వరంగల్‌లో భారీ వర్షాలు...స్తంభించిన జనజీవనం

ABN , First Publish Date - 2021-09-07T19:15:25+05:30 IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

వరంగల్‌లో భారీ వర్షాలు...స్తంభించిన జనజీవనం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనజీనవం స్తంభించింది. మేడారం జంపన్నవాగు బ్రిడ్జి మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. వరంగల్ చౌరస్తా, హన్మకొండ బస్టాండ్‌లోకి వరద నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మూడు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. నిన్న సాయంత్రం నుంచి తీవ్రత ఎక్కువైంది.


హన్మకొండ సమ్మయ్యనగర్ ప్రాంతంలో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేక వరద నీరు రోడ్లపైకి వచ్చింది. ఎడతెరిపిలేని వర్షాలతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. పెద్దాపూర్‌ కేటీకే-3 ఓసీపీలో వెయ్యి టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌ పడింది. గణపురం మండలం వెల్తుర్లపల్లి, అప్పయ్యపల్లి మధ్య మోరంచవాగు పొంగిపొర్లుతున్నాయి. దీంతో దాదాపు 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెల్తుర్లపల్లి, అప్పయ్యపల్లి, బంగ్లపల్లి సీతారాంపురం, కొడంపల్లి, కొండాపూర్, నగరంపల్లి, వంగపల్లి చెరువుకు మత్తడి ఏర్పడింది. అటు గణపసముద్రం 30 అడుగులకు చేరుకుంది. ఇళ్లలోకి చేరిన వరద నీరు చేరడంతో పాటు పత్తి, వరి పంటలు నీట మునిగాయి. ములుగు జిల్లాలోని ఏజెన్సీ పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - 2021-09-07T19:15:25+05:30 IST