ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2021-07-24T06:45:10+05:30 IST

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన
మత్తడిపోస్తున్న హన్మకొండలోని వడ్డెపల్లి చెరువు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మూడో రోజూ కుండపోత

నిండుకుండలా మారిన ప్రధాన జలాశయాలు

ఉప్పొంగుతున్న వాగులు.. మత్తడి పడుతున్న చెరువులు

పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌

గోదావరి ఉగ్రరూపం.. తీర ప్రాంతాల అప్రమత్తం

కాళేశ్వరం వద్ద మేడిగడ్డ బ్యారేజ్‌ గేట్లు ఓపెన్‌

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా : వాగులు ఉప్పొంగుతున్నాయి.. చెరువులు మత్తళ్లు దూ కుతున్నాయి.. రాకపోకలు స్తంభించిపోయాయి.. ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.. ఎటుచూసినా జలం.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా జలకళతో నిండుకుండలా మారింది. విరామం లేకుండా మూడోరోజూ వర్షాలు దంచి కొట్టాయి. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చి పరవళ్లు తొక్కుతుండగా,  మహబూబాబాద్‌, జనగామ, వరంగల్‌ రూరల్‌జిల్లాల్లో ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి. అలుపెరగని వానతో పంటలు నీటిపాలయ్యాయి. ఇక వరంగల్‌ నగరంలో  పలు కాలనీ లు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్న వరం సరస్సు 34 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంది. రెండున్నర ఫీట్ల ఎత్తుతో మత్తడి పడుతోంది. దయ్యాలవాగు, జంపన్నవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రామప్ప సరస్సు సామర్థ్యం 35 అడుగులు కాగా 33 అడుగులకు నీటిమట్టం చేరింది. మంత్రి సత్యవతి రాథోడ్‌ మంగపేట, రామన్నగూడెం గోదావరి పుష్క రఘాట్ల వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనం తరం ఏటూరునాగారం ఐటీడీఏలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులతో వరద సహాయక చర్యలపై స మీక్షించారు. గోదావరి కరకట్ట నిర్మాణ పనులను త్వరలోనే చేపడతామని అన్నారు. ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ ఏటూరునాగారం మండలంలోని వట్టివాగు బ్రిడ్జిని పరిశీలించి రాకపోకల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం సందర్శనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. బొగత వరద ఉధృతి పెరగడంతో భద్రత దృష్ట్యా సందర్శనను నిలిపివేస్తున్నట్లు పోలీసులు, అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. 


భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం 13.70 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతుండటంతో తుది ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. అన్నారం బ్యారేజీ నుంచి విడుదలవుతున్న నీటితో పాటు ప్రాణహిత నుంచి వస్తున్న 2లక్షల క్యూ సెక్కులతో కలిపి మొత్తం 11,30,090 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతుంది. దీంతో అధికారులు 79 గేట్లు ఎత్తి అంతే మొత్తాన్ని 11,30,090 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో 16.17టీఎంసీలకు గాను, 9.39టీఎంసీల నీటి నిల్వ ప్రస్తుతం ఉంది. సుందిళ్ల బ్యారేజీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి 6,39,890 క్యూసెక్కులా నీరు అన్నారం బ్యారేజీలోకి వస్తుంది. దీంతో 62 గేట్లను ఎత్తి 6,97,500 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం అన్నారం బ్యారేజీలో 10.87 టీఎంసీలకు గానూ, ప్రస్తుతం 4.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ములుగు జిల్లా కన్నా యిగూడెం మండలం తుపా కులగూడెంలోని సమ్మక్క బ్యారేజీ బ్యారేజీ 6.94 టీఎంసీల సామర్థ్యం ఉండ గా, ప్రస్తుతం 5.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌– 2, 3, తాడిచెర్ల ఉపరితల గనుల్లో  ఉత్పత్తి నిలిచిపోయింది.


మహబూబాబాద్‌ జిల్లాలో డోర్నకల్‌ వద్ద మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని మండలాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరినాట్లు కొట్టుకుపోయాయి. జిల్లాలోని అనేక చెరువులు మత్తళ్లు పోస్తుండగా, కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. బుధరావుపేట– మంగళవారిపేట మధ్య రోడు డైవర్షన్‌ కొట్టుకుపోయింది. కురవి మండలం తాళ్లసంకీస వద్ద చెరువు మత్తడి కారణంగా రోడ్డుపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ రెండు రూట్లలో ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి సత్యవతిరాథోడ్‌ అధికారులతో సమీక్షించారు. 


వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేట పట్టణంలో మాదన్నపేట చెరువు అలుగుపొస్తుండడంతో నర్సంపేట – నాగుళ్లపల్లి దారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సంపేట – నెక్కొండ రోడ్డులో ముగ్దుంపురం లోలెవల్‌ వంతెన వద్ద రాకపోకలు స్తంభించాయి. వరంగల్‌ – ములుగు రహదారిపై ఉన్న కటాక్షాపూర్‌ చెరువు కూడా మత్తడి పడేందుకు సిద్ధంగా ఉండడంతో పోలీసులు ఏర్పాట్లు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రూరల్‌ జిల్లాలోని మాదన్నపేట చెరువు, ఆత్మకూరు మండలం కటాక్షాపూర్‌ చెరువును దయాకర్‌రావు పరిశీలించారు. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు నీటిమట్టం 24 అడుగులు దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  రూరల్‌ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 1672.4 మి.మీ వర్షపాతం నమోదైంది. 


వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 88.5మి.మీ వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షాలతో అన్ని చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. వరంగల్‌ నగరంలో పలు కాలనీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మేయర్‌ గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు లోతట్టు ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషీ కూడా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. 


 జనగామ జిల్లాలో గురువారం రాత్రి 774.2మి.మీ వర్షపాతం నమోదయింది. కాగా భీభత్సం సృష్టించింది. జిల్లాలో బారీ వర్షంతో చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండిపోగా మత్తల్లు పరవల్లు తొక్కాయి. పలు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. జనగామ, బచ్చన్నపేట మండలాల్లో కుంటలకు గండ్లు పడ్డాయి. తరిగొప్పుల, రఘునాథపల్లి మండలాల్లో వరద ఉధృతికి బీటీ రోడ్లు తెగిపోయాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ వర్షాలకు జిల్లా కలెక్టర్‌ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.









Updated Date - 2021-07-24T06:45:10+05:30 IST