బెంగాల్‌ యుద్ధం

ABN , First Publish Date - 2020-12-15T09:47:38+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పటికే తీవ్రస్థాయికి చేరింది. భారతీయ జనతాపార్టీ ఒత్తిళ్ళు,...

బెంగాల్‌ యుద్ధం

పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పటికే తీవ్రస్థాయికి చేరింది. భారతీయ జనతాపార్టీ ఒత్తిళ్ళు, బెదిరింపులకు ఏ మాత్రం లొంగుతున్నట్టు కనిపించకూడదన్న పట్టుదలతో మమత కొన్ని తప్పటడుగులు కూడా వేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు జె.పి. నద్దా కాన్వాయ్‌మీద జరిగిన రాళ్ళదాడి ఇరుపక్షాల మధ్యా రాజకీయ ఘర్షణను మరింత హెచ్చవేసింది. ‘ఈ ఛద్దాలూ నద్దాలూ ఫద్దాలూ ఇలా వచ్చిపోతున్నప్పుడల్లా మంటలు రాజేస్తుంటారు. ఈ ఔట్‌సైడర్స్‌తో జాగ్రత్త’ అని మమత అన్నందుకు గవర్నర్‌కు కోపం వచ్చి నిప్పుతో చెలగాటమాడకండి అని హెచ్చరించారు. నద్దామీద దాడి జరిగిన డైమండ్‌ హార్బర్‌ ప్రాంతాన్ని ఆయన రేపు సతీసమేతంగా సందర్శించబోతున్నారు. రాష్ట్రంలోని అధికారులంతా మమత అడుగులకు మడుగులొత్తుతున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతోందని గవర్నర్‌ బాధపడుతున్నారు. ఇక, నద్దాపై దాడి ఘటన నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ రావాల్సిందిగా కేంద్రం సమన్లు పంపినా, వారిని పోనివ్వకుండా మమత నిలువరించడం ఆమె వ్యవహారశైలికి అనుగుణంగానే ఉంది. ఆ తరువాత కేంద్రం నద్దా పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను కేంద్రానికి డిప్యూటేషన్‌పై రావాల్సిందిగా ఆదేశిస్తే దానిని సైతం మమత అడ్డుకున్నారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి చేయవలసిన ఈ నిర్ణయాన్ని ఇప్పుడు కేంద్రం ఏకపక్షంగా తీసుకున్నమాట నిజమే అయినప్పటికీ, సర్వీసు నిబంధనల ప్రకారం సదరు అధికారులను రాష్ట్రం ఎంతోకాలం రిలీవ్‌ చేయకుండా ఆపలేదన్నది వాస్తవం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ ఘర్షణలో వ్యవస్థలు, నిబంధనలు, విలువలు నాశనమైపోవడం సరికాదు.


వాళ్ళమీద వాళ్ళే రాళ్ళేసుకుంటారు, మనమీద విషం చిమ్ముతారు అంటూ బీజేపీ అధ్యక్షుడిమీద జరిగిన దాడిని మమత తేలికగా తీసిపారేయడం సరికాదు. ఆయనకు ఏం కాలేదు, భేషుగ్గా ఉన్నారు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులిపేసుకోవడమూ ఆశ్చర్యం కలిగించే అంశమే. ఒక చిన్న ఘటనను బీజేపీ భూతద్దంలో చూపుతున్నదన్న తృణమూల్‌ నాయకుల విమర్శల్లో నిజం ఉన్నా లేకున్నా, ఒక జాతీయస్థాయి నాయకుడిమీద ఎంత చిన్నదాడి జరిగినా దానిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిందే, గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. బీజేపీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నదని ఎంత ఘాటుగానైనా విమర్శించవచ్చును కానీ, కేవలం అసహనం, అహంకారంతో సదరు ఘటనను తేలికగా తీసిపారేసి, రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా నడుచుకోవడం లేదన్న అప్రదిష్ట తెచ్చుకోవడం మమతకు మంచిది కాదు. తన రాజకీయ విరోధులపై జరిగే భౌతిక దాడులను ఆమె ఉపేక్షిస్తారన్న విమర్శలు ఇప్పటికే ఉండగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన విషయంలోనూ ఆమె ఇలాగే వ్యవహరిస్తే విమర్శకులకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ‘ఎవరో నాలుగు రాళ్ళు విసిరారు కానీ, ఎవరికీ ఏమీ కాలేదు’ అని పోలీసులు తక్షణ న్యాయం ప్రకటించేసిన తరువాత, దాడికారకులను గుర్తించినా, అరెస్టు చేసినా ప్రజల మనసుకు పెద్దగా పట్టదు. 


ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బెంగాలో హింస ఇంకా పెరుగుతుంది. కమ్యూనిస్టుల నుంచి మమత అధికారాన్ని కైవసం చేసుకున్న కాలంలో కంటే మరింత తీవ్రమైన హింసను రాబోయే రోజుల్లో చూడవలసి రావచ్చు. రాష్ట్రం నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎంపీస్థానాలను గెలుచుకొని జోరుమీద ఉన్న బీజేపీ, ఈ మారు ఆరునూరైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉంది. మమతను అన్ని వైపులనుంచీ వేటాడుతున్నది. ‘సూపర్‌ సీఎం’గా పేరుగాంచిన మమత మేనల్లుడిపై తృణమూల్‌ నాయకుల్లో ఉన్న అసంతృప్తి బీజేపీకి బాగానే కలిసివస్తోంది. కనీసం 40 అసెంబ్లీ స్థానాల్లో తన ప్రభావాన్ని చూపగల సువేందు అధికారి వంటివారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీకి దూరం కావడం మమతకు పెద్ద దెబ్బ. మమతతో సమానంగా పోరాటాలు చేసి తృణమూల్‌ను అధికారంలోకి తెచ్చిన ఇటువంటి మరికొందరిని బీజేపీ తనవైపు తిప్పుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులను మమత పూర్తిగా తుడిచిపెట్టేయడంతో ప్రత్యర్థి స్థానాన్ని బీజేపీ సునాయాసంగా భర్తీచేయగలిగింది. దీనికి తోడు బెంగాల్‌ ఎన్నికల్లో ఒవైసీ కాలూనడం తృణమూల్‌కు ఉన్న బలమైన ముస్లిం ఓటుబ్యాంకును పెద్ద ఎత్తున దెబ్బతీస్తుందని అంటున్నారు. బెంగాల్‌ జాతీయవాదాన్ని ప్రజల మనసుల్లో బలంగా నాటుతూ, భారతీయ జనతాపార్టీని ఉత్తరాది పార్టీగా, ఆ నాయకులను బయటివ్యక్తులుగా బెంగాలీలకు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తున్న మమత ఈ పోరాటంలో ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలి.

Updated Date - 2020-12-15T09:47:38+05:30 IST