన్లు ఇతర ఏ సమస్యలుపరిష్కారం కావడం లేదని ఏకరువు పెట్టారు. అంతేకాకుండా కేవలం మదన్‌లాల్‌ హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని, అంతకముందు, ఆతర్వాత ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరును కార్యకర్తలు ఎండగట్టడం కొసమెరుపు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ తనకే వస్తుందని కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు మదన్‌లాల్‌ ప్రయత్నించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాములునాయక్‌ కూడా ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పద్దతిలో ముందుకు వెళ్తూ కేసీఆర్‌, కేటీఆర్‌ సారథ్యంలో మళ్లీ తనకే టిక్కెట్‌ వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని తానేనని, ఎవరెన్నీ పగటి కలలు కన్నా ఫలితం ఉండదని చెపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మహిళలకు కూడా సముచిత రీతిలో పోటీకి అవకాశం ఇవ్వనున్నందున మళ్లీ తనకు టిక్కెట్‌ లభిస్తుందని చంద్రావతి చెపుతూ అడపాదడపా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వర్గపోరు తీవ్రమవుతుంది. ఇది మున్ముందు మరింత ముదిరే అవకాశముంది. అదే జరిగితే టీఆర్‌ఎ్‌సలో అది ఎంతవరకు మంచి జరుగుతుందో, నష్టం జరుగుతుందో వేచిచూడాల్సి ఉంది. అందువలన అధిష్టానం ముందుగానే ఈ వర్గపోరుకు చెక్‌ పెట్టాల్సి ఉందని శ్రేయోభిలాషులు వ్యాఖ్యానిస్తున్నారు.


Updated Date - 2022-07-02T05:08:40+05:30 IST