ఆమెకే మేయర్‌ పదవి..!

ABN , First Publish Date - 2021-05-07T06:52:15+05:30 IST

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌..

ఆమెకే మేయర్‌ పదవి..!

మేయర్‌ ఎన్నికకు సర్వం సిద్ధం 

జీడబ్ల్యూఎంసీ ఆవరణలో నేటి సాయంత్రం 3.30 గంటలకు ఎన్నిక ప్రక్రియ

కొవిడ్‌కు గురైన వారికి వీడియో కాల్‌ అవకాశం

మేయర్‌గా గుండు సుధారాణి దాదాపు ఖరారు

డిప్యూటీ మేయర్‌గా ఇండ్ల నాగేశ్వర్‌రావు..?


వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక శుక్రవారం జరుగనుంది. జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం వెనకాల గల ఇండోర్‌ స్టేడియం ప్రాంగణంలో నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లు చేతులెత్తి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు తమ అంగీకారాన్ని ఓటు రూపంలో తెలియచేస్తారు. మేయర్‌గా ఎన్నిక కావాలంటే 36 మంది కార్పొరేటర్ల కంటే ఎక్కువ మద్దతు కావాల్సి ఉంటుందని అధికారులు తెలియచేశారు. 


సాయంత్రం 3.30 గంటలకు కార్యక్రమం ఆరంభమవుతుంది. ఈ మేరకు అధికారగణం సర్వం సిద్దం చేస్తోంది. అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్‌, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సంధ్యారాణితో కలిసి ఎన్నిక పరిశీలకులు ఐఏఎస్‌ అధికారి కిషన్‌ ఇండోర్‌స్టేడియం ప్రాంగణాన్ని పరిశీలించారు. ఏర్పాట్లు, కొవిడ్‌ నిబంధనల మేరకు చేపట్టిన జాగ్రత్తలు తదితర అంశాలను చర్చించారు. తొలుత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తరువాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక  ముగిసిన అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. 


ఏర్పాట్ల పరిశీలన

ప్రమాణ స్వీకారం, ఎన్నిక నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎన్నిక పరిశీలకులు కిషన్‌, ప్రిసైడింగ్‌ అధికారి సంధ్యారాణి, పోలీస్‌ ఉన్నతాధికారులు తదితరులు పరిశీలించారు. భద్రతా చర్యల గురించి పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు. రాజకీయ పార్టీల వారిగా సిట్టింగ్‌ ఏర్పాట్లు, జోన్‌ల విభజన, వేదిక తదితర అంశాలను అధికారులు చర్చించారు. 


కరోనా భయం

నూతన కార్పొరేటర్లను కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే కొందరు వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారు. వీరు ఎన్నిక వేదిక వద్దకు రావాల్సిన అవసరం లేదు. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.  నూతన కార్పొరేటర్లలో 8 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు తెలిసింది. వీరు వీడియోకాల్‌ ద్వారా ప్రమాణ స్వీకారం, ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. వైరస్‌ బారిన పడిన వారి వద్దకు అధికారులు పీపీఈ కిట్లు ధరించి వెళతారు. వీడియోకాల్‌ ద్వారా తతంగం పూర్తి చేయిస్తారు. ఎన్నిక వేదిక వద్ద ఉన్న ఎలకా్ట్రనిక్‌ డిజిటల్‌ స్ర్కీన్‌పై ప్రీసైడింగ్‌ అధికారి సమక్షంలో అందరూ వీక్షిస్తారు. 66 మంది నూతన కార్పొరేటర్లు, ఎక్స్‌ఆఫీషియో సభ్యులు, ముఖ్యమైన అధికారులు మాత్రమే పాల్గొనేలా చర్యలు చేపట్టారు. 


ఉదయమే సమావేశం

రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం ఉదయమే నూతన కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. హన్మకొండలోని ఓహోటల్‌లో సమావేశం జరుగుతుంది. ఎన్నికల పరిశీలకులుగా అధిష్ఠానం నియమించిన గంగుల కమలాకర్‌రెడ్డి, ఇంద్రాకరణ్‌రెడ్డిలు కూడా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలోనే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను అలంకరించే వారి పేర్లు వెల్లడవుతాయనే అంచనాలు ఉన్నాయి. అభ్యర్థులందరినీ సమన్వయపరిచి, అధిష్ఠాన నిర్ణయాన్ని శిరసావహించేలా సిద్దం చేసే బాధ్యతలను మంత్రి దయాకర్‌రావు నిర్వహించానున్నారు. సమావేశం అనంతరం అందరూ నేరుగా వరంగల్‌ ఇండోర్‌ స్టేడియం ప్రాంగణానికి చేరుకోనున్నట్లు తెలిసింది. 


మేయర్‌గా సుధారాణి...

మేయర్‌ ఎవరనే విషయంలో అంతగాసందేహాలు లేవు. 29వ డివిజన్‌ నుంచి గెలిచిన గుండు సుధారాణిని అధిష్ఠానం మేయర్‌ పదవికి దాదాపుగా ఎంపిక చేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. డిప్యూటీ మేయర్‌పైనే సస్పెన్స్‌ నెలకొంది. డిప్యూటీ రేసులో ఇండ్ల నాగేశ్వర్‌రావు ముందంజలో ఉన్నారు. అయనకే ఈ పదవి దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో నాగేశ్వర్‌రావు పాత్ర ఆయనకు అనుకూలించే పరిణామంగా చెబుతున్నారు. అయితే ఆశావహుల్లో బోయినపల్లి రంజిత్‌రావు, దిడ్డి కుమార స్వామి, ఆవాల రాధిక రెడ్డి, రిజ్వానా షమీమ్‌, బైరబో యిన ఉమాయాదవ్‌, సురేష్‌జోషి తదితరుల పేర్లు కూడా ఉన్నారు. 



Updated Date - 2021-05-07T06:52:15+05:30 IST