యుద్ధం అనేది, చంపుళ్ళ వ్యాపారం!

ABN , First Publish Date - 2022-05-22T06:56:16+05:30 IST

యుద్ధాల్లో, ఒక యుద్ధం తమ ఆత్మ రక్షణ కోసమే జరుగుతోఁదా; లేకపోతే, ఇతర ప్రాంతాల సంపదల్ని దోచడం కోసమే జరుగుతోఁదా? యుద్ధాల్లో ఈ తేడాలు పూర్వం నించీ వున్నాయి...

యుద్ధం అనేది, చంపుళ్ళ వ్యాపారం!

యుద్ధాల్లో, ఒక యుద్ధం తమ ఆత్మ రక్షణ కోసమే జరుగుతోఁదా; లేకపోతే, ఇతర ప్రాంతాల సంపదల్ని దోచడం కోసమే జరుగుతోఁదా? యుద్ధాల్లో ఈ తేడాలు పూర్వం నించీ వున్నాయి.


మానవ జాతిలో, ఆటవిక తెగల కాలంనించీ, ఈ తెగ, ఆ తెగ మీద, తనకు అత్యవసరమైన పళ్ల చెట్లూ, నీళ్ళూ, చేపలూ, జంతువులూ వంటి ప్రకృతి వనరుల కోసం కొట్లాటలకు దిగేవి – అన్నట్టు చదువుతాము. తెగల కొట్లాటలు, ఆ నాటి రాళ్ళతోనూ, కర్రలతోనూ! చంపుళ్ళన్నీ వాటితోనే!


కొట్లాటలనేవి, ప్రారంభకాలంలో, నిజమైన అవసరాల కోసమే జరిగినా, కాలక్రమంలో అవి, సంపదల్ని పోగుచేసే మార్గాలుగా కూడా మారుతూ వచ్చాయి. 


ఆనాటి కర్రల కొట్లాటలు, క్రమంగా బాణాల, తుపాకుల యుద్ధాలుగా ఎదుగుతూ, మారుతూ వచ్చాయి. ఈనాటి ఎదుగుదల అణుబాంబుల యుద్ధాల వరకూ ఎదిగింది. 


ఈనాటి సమాజాన్ని ‘ఆధునిక’, ‘నాగరిక’ సమాజాలుగా చెప్పుకుంటాం. ‘నాగరికత’ అంటే, కర్రల కొట్లాటలు, అణుబాంబుల యుద్ధాలుగా మారడమా? 

పాత కాలంలో లేని ఇంజనీర్లూ, సైంటిస్టులూ, రకరకాల ‘గొప్ప’ ఆయుధాల్ని కనిపెట్టేశారు! ఇంకా కూడా కనిపెడుతున్నారు. ఈ ఖండంలో వాళ్ళు, ఏ ఖండంలో వాళ్ళని అయినా, లక్షల కోట్లమందిని ఒక్క సెకనులో చంపెయ్యగల ప్రావీణ్యతల్ని కనిపెట్టేశారు.


ఈ మనుషులు, ఆ మనుషుల్ని చంపడాలు ఎందుకు? ఆ ద్వేషాలూ, ఆ క్రోధాలూ, వేటిని సంపాదించడానికి? – ఇంకా వేటిని? ‘డబ్బు’ రాసుల్ని సంపాదించడానికే! సరికొత్త ఆయుధాల్ని కనిపెట్టిన సైంటిస్టులకేనా, ఇంజనీర్లకేనా, ఆ డబ్బు రాసులు? వీళ్ళకీ వుంటాయి పెద్ద పెద్ద జీతాలూ, ప్రత్యేక సౌకర్యాలూ, షేర్లూనూ! అసలైతే, వీళ్ళ యజమానులకే ఆ రాసులన్నీ! తోటి మానవులందర్నీ, చంటి పిల్లలతో సహా చంపేసి, తమ డబ్బు రాసులతో ఏఁ చేస్తారు? తాము చచ్చినప్పుడు, తమ దహనాలు, ఆ డబ్బురాసుల మీదే జరగాలని చెప్పుకుంటారా? ఇంత వరకూ ఈ విషయాల్ని ఎక్కడా చదవలేదు. డబ్బు రాసుల కోసం యుద్ధాలు చేయించిన వాళ్ళు చచ్చినా, వాళ్ళ డబ్బు కుప్పలు, వాళ్ళ సంతానాలకు అందుతాయి. వాళ్ళూ కొత్త యుద్ధాలు ప్రారంభిస్తారు! 


ఆధునిక యుద్ధం, ఆధునిక వ్యాపారమే! వ్యాపారాలన్నీ, ‘లాభాల’ కోసమే కదా? లాభాల్ని ఇంకా ఇంకా పెంచుకోవాలి కదా? ఈ లాభాల పెంపకాలు ఎలా జరుగుతాయి? యుద్ధాల్ని చకచకా నడపగల ఆయుధాల్ని శ్రామికులతో తయారు చేయించాలి. వాటిని ఎటు అమ్మాలో, ఏయే ప్రాంతాలు కలహాలతో చిక్కుకుపోయి వున్నాయో చూసి, వాటిలో ఏదో ఒక ప్రాంతానికి బాంబుల వంటి ఆయుధాల్ని అమ్మితే లాభాలు రావా?

ఈనాటి ప్రపంచంలో, అగ్ర రాజ్యాలుగా పేర్లు పొందిన అమెరికా, యూరప్, రష్యా, చైనాలు వున్నాయి. 

రష్యా, చైనాలు ఒకనాడు కమ్యూనిస్టు కలలు కన్నవే! కలల మీదే ఆధారపడితే? కమ్యూనిస్టు సిద్దాంతాన్ని స్పష్టంగా తెలుసుకుని, ఆ సిద్ధాంతాన్ని శ్రామిక వర్గ ప్రజలకు బోధించే ప్రయత్నాలే లేకపోతే కలలు కల్లలు అవుతాయి. 


కమ్యూనిజాన్ని మాటల్లో మాత్రమే కొన్నాళ్ళు జపించి, క్రమంగా దానికి దూరమై; లాభాల సిద్ధాంతాన్ని మళ్ళీ వెనక్కి పిల్చుకుని, యుద్ధ సామగ్రిని పెద్ద ఎత్తున తయారు చేయించడమూ, దాన్ని కలహాలతో కొట్టుకుంటున్న ప్రాంతాలకు సరఫరాల పేరుతో అమ్మడమూ చేస్తే, ఈ మార్గాన్ని మించిన లాభాల మార్గం ఉంటుందా?      

ప్రపంచ యుద్ధాల చరిత్రనీ, స్తానికంగా కొన్ని దేశాల మధ్య జరిగిన యుద్ధాల చరిత్రనీ చూస్తే, ఈ విషయం తెలిసిపోతుంది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, వాటి బడ్జెట్లలో, రక్షణ రంగానికి కేటాయించే డబ్బు లెక్కలు గానీ; యుద్ధాలకు వ్యతిరేకంగా పరిశోధనలు చేసే శాంతి సంస్తలు ఇచ్చే వివరాలు గానీ చూస్తే, యుద్ధం అనేది ఎంత పెద్ద వ్యాపారమో అర్ధం అవుతుంది.


ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధ వార్తలే చూడండి. ప్రపంచ ఆధిపత్యంలో రష్యాకి పోటీదారు అయిన అమెరికా, ఉక్రెయిన్‌కి కొన్ని వందల కోట్ల (2.4 బిలియన్లు) విలువ గలిగిన ఆయుధాలని ఇస్తూ వుందని చదివాం. ఇదంతా ఆయుధాల అమ్మకం! ఐరోపా యూనియన్‌కి చెందిన దేశాలు కూడా మరికొన్ని వందల కోట్ల (1.62 బిలియన్లు) ఆయుధాలని ఇస్తూ (అమ్ముతూ‌) వున్నాయి. ఆయుధాల్ని కొన్నవాళ్ళు, పాతిక ముప్పై సంవత్సరాల లోగా, ఒక శాతం వడ్డీతో  అప్పు తీర్చాలి. రష్యా కూడా ఈ ఆయుధ వ్యాపారంలో, అమెరికా తర్వాత రెండో స్తానంలో వుంది. చైనా ఐదో స్తానంలో వుంది.


ఆయుధాలు కొనుక్కున్న దేశాలు, ఆ ఖర్చుని ఎక్కడి నించీ తెచ్చి పెడతాయి. ‘విదేశీ సాయం’ పేరుతో, అటునించి అప్పుగా తెచ్చుకున్నా, ఆ అప్పుని ఎలా తీరుస్తాయి? పన్నుల నించీ.  పన్నులు ఎవరు చెల్లిస్తారు? పైపైన చూస్తే లాభాలు సంపాదించే పెద్ద పెద్ద కంపెనీల వారే. కానీ, వాళ్ళకి అన్నన్ని లాభాలు ఎక్కడి నించీ వస్తాయి? శ్రామికులు, యజమానులకు ఇచ్చే ‘అదనపు విలువ’ నించీ. ఈ విషయం పన్నులు చెల్లించే యజమానులకూ తెలియదు, అదనపు విలువని ఇచ్చే శ్రామిక జనాలకూ తెలియదు.


అది తెలుసుకున్న నాడు, యుద్ధాల్ని వ్యతిరేకించి, విద్య మీదా, ఆరోగ్యం మీదా, ఖర్చుపెట్టమని, ఏ దేశ ప్రజలైనా, వారి ప్రభుత్వాలను నిలదీస్తారు.


యుద్ధాల వల్ల జరిగే నష్టం గురించి వారికి ఎలాగూ తెలుసు. ప్రాణ నష్టం, పంట పొలాల నాశనం,  గాలీ, నీరు కాలుష్యం, గాయాలూ, అంగ వైకల్యాలూ, రోగాలూ! – ఇలా అన్ని దుష్పలితాలూ కళ్ళకి కనిపిస్తూనే వుంటాయి. ప్రతీ యుద్ధం లోనూ, అది పెద్దదైనా, చిన్నదైనా, ముందు ప్రాణాలు వదిలేది రెండు పక్షాలకూ చెందిన సైనికులు. ఒక దేశ సైన్యం, ఇంకో దేశ భూభాగం లోకి చొచ్చుకు వస్తే, నాశనం అయ్యేది ఆక్రమణకి గురైన దేశపు సాధారణ ప్రజలే. స్తీల మీద జరిగే అత్యాచారాల గురించి చెప్పనే అక్కర లేదు. గత ముప్పై ఏళ్ళ కాలంలో 40 లక్షల మంది చచ్చిపోయారనీ, వాళ్ళలో నూటికి తొబ్బై మంది సాధారణ పౌరులేనని ఒక అంచనా. గాయాల పాలూ, రోగాల పాలూ అయిన వారి సంఖ్య అదనం.


కానీ, యుద్ధం వల్ల జరిగే ప్రాణ నష్టం కేవలం అంకెలు గానే కనపడతాయి. వాటి వెనక ఎన్ని విషాదాలో! అవేవీ ప్రభుత్వాలకు పట్టవు. యుద్ధాలు చెయ్యాలని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం వెనక, ఆయుధ వ్యాపారులున్నారని, గతంలో కొన్ని విచారణల్లో తేలింది. అలాంటి వ్యాపారుల్ని ‘మృత్యు వ్యాపారుల’ని (‘హాకర్స్ ఆఫ్ డెత్’) అంటారు. ఆ పేరుతో ఒక పుస్తకం కూడా వచ్చిందని విన్నాం. సోవియట్  యూనియన్ పతనం తర్వాత, రష్యాలో ఒక ఆయుధాల వ్యాపారి జీవిత చరిత్రని, ‘యుద్ధ ప్రభువు’ (‘లార్డ్ ఆఫ్ వార్’) అనే పేరుతో ఒక సినిమా కూడా తీశారు! ఇది యూట్యూబ్‌లో కూడా కనిపిస్తుంది. 


ఒకే దేశంలో, యుద్ధాలు చేసుకునే రెండు పక్షాలకీ ఆ రష్యా వ్యాపారే ఆయుధాలు సప్లై చేశాడట! (తాజా వార్త: ఉక్రెయిన్‌కి, అమెరికా పంపే యుద్ధ సామాగ్రిని లాక్ హీడ్ మార్టిన్, రేతియన్ టెక్నాలజీస్ అనే కంపెనీలు తయారు చేస్తాయి. ఈ కంపెనీలలో, అమెరికా పార్లమెంటు సభ్యులకి, కనీసం 20 మందికీ, వాళ్ళ భార్యలకీ బోలెడు షేర్లు ఉన్నాయని వ్యాపార పత్రికలు రాశాయి.)


ఆయుధాలు అమ్మే దేశాలూ, వాటిని కొనే దేశాలూ రెండూ ‘మృత్యు వ్యాపారులే’ అని మనం అనుకోవాలి.


చివరికి, మళ్ళీ ఆలోచించాలి. యుద్ధం ఎందుకు? లాభాల రాసికే! మనుషుల క్షేమం కోసం కాదు!

రంగనాయకమ్మ

Updated Date - 2022-05-22T06:56:16+05:30 IST