ముద్దపై యుద్ధం!

ABN , First Publish Date - 2022-05-25T06:15:02+05:30 IST

ప్రపంచం కూటి కరువులో కూరుకుపోయింది. 2008లో జ్వాలగా ఒక్కసారి ఎగసిపడిన ప్రపంచ సామాజికార్థిక సార్వత్రిక సంక్షోభం, ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం...

ముద్దపై యుద్ధం!

ప్రపంచం కూటి కరువులో కూరుకుపోయింది. 2008లో జ్వాలగా ఒక్కసారి ఎగసిపడిన ప్రపంచ సామాజికార్థిక సార్వత్రిక సంక్షోభం, ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం, వాతావరణ మార్పు కారణంగా ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలు... వెరసి ప్రపంచం భయంకరమైన ఆహార సంక్షోభ రాక్షసి వాతపడింది. సామాజికార్థిక సంక్షోభ ఆఘాతాల వల్ల 21 దేశాల్లో మూడు కోట్ల మందికి పైగా, ఉక్రెయిన్‌ దురాక్రమణ కారణంగా 24 దేశాల్లో 14 కోట్ల మందికి పైగా, వాతావరణ మార్పుల ప్రకృతి వైపరీత్యాల పర్యవసానంగా 8 దేశాల్లో 2.3 కోట్ల మందికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని గ్లోబల్‌ పాలసీ నివేదిక 2022 తెలిపింది. 2030 నాటికి 9.06 కోట్ల మంది భారతీయులు ఆహార సంక్షోభం ఎదుర్కోబోతున్నారని కూడా ఈ నివేదిక పేర్కొంది. ‘ప్రపంచ వ్యాప్తంగా అకలి కేకలు తీవ్రస్థాయికి చేరుకున్నాయ’ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ చెప్పడం, ‘సమాజంలో ఆకలి ఏ రూపంలో ఉన్నా.. అది ప్రభుత్వ వైఫల్యంగా, హింసా రూపంగా పరిగణించాల’న్న ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానాన్ని ఒక హెచ్చరికగా చూడాలి. ప్రపంచ సామాజికార్థిక, పర్యావరణ సంక్షోభం పరిష్కారంగా ముందుకొస్తున్న రాజకీయ, సామాజిక పరిష్కారాలు, సర్దుబాట్లు ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం కేంద్రంగా సాగుతున్నాయి. సంక్షోభానికి యుద్ధమే పరిష్కారంగా మారింది. పర్యవసానంగా ప్రత్యక్ష ప్రచ్ఛన్న యుద్ధాలు, అంతర్యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు ఇలా... అనేక రూపాల్లో ఆధిపత్య పోరు పరాకాష్ఠకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాక్రమణ యుద్ధం సామ్రాజ్యవాద దేశాల మధ్య సాగే ఆధిపత్య పోరుగాక మరొకటి కాదు. దాంతో ప్రపంచ ఆహారోత్పత్తి ఘోరంగా పడిపోవడంతో పాటుగా, సరఫరా మార్గాలు సైతం పెద్దఎత్తున దెబ్బతిన్న కారణంగా కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్న దుస్థితి నెలకొంది.


సామ్రాజ్యవాద దేశాల దురాశ కుట్రల ఫలితంగానే ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం సాగుతోంది. ప్రపంచ ఆహార అన్నపూర్ణగా నిలిచిన రష్యా–ఉక్రెయిన్‌ ప్రాంతంలో వ్యవసాయోత్పత్తికి, ఆహారధాన్యాల సరఫరాకు గండిపడింది. ప్రపంచ గోధుమల ఎగుమతిలో 25 శాతం వాటా కలిగిన ఈ ప్రాంత ఆహార ఉత్పత్తి సరఫరా దెబ్బతినడంతో ప్రపంచ ప్రజల ఆకలి కేకలు మిన్నంటాయి. ధాన్యం ఎగుమతిలో అగ్రస్థానంలో ఉన్న రష్యా–ఉక్రెయిన్‌ ప్రాంత ఆధిపత్యానికి గండికొట్టడం, 8.5 శాతం దాకా ద్రవ్యోల్బణంతో దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఆహార ధరలను కట్టడి చేయడంలో తలమునకలైన అమెరికా ఈ యుద్ధానికి ఆజ్యం పోసింది. రష్యా–ఉక్రెయిన్‌ దురాక్రమణ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరతను సృష్టించడం, పర్యవసానంగా అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రపంచ దేశాల ఆహారధాన్యాల ఎగుమతులను పెంపొందించి వ్యవసాయోత్పత్తుల ధరలు క్షీణించేట్టు చేయడం, తత్ఫలితంగా దేశీయ ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసుకోవాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 


ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు, వినియోగదారు అయిన ఇండియాను ధాన్యం ఎగుమతి చేయాలని అమెరికా, ఈయూలు వివిధ రూపాల్లో ఒత్తిడి చేస్తున్నాయి. దేశీయంగా ఆహారధాన్యాల ధరలు వేగంగా పెరుగుతూ, ఆకలి కేకలు పెచ్చరిల్లుతున్నప్పటికీ, దాన్ని లెక్క చేయకుండా అభివృద్ధి చెందిన దేశాల కుట్రలకు తలొగ్గిన మోదీ ప్రభుత్వం ధాన్యం ఎగుమతి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే భరించగల పరిమితిని దాటి, 5 శాతానికి మించిన ద్రవ్యోల్బణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో, ఇలాంటి ఎగుమతులు రాబోయే ఎన్నికలకు నష్టదాయకంగా పరిణమిస్తాయన్న ముందుచూపుతో మోదీ ప్రభుత్వం ఆ ప్రయత్నాలను తాత్కాలికంగా విరమించుకుని, ఏవో నామమాత్రపు ఎగుమతులతో సరిపెట్టింది. గతంలో అఫ్ఘానిస్థాన్‌కు గోధుమలు, శ్రీలంకకు బియ్యం, ఆఫ్రికాకు ధాన్యాలు ఎగుమతులు చేసి గ్లోబల్‌ ఆహార భద్రతకు సహకారం అందించిన చరిత్ర ఇండియాకు ఉన్న మాట వాస్తవమే. అయితే మార్చి, ఏప్రిల్‌ మాసాలలో వడగాల్పుల కారణంగా దేశంలో గోధుమల దిగుబడి పెద్ద ఎత్తున తగ్గిపోయింది. ఏప్రిల్‌ 25న రైసినా సమావేశంలో ప్రపంచ ధాన్యం ధరలు తగ్గుదల నిమిత్తం గోధుమ ఎగుమతులను ఇండియా చేపడుతుందని ఈఏఎమ్‌ జయశంకర్‌ హమీ ఇచ్చినప్పటికీ, దేశంలో నెలకొన్న పరిస్థితి రీత్యా గోధుమ ఎగమతులు సాధ్యపడే అవకాశమే లేదు. ఇండియా చేస్తున్న ఎగుమతులు, క్రూడాయిల్స్‌, వంటనూనెలు మొదలైన అత్యవసర సరకుల దిగుమతుల నేపథ్యంలో గోధుమ ఎగుమతుల విషయంలో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. అయితే దేశ ఆహార భద్రత పణంగా పెట్టి, కార్పొరేట్‌ కార్యకలాపాల అవసరాలకు తలొగ్గితే ప్రజలు ఆకలి కేకలు, ఆకలి చావులకు బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. అంతర్జాతీయంగా ఆకలి కేకలకు కారణమైన అభివృద్ధి చెందిన దేశాల ఆధిపత్య పోరును, అందుకు వత్తాసు పలుకుతున్న మిగిలిన దేశాల పాలకవర్గాల ప్రజావ్యతిరేక విధానాలను అంతమొందించాల్సిన తరుణమిది. అందుకు అంతర్జాతీయ సమాజం 20వ శతాబ్దం ప్రారంభంలో లాగా (మొదటి ప్రపంచ యుద్ధ కాలంనాటి) అంతర్యుద్ధానికి సిద్ధపడవలసిన పరిస్థితి నెలకొంది.

వెన్నెలకంటి రామారావు

Updated Date - 2022-05-25T06:15:02+05:30 IST